AP Rain: ఏపీ రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో కొన్ని జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయాయి. భారీ వరదల కారణంగా జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. దీంతో ప్రభుత్వం భారీ ఎత్తున చర్యలు చేపట్టింది. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్ ఫోర్స్, అగ్నిమాపక బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేసింది. నాలుగు జిల్లాల్లో వరదల్లో చిక్కుకుపోయిన 64 మందిని రక్షించారు.
సీఐ సహా ఏడుగురిని కాపాడిన బృందాలు:
ఇక వైఎస్సార్ జిల్లాలోని పాపాగ్ని నది వరదలో చిక్కుకుపోయిన ఓ వ్యక్తిని రోప్‌ల సహాయంతో కాపాడగా, హేమాద్రిపురంలో ఒక సీఐ సహా ఏడుగురిని రక్షించారు. అలాగే పాపాగ్ని నదికి గండి పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు, 20 వరకు పశువులు కొట్టుకుపోవడంతో సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించి కాపాడారు. అలాగే వరదల్లో చిక్కుకుపోయిన గర్భిణీని సైతం కాపాడారు. పలు జిల్లాల్లో వరద ఉధృతి కారణంగా సహాయక చర్యలు ముమ్మరం చేసి హెలికాప్టర్ ద్వారా రక్షించారు.
మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మందిని..
వైఎస్సార్ జిల్లాలో వరదలో చిక్కుకుపోయిన మూడు ఆర్టీసీ బస్సుల నుంచి 35 మంది వరకు సహాయక బృందాలు రక్షించాయి. ఈ సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్‌ఎఫ్, 9 ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎయిర్‌ఫోర్స్, ఫైర్ సిబ్బంది పాల్గొన్నాయి. ఈ బృందాలు ప్రాణాలకు తెగించి వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడటంలో నిమగ్నం అయ్యాయి. వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెండు హెలికాప్టర్లను ఉపయోగించారు.
నాలుగు జిల్లాల్లో 243 పునరావాస కేంద్రాలు:
నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో మొత్తం 243 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి 20,923 మందికి తరలించారు అధికారులు. వారికి ఆహారంతో పాటు బియ్యం, ఇతర సామాగ్రి ఉచితంగా అందించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తోంది.
వరద సహాయక చర్యల్లో నౌకాదళం:
భారీగా వరదలు ముంచెత్తడంతో సహాయక చర్యలలో తూర్పు నౌకాదళం నిమగ్నమైంది. నౌకాదళం హెలికాప్టర్ ద్వారా కడప జిల్లాలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి హెలికాప్టర్ ద్వారా ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్, ఇతర వస్తువులను అందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాలను ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే నిర్వహించారు. వారికి అన్ని విధాలుగా సాయం అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్.
ఇవి కూడా చదవండి: