Telangana Rains Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బీభత్సం ఏపీలో ఇంకా కొనసాగుతూనే ఉంది. భారీ వర్షాల కారణంగా గురువారం నదులు, వాగులు, కాల్వలు పొంగి ప్రవహించగా, చెరువు కట్టలు తెగిపోయి దక్షిణ కోస్తా, సీమ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. శుక్రవారం చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటిన విషయం తెలిసిందే. ఈ కారణంగా నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం, గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విపరీతంగా కురిశాయి. తీరప్రాంతంలో గంటకు 65కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి.
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు, భారీ వరదల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలిగింది. వందల ఎకరాల్లో పంట నీట మునిగింది. వరదల్లో చిక్కుకుపోయి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇక విపరీతంగా కురిసిన వర్షాల కారణంగా కడప జిల్లా అతకుతలమయ్యింది. చెయ్యేరు నది పరివాహక పరిధిలోని పల్లెలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో చెయ్యేరు వంతెన వద్ద వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద ఉధృతితో ఈ నది పరివాహక పరిధిలోని రాజంపేట, పులపత్తూరు, మందపల్లి శివాలయం ఘటన, బస్సు ప్రమాదం వేర్వేరు ఘటనల్లో30 మంది గల్లంతు కాగా.. శుక్రవారం రాత్రి వరకు 12మృతదేహాలు లభ్యమయ్యాయి.
పులపత్తూరు, మందపల్లి ఘటనలో 4మృతదేహాలు, బస్సు ఘటనలో 4మృతదేహాలు, గుండ్లూరు శివాలయం, మసీదులలో రెండు మృతదేహాలు, అన్నయ్యవారి పల్లెలో రెండు మృతదేహాలు లభ్యమయినట్లు జిల్లా కలెక్టర్ విజయరామరాజు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఈ ప్రమాదాలలో గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెప్పారు.
ఎన్డీఆర్ ఎఫ్ తో పాటు సహాయక బృందాలతో సమన్వయంతో ఉన్నామని.. రిలీఫ్ ట్రైన్స్, మెడిమల్ ఎక్యూప్ మెంట్ సిధ్ధం చేశాం, రిలీఫ్ స్టాఫ్ తో అలర్ట్ గా ఉన్నామని వాల్తేర్ డివిజన్ రైల్వే మేనేజర్ అనూప్ సత్పతి తెలిపారు.
ఎన్టీఆర్ ట్రస్ట్, టీడీపీ పార్టీ ద్వారా ముంపు గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టడంతోపాటు.. చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు చంద్రబాబు తెలిపారు. టీడీపీ శ్రేణులు బాధితులకు అండగా నిలిచి బాధితులకు ఆహారం అందించాలని సూచించారు.
ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు త్వరలో పర్యటించనున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో వరదల పరిస్థితులపై ఆయన పార్టీ నేతలతో సమీక్షించారు. వరద బాధితులకు పార్టీ శ్రేణులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వరద బాధితులకు ఆహారం, మందులతో పాటు చిన్న పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించాలని సూచించారు. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు కట్ట తెగిపోయే విధంగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో దిగువ ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఎగువ ప్రాంతాలకు వెళుతున్నారు. ఇప్పటికే అధికారులు చెరువు కట్ట తెగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరికలు జారీ చేశారు.
తిరుపతికి సమీపంలోని రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు తెగిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. చెరువు దిగువ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. మొరవ నుంచి నీరు వెలుపలికి పంపేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏపీలో కురుస్తోన్న భారీ వర్షాలకు చీరాలలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నగంరలోని వైకుంఠపురం, శ్రీరామనగర్, దండుబాట, విఠల్‌నగర్ ప్రాంతాలలో వర్షపు నీరు నిలిచింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఏపీలో భారీగా కురుస్తోన్న వర్షాల కారణంగా అన్నమయ్య రిజర్వాయర్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చెయ్యేరులో పరివాహాక గ్రామాల్లో పొంగి పొర్లుతున్న విషయం తెలిసిందే. వరద దాటికి చాలా మంది గల్లంతయ్యారు. వీరిలో కొన్ని మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే శుక్రవారం పలు మృతదేహాలు బయటపడగా.. తాజాగా శనివారం కొన్ని గుర్తు తెలియని మృతదేహాలు బయటపడ్డాయి. వరదలో కొట్టుకొచ్చిన వారెవరు అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడపకు చేరుకున్న సీఎం జగన్.. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్, అధికారులతో కలిసి ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు.
ఎన్పీ కుంట 237.2 మి.మీ
కదిరి 138.6 మి.మీ
నల్ల చెరువు 185.2 మి.మీ
చిత్తూరు 113 మి.మీ
చంద్రగిరి 96 మి.మీ
శ్రీకాళహస్తి 94 మి.మీ
రొంపిచర్ల 93 మి.మీ
యాదమర్రి 91.75 మి.మీ
రేణిగుంట 90 మి.మీ
పలమనేరు 79 మి.మీ
రాజంపేట వరదలో ఇరుక్కు పోయిన ఆర్టీసీ బస్సులో కండెక్టర్ మరణించిన విషయం తెలిసిందే. విధి నిర్వహణలో మరణించి కండెక్టర్ కుటుంబానికి ఆర్టీసీ అండగా నిలిచింది. ఈ క్రమంలో మృతి కుటుంబానికి రూ. 50 లక్ష పరిహారం ఇస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారక తిరుమలరావు తెలిపారు. కడప జిల్లాలో పర్యటించిన ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇక రాష్ట్రంలో వరదల కారణంగా 1800 ఆర్టీసీ సర్వీసులను రద్దు చేసినట్లు తెలిపారు. కడప, రాజంపేట మీదుగా తిరుపతికి ఈరోజు సర్వీసులను పూర్తిగా రద్దు చేసినట్లు తెలిపారు.
భారీగా వరద నీరు చేరుతుండడంతో పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో పెన్నా పరివాహక గ్రామాలు నీటితో నిండిపోతున్నాయి. ఉదయం 7 గంటలకు మూడు అడుగులు ఉన్న నీటి మట్టం 9 గంటల నాటికి 5 అడుగులకు చేరింది. కోవూరు మండలం పెనుబల్లి, కాకులపాడు గ్రామాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరుతుంది. దీంతో ప్రజలు గ్రామాలను వదిలి వెళుతున్నారు. అధికారులు కూడా ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు.
భారీ వర్షాల కారనంగా అనంతపురం కదిరి పట్టణంలోని పాత ఛైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న రెండతస్థుల భవనం కుప్పకూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇద్దరు ఇప్పటికే మృతి చెందారు. అయితే శిథిలాల కింద ఉన్న వారిని వెలికి తీశే క్రమంలో మరో మృతదేహాన్ని గుర్తించారు. 65 ఏళ్ల పాతీమాబి మృతదేహాన్ని వెలికి తీశారు. ఇదిలా ఉంటే శిథిలాల కింద మరో 7గురు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
తమిళనాడులో వాయుగుండం బలహీనంగా మారింది. ఉత్తర తమిళనాడు, రాయలసీమ, కర్నాటక రాష్ట్రాల్లోలో వాయుగుండం అల్పపీడనంగా మారింది. ఈ కారణంగా కోస్తాంద్ర, రాయలసీమాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తీరం వెండి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
గంటగంటకు పెరుగుతోన్న పెన్నా నది ఉధృతి కారణంగా నెల్లూరును వరద ముంచేసింది. సోమశిల నుంచి వస్తోన్న అవుట్ ఫ్లో కారణంగా నెల్లూరు నగరంలో వరద పెరిగింది. పెన్నా నదిని ఆనుకోని ఉన్న ఇళ్లన్నీ నీట మునిగిపోయాయి. ఇన్న మూడు అడుగుల మేర ఇళ్లలోకి నీరు చేరితే నేడు అది 6 అడుగులకు చేరింది. 9 గంటల తర్వాత మరింత ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ఇళ్లు మొత్తం నీట మునిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దీంతో వెంటనే అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు.
గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తోన్న భారీ వర్షాలకు తిరుమల, తిరుపతిలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలకు మాడవీధులు చెరువులను తలపించేలా వరద నీటితో నిండిపోయాయి. నడక మార్గాల్లో పెద్ద ఎత్తున చెట్లు కూలిపోవడంతో పాటు కొండచరియలు విరిగిపడుతున్నా్యి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలను టీటీడీ మూసేసింది. నిన్నంతా కురిసిన భారీ వర్షానికి శ్రీవారి మెట్ల మార్గం మొత్తం ధ్వంసమైంది. బండరాళ్లతో నిండిపోయింది. కొండల్లోని చెత్తాచెదారం, మట్టి మెట్ల మార్గం వద్ద పేరుకుపోయింది.
కడప జిల్లాపై వరుణుడు విరుచుకుపడ్డాడు. భారీ వర్షాలకు జిల్లా గజగజలాడిపోతోంది. చెయ్యేరు ఉధృతికి భారీ నష్టం వాటిల్లింది. చెయ్యేరు వంతెన వద్ద వరద కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ.. పులపత్తూరు, మందపల్లి శివాలయం వద్ద ఘటనలో ఇప్పటివరకు 12 మృతదేహాలు లభ్యమయ్యాయి. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నీటి ఉధృతి తగ్గుముఖం పట్టడంతో మృతదేహాలు ఇవాళ బయటపడే అవకాశముంది. రాత్రి గాలింపు చర్యలు నిలిపివేసిన NDRF, SDRF బృందాలు.. ఈ రోజు ఉదయం ప్రత్యేక పడవల్లో డెడ్‌బాడీస్ కోసం గాలిస్తున్నారు.
రాయలసీమలోని జిల్లాల్లో కురుస్తోన్న భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 24 వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 4869 క్యూసెక్కులుగా ఉంది. ఇక ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం 856.10 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నీటి నిల్వ 94.91 టీఎంసీలుగా ఉంది. కుడి, ఎడమ గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.
ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కాకరణంగా నెల్లూరు జిల్లాలో నదులు ఉగ్రరూపం దాల్చాయి. జల ప్రళయం సమీప గ్రామాలను ముంచెత్తుతోంది. నెల్లూరు జిల్లాలో పెన్ననది ఉప్పొంగి ప్రవహస్తోంది. భయం గుప్పిట్లో నది సమీప గ్రామాలయిన వెంగమ నాయుడుపల్లి, బండారుపల్లి, వీర్లగుడిపాడు, నడిగడ్డ అగ్రహారంలను పెన్నా వరద ప్రవాహం చుట్టు ముట్టింది. ఉపనదులు కొమ్మ లేరు, కేతా మన్నేరు, బొగ్గేరు, బీరాపేరు, నల్లవాగు పొంగి పొర్లతున్నాయి. కోవూరు మండలం పెనుబల్లి సహా..కాకులపాడు గ్రామాల్లోకి చేరింది వరదనీరు..ఇప్పటికే సోమశిల జలాశయం నుంచి నాలుగు లక్షల క్యూసెక్కుల నీటి విడుదల చేశారు. దిగువ నదుల నుంచి మరో రెండు లక్షల క్యూసెక్కుల వరదనీరు పెన్నా నదిలో కలుస్తోంది.
తుఫాన్ ప్రభావం తిరుపతిపై భారీగా కనిపిస్తోంది. ఈరోజు కూడా వర్షం కురుస్తోంది. తిరుమల కొండపై కురుస్తోన్న వర్షపు నీరు కిందికి వస్తుండడంతో నగరంలో వరద ఉధృతి పెరుగుతోంది. కపిల తీర్థంలో వర్షపు నీరు భారీగా వస్తోంది. వర్షాల నేపథ్యంలో అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాలతో పాటు పాపవినాశనం రహదారిని మూసివేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
భారీ వర్షాల కారణంగా అనంతపురం జిల్లా కదిరి పాత చైర్మన్ వీధిలో భవనం కుప్పకూలింది. గంటల తరబడి నీటితో తడవడంతో భవనం పక్కకు ఒరగడంతో మరో నాలుగు ఇళ్లపై పడింది. దీంతో నాలుగు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఇళ్లు కూలడంతో 12 మంది శిథిలాల్లో చిక్కుకున్నారు. శిథిలాల కింద ఉన్న నలుగురిని స్థానికులు వెలికితీశారు. అయితే వీరిలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరి పరిస్థితి విషయంగా ఉంది.
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కడప మీదుగా నడుస్తున్న పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లు దారి మళ్లించారు. వీటితో పాటు కొన్ని రైళ్లను రద్దు చేశారు. వీటిలో భాగంగా చెన్నై, తిరుపతి నుంచి కడప మీదుగా నడిచే రైళ్ల సర్వీసులు, రేణిగుంట గుంతకల్లు, గుంతకల్లు రేణిగుంట మధ్య నడిచే ప్యాసింజర్ రైల్వే సర్వీస్, కడప-విశాఖపట్నం, విశాఖపట్నం కడప మధ్య నడిచే తిరుమల ఎక్స్ ప్రెస్ రైలు, ఔరంగబాద్ రేణిగుంట, చెన్నై లోకమాన్య తిలక్, చెన్నై అహ్మదాబాద్, మదురై లోకమాన్య తిలక్ మధ్య నడిచే రైళు, వీటితో పాటు వెంకటాద్రి, రాయలసీమ ఎక్స్ ప్రెస్, ముంబై ఎక్స్ ప్రెస్, గోవా, హజ్రత్ నిజముద్దిన్ రైళ్లను అధికారులు దారి మళ్లించారు.
భారీ వర్షాలకు అతాలకుతలమైన కడపలో నేడు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. సీఎం ఉదయం 9.35 గంటలకు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం కడప విమానాశ్రయం నుంచి 10.30 గంటలకు హెలికాప్టర్ ద్వారా వరద బాధిత ప్రాంతాలను పర్యవేక్షించనున్నారు. అనంతరం తిరుపతి విమానాశ్రయానికి చేరుకుని గన్నవరం వెళ్లనున్నారు.