రిమాండ్‌ ఖైదీ గురించి ఇలా మాట్లాడవచ్చా.. స్పీకర్ పోచారం వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ ఫైర్..

Botsa Satyanarayana on Pocharam Srinivas Reddy: స్కిల్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ సెగ తెలంగాణకు కూడా తాకింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును బీఆర్ఎస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తుండటంపై వైసీపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు.

Updated on: Sep 23, 2023 | 1:54 PM

Botsa Satyanarayana on Pocharam Srinivas Reddy: స్కిల్ స్కామ్ కేసు ఏపీ రాజకీయాల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ సెగ తెలంగాణకు కూడా తాకింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును బీఆర్ఎస్ నేతలు కొందరు వ్యతిరేకిస్తుండటంపై వైసీపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తాజాగా.. తెలంగాణ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చంద్రబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజ్యాంగ పదవిలో ఉండి చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ పేర్కొన్న ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న వ్యక్తి గురించి ఇలా మాట్లాడవచ్చా అని, వారి సీఎం కేసీఆర్‌ను అడిగితే చెబుతారంటూ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మాట్లాడవచ్చు కానీ.. వ్యవస్థలను తాకట్టు పెట్టేలా వ్యవహరించకూడదంటూ మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ.. ఏపీలో గత టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టు, తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై మరోసారి ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా చంద్రబాబు తాజాగా జడ్జితో తాను నీతిమంతుడినని చెప్పుకోవడం.. ఆయనకు తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మద్దతివ్వడంపై బొత్స ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా జీవితంలో ఉన్నవాళ్లు అవినీతి లేకుండా పాలన చేయాలంటూ బొత్స పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 371 కోట్లు ఇచ్చిన తర్వాత సీమెన్స్ ఇవ్వాల్సిన 2900 కోట్లు ఏమైయ్యాయంటూ ఆయన ప్రశ్నించారు. మధ్యలో డిజైన్ టెక్ కంపెనీ ఎందుకు వచ్చిందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. సీమెన్స్ కంపెనీని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదని బొత్స తెలిపారు. గుజరాత్లో సీమెన్స్ కంపెనీ నేరుగా ప్రాజెక్టు చేపట్టిందని, ఏపీలో అలా జరగలేదంటూ బొత్స సత్యనారాయణ వివరించారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందో అందరినీ నిందితులుగా చేరుస్తామని.. కేబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత చంద్రబాబు పాత్ర లేదని ఎలా చెబుతారంటూ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.

కాగా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై స్పందించిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికమంటూ వ్యాఖ్యానించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్ జరిగిందని, రాజకీయాల్లో ఇలాంటి తీరు సరికాదంటూ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని.. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని గుర్తించాలంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..