AP CM YS Jagan: పరిషత్ ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయి.. విపక్షాల కుట్రలు, కుయుక్తులు చెల్లవుః వైఎస్ జగన్

|

Sep 20, 2021 | 12:50 PM

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

AP CM YS Jagan: పరిషత్ ఫలితాలు మరింత బాధ్యతను పెంచాయి.. విపక్షాల కుట్రలు, కుయుక్తులు చెల్లవుః వైఎస్ జగన్
Cm Ys Jagan
Follow us on

AP CM YS Jagan on Parishad Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించిన సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మాట్లాడారు. ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించామన్నారు. ఈ విజయం తనపైనా, ప్రభుత్వంపైనా మరింత బాధ్యతను పెంచిందన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వైసీపీకి ప్రజలు పట్టం కడుతూ వస్తున్నారని అన్నారు. ఈ రెండున్నరేళ్ల పాలనలో ప్రజలకిచ్చిన హామీలన్నింటినీ దాదాపు అమలు చేశామన్నారు సీఎం జగన్.

ప్రజలందరి చల్లని దీవెనలతో పరిషత్‌ ఎన్నికల్లో అఖండ విజయం సాధించగలిగామన్నారు సీఎం.ఈ ఫలితాలు ప్రతి కుటుంబం, ప్రతి మనిషి పట్ల తన బాధ్యతను మరింత పెంచాయని తెలిపారు. ఇప్పటికే 81 శాతం పంచాయతీల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను ప్రజలు ఎన్నుకున్నారని, మున్సిపల్‌ ఎన్నికల్లోనూ 99 శాతం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులే గెలిచారని తెలిపారు. 86 శాతం ఎంపీటీలు, 98 శాతం జడ్పీటీసీ స్థానాల్లో గెలిపిచారని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి ఎన్నికల్లో సడలని ఆప్యాయతను ప్రజలు అందిస్తున్నారని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని తెలిపారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కొన్ని శక్తులు ప్రయత్నించాయన్నారు.

ఇదిలావుంటే 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు విజయం సాధించారు. గతేడాది ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 13వేలకు పైచిలుకు పంచాయతీలకు గానూ 10,536 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులను గెలుపొందారు. మున్సిపల్ ఎన్నికల్లో 75 మున్సిపాలిటీల్లో 74 చోట్ల వైసీపీ విజయం సాధించింది. అలాగే 12 కార్పొరేషన్లలోనూ వైసీపీ విజయఢంకా మోగించింది. జడ్పీటీసీ, ఎంపీటి ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. 9,583 ఎంపీటీసీలకుగానూ.. 8,249 ఎంపీటీసులు కైవసం చేసుకుంది. 638 జడ్పీటీసీలకు 628 జెడ్పీటీసీలు విజయం సాధించి రాష్ట్రంలోని అన్ని జిల్లా పరిషత్‌లను సునాయాసంగా సొంత చేసుకుంది అధికార వైఎస్సార్‌సీపీ.

ఓ వైపు కొవిడ్.. మరోవైపు దుష్ప్రచారాల నడుమ పాలన సాగిస్తున్నామని జగన్ అన్నారు. అబద్ధాలను నిజం చేయడానికి కొన్ని కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని ప్రతిపక్షాలపై జగన్ విరుచుకుపడ్డారు. వారికి సంబంధించిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి.. ప్రస్తుతం సీఎంను దించేయాలని యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఓటమిని కూడా అంగీకరించలేని పరిస్థితుల్లో ఎన్నికల ఫలితాలకు వక్ర భాష్యాలు చెబుతున్నారని జగన్ విమర్శించారు. వైసీపీ గెలుపును జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. పార్టీ గుర్తుతో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ప్రభుత్వాన్ని దీవిస్తే.. దానికి కూడా జీర్ణించుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలను అడ్డుకునేందుకు నానా ప్రయత్నాలు చేశారు. కోర్టుకు వెళ్లి ఎన్నికలు అడ్డుకున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఆరు నెలల పాటు ఫలితాలు వాయిదా పడేలా చేశారు. ఏడాదిన్నర క్రితమే ఎన్నికలు జరిగి ఉంటే గెలిచిన అభ్యర్థులు కరోనా సమయంలో ప్రజలకు అండగా ఉండేవారని జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి అండగా నిలబడ్డ ప్రజలకు రుణపడి ఉంటామని జగన్ తెలిపారు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరింత భాధ్యతగా పనిచేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Read Also… TSRTC Chairman: తెలంగాణ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తాం.. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బాజిరెడ్డి గోవర్ధన్