Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. తెలంగాణ ప్రభుత్వంపై కూడా..

|

Oct 01, 2022 | 3:22 PM

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి టు అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో..

Andhra Pradesh: అమరావతి రైతుల పాదయాత్రపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్.. తెలంగాణ ప్రభుత్వంపై కూడా..
Ambati Rambabu
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో అమరావతి టు అరసవల్లి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాట్ కామెంట్స్ చేశారు. కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు, తెలంగాణ ప్రభుత్వంపై కూడా మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. తమ వైపు వేలు చూపించే అర్హత కేసీఆర్, హరీష్‌ రావుకు లేదన్నారు. మామ అల్లుళ్ల మధ్య ఏవైనా తగదాలుంటే వారిద్దరే చూసుకోవాలని హితవు పలికారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తోందన్నారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకముందే, ప్రస్తుత సీఏం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తామో గడప గడపకు తిరిగి చెప్పామన్నారు. తన సుదీర్ఘమైన పాదయాత్రలో కూడా అనేక వాగ్దానాలు చేశారని.. వాటిని విశ్వసించిన ప్రజలు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించి, అధికారాన్ని అప్పగించారన్నారు. మూడేళ్ల తమ ప్రభుత్వ పరిపాలన పూర్తయ్యాక.. తమను అధికారంలోకి తీసుకొచ్చిన ప్రజల వద్దకు ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం పేరుతో వెళ్తున్నామని, తాము చేసిన వాగ్దానాల్లో ఏవేవి నెరవేర్చామో, ప్రతి ఇంటికి తిరిగి చెబుతున్నామన్నారు. మే నెలలో ప్రారంభమైన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ప్రారంభించి నాలుగు నెలలు పూర్తయిందని, ఇది ఒక విప్లవాత్మకమైన జవాబుదారీతనమని చెప్పారు. ఏ ఇంటికి వెళ్ళినా తమకు పథకాలు అందుతున్నాయని, అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, వైయస్సార్‌ చేయూత, వాహనమిత్ర, ఆసరా, చేదోడు తదితర పథకాలు వస్తున్నాయని లెక్కగట్టి మరీ చెబుతున్నారని, దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలను చూసినా, ఇంత జవాబుదారీతనంగా ప్రజల ముందుకు వెళ్లిన సంఘటన గతంలో లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు.

గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు 600కు పైగా వాగ్దానాలు చేశారని, వాటిని అమలు చేశారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం కంటే తాము గొప్ప కార్యక్రమాలు చేశామని టీడీపీవాళ్లు ఇంటింటికి వెళ్లి చెప్పగలుగుతున్నారా అని అన్నారు. అలా చెప్తే ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందని గమనించి చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు వెళ్లడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి వంతపాడే మీడియాకు కబడటం లేదంటూ ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుపై పలు మీడియాలు ప్రచారం చేస్తున్న కథనాలను జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. పోలవరం ప్రాజెక్ట్‌ గురించి రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగే విధంగా కథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపించారు. వారి కోరికలను వార్తలుగా రాస్తున్నారా అంటూ ప్రశ్నించారు.

అమరావతి రైతుల మహాపాదయాత్ర పై ఘాటు వ్యాఖ్యలు చేశారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అమరావతిని అత్యద్భుతంగా అభివృద్ధి చేసి, లక్షల కోట్లు అక్కడే పెట్టుబడులు పెట్టాలట.” ఒకే రాష్ట్రం… ఒకే రాజధాని. రెండో రాజధాని ఉండటానికి వీల్లేదని. అమరావతిలోనే, మా ఊర్లోనే రాజధాని కట్టాలని చంద్రబాబు నాయుడు బినామీలు కొంతమంది పాదయాత్ర చేస్తున్నారంటూ విమర్శించారు. మా ప్రభుత్వం విధానం వికేంద్రీకరణే అని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పామని, వికేంద్రీకరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రాష్ట్రంలోనే కాదు, పంచాయతీ స్థాయి వరకు వికేంద్రీకరణ విధానాన్ని తీసుకువెళ్ళగలిగామని, సామాన్యుడికి అతి దగ్గరగా పరిపాలన కేంద్రాలు ఉండాలని భావించిన ప్రభుత్వం, వికేంద్రీకరణలో భాగంగా తాము మూడు రాజధానులను నిర్ణయించామన్నారు. అమరావతి టూ అరసవల్లి అంటూ దేవుడిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడటం చాలా దురదృష్టకరమన్నారు. ఇది రైతుల పాదయాత్ర కానే కాదు కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ పాదయాత్రకు వ్యతిరేకంగా, మూడు ప్రాంతాల్లోని వెనుకబడిన వర్గాలవారు, గుండె రగిలి పోయేవాళ్లు, కడుపు మండేవాళ్లు పాదయాత్రలు ప్రారంభిస్తే దానికి బాధ్యత వహించవల్సింది చంద్రబాబు నాయుడేనంటూ హెచ్చరించారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలనే ఉద్దేశంతో ఫ్రస్ట్రేషన్‌తో చంద్రబాబు మాట్లాడుతున్నారని, పాదయాత్రలో ఒక్క రైతు అన్నా ఉన్నాడా.. అంతా తెలుగుదేశం వాళ్ల భజనే అంటూ విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ నాయకుల వ్యాఖ్యలపై కూడా మంత్రి అంబటి రాంబాబు ఘాటుగా స్పందించారు. మమ్మల్ని వేలు పెట్టి చూపించే అర్హత హరీష్ రావుకు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన వాటి గురించి గొప్పలు చెప్పుకుంటే తమకేమి అభ్యంతరం లేదని, తెలంగాణతో ఆంధ్రప్రదేశ్ ను పోల్చాల్సిన అవసరం వారికి లేదన్నారు. తన మామ కేసీఆర్‌కు, ఆయనకు ఏదైనా తగాదా ఉంటే అక్కడే తేల్చుకోవాలి తప్ప… మమ్మల్ని వేలుపెట్టి చూపించే అర్హత వారికి లేదన్నారు అంబటి రాంబాబు. తాము ఉమ్మడి రాష్ట్రం నుంచి విడిపోయినవాళ్లమని, రెవెన్యూ తక్కువగా ఉన్నా భారతదేశంలోనే అత్యద్భుతంగా సంక్షేమ కార్యాక్రమాలను అమలు చేస్తున్నది జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వమే అంటూ చెప్పారు. తమ ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపించే నైతిక అర్హత హరీశ్‌రావుకుగానీ, కేసీఆర్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికి లేదని అన్నారు. మమ్మల్ని వేలుపెట్టి చూపించాలనే ప్రయత్నం సరైన విధానం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మీరు బలహీనపడిపోతున్నారని… మమ‍్మల్ని వేలుపెట్టి చూపిస్తే మీరు బలపడతారని అనుకుంటున్నారా.. మీ మేనమామకు మీకు తగాదాలు ఉంటే దాన్ని రెచ్చగొట్టుకోవడానికి మా మీద ప్రయోగం చేస్తున్నారా అంటూ హరీష్ రావుపై  అంబటి రాంబాబు మండిపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..