AP Local Body Elections 2021: ఈసారి ఆంధ్రప్రదేశ్ పంచాయితీ పోరులో సరికొత్త స్ట్రాటజీ అవులవుతోంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కొత్త సంచలనంగా మారుతున్నారు. సవాళ్లు ప్రతి సవాళ్లను అధిగమిస్తూ ఎన్నికలకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వ సహకారం అంతంతగా ఉన్నా తన మార్క్ చూపిస్తున్నారు. అభ్యర్థుల నుంచి పోలీస్ డిక్లరేషన్ సర్టిఫికెట్ అడుగుతున్నారు. పోలీసు నిఘాతోపాటు ఎక్కడికక్కడ లోకల్ యాప్స్ ప్రవేశపెడుతున్నారు. కంప్లైట్ కోసం కాల్ సెంటర్‌లను ప్రారంభిస్తున్నారు. షాడో బృందాలను రంగంలోకి దింపుతున్నారు. ప్రత్యేకించి IFS ఆఫీసర్లను ఊళ్లలో ప్రత్యేక అధికారులుగా నియమించారు. జిల్లాల్లో పర్యటిస్తూ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు.
ఓవైపు నిమ్మగడ్డ తన రూటే సెపరేట్ అంటోంటే.. వైసీపీ మాత్రం ఆసలాయన ఎస్ఈసీ గానే పనికిరారూ అంటోంది. నిమ్మగడ్డకు స్పెషల్ డెఫినేషన్ ఇచ్చి.. ఎర్రగడ్డకు పంపాలని సెటైర్ వేశారు ఎంపీ విజయసాయి.
ఇదిలావుంటే, ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న చోట.. నామినేషన్ వేసేందుకు రేపు ఆఖరు తేదీ. కాని చాలా మంది అభ్యర్థులు ఇవాళే ఆఖరు తేదీగా భావిస్తున్నారట. ఎందుకంటే.. ఇవాళ మంచి రోజు ఉందని.. ఎక్కువ మంది ఇవాళ నేమినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారట.
నిన్న 1,315 మంది అభ్యర్థులు సర్పంచ్ స్థానానికి, 2,200 మంది అభ్యర్థులు వార్డు మెంబర్లుగా నామినేషన్లు దాఖలు చేశారు. ఫిబ్రవరి 4 వరకు ఉపసంహరణకు గడువు ఉంది. ఫిబ్రవరి 9న పోలింగ్ జరగనుండగా.. అదే రోజు ఫలితాలు వెలువడుతాయి.
కడప జిల్లా పర్యటనలో ఉన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఈ స్థితిలో ఉండేందుకు దివంగత సీఎం వైఎస్‌ఆర్ కారణమన్నారు. నిజాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ రాజశేఖర రెడ్డి ఇచ్చారని ఆయనతో తనకున్న అనుబంధాన్ని వ్యక్తపరిచారు. ఏ వ్యవస్థని ఎప్పుడూ తప్పు పట్టలేదని.. రాజ్యాంగ వ్యవస్థల పట్ల ఆయనకు అపార గౌరవం ఉండేది అన్నారు. ఆయన దగ్గర పని చేసినప్పుడు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని చెప్పుకొచ్చారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గర పనిచేయడం వల్లే తన జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అన్నారు. తాను రాజశేఖర రెడ్డి దగ్గర ఫైనాన్స్ సెక్రటరీగా పని చేశానని గుర్తు చేసుకున్నారు. తనకు వైఎస్ఆర్ ఆశీస్సులు ఉన్నాయని తెలిపారు. వైఎస్‌కు రాజ్యాంగం పట్ల గొప్ప గౌరవం ఉందని.. కీలక అంశాలలో భావ ప్రకటనా స్వేచ్ఛ కల్పించారన్నారు.
గ్రామాల్లో ప్రశాంత వాతావరణం ఉండకూడదనే విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆలోచనలను నిమ్మగడ్డ ముందుకు తీసుకెళ్తున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శలు గుప్పించారు. ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై శాసనసభా స్పీకర్‌కు సభాహక్కుల నోటీసులు ఇస్తామని తెలిపారు. నిమ్మగడ్డ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన రాస్తున్న లేఖల వెనుక చంద్రబాబు ఆదేశాలున్నాయని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసినట్లుగా నిమ్మగడ్డ మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు.
ప్రవీణ్ ప్రకాశ్ తొలగింపు ఆదేశాలు అమలుకాకపోవడంపై ఎస్‌ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారంపై మరోసారి సీఎస్‌కు ఎస్‌ఈసీ లేఖ రాశారు. ఎస్‌ఈసీ ఆదేశాలు అమలు చేయకపోవడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. తన ఆదేశాల ఉల్లంఘనపై తీవ్ర పరిణామాలు తప్పవన్న నిమ్మగడ్డ చెప్పారు. ఆదేశాలు అమలుచేయకుంటే కోర్టు ధిక్కరణ అవుతుందని ఎస్‌ఈసీ చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ జరగకుండా చూశానని ప్రవీణ్ అంగీకరించారని ఎస్‌ఈసీ వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఎజెండాలో భాగంగానే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ జిల్లాల పర్యటన జరుగుతోందని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తనకు పదవి ఇచ్చిన చంద్రబాబు రుణం తీర్చుకోవాలని నిమ్మగడ్డ భావిస్తున్నారన్నారు. దివంగత నేత వైఎస్సార్ అంటే తనకు అభిమానమని నిమ్మగడ్డ అంటున్నారని.. 2009లో మహానేత మరణిస్తే 2021లో నిమ్మగడ్డకు అభిమానం పుట్టుకొచ్చిందని ఎద్దేవా చేశారు. పెన్ను, కాగితం ఉందని లేఖలు రాస్తూ.. నిమ్మగడ్డ మీడియాకు లీకులు ఇస్తూన్నారంటూ మండిపడ్డారు.
గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని.. మంత్రుల పర్యటనలో అధికారులు ఉండకూడదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. గ్రామాల్లో మంత్రులు, నేతల పర్యటనను ప్రచారంగానే భావిస్తామన్నారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ… అధికార పర్యటన పేరుతో అభ్యర్థులకు ప్రచారం చేసేందుకు వీల్లేదన్నారు. పార్టీ కార్యాలయాలకు వెళ్లేటప్పుడు, ప్రెస్ మీట్ల కోసం ప్రభుత్వ భవనాలు, ఇతర మౌలిక సదుపాయాలను వినియోగించకూడదని లేఖలో ప్రస్తావించారు.
అసాధారణంగా ఏకగ్రీవాలు మంచిది కాదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కడప జిల్లా అధికారులతో చర్చించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏకగ్రీవాలపై షాడో బృందాలు కచ్చితంగా దృష్టి పెడతాయని ఎస్ఈసీ స్పష్టం చేశారు.
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలప్పుడు పోటీ కావాలనే పార్టీలు.. పంచాయతీ ఎన్నికలప్పుడు మాత్రం ఏకగ్రీవాలు కావాలనడం ఎంత వరకు సమంజసమని ఎస్ఈసీ నిమ్మగడ్డ ప్రశ్నించారు. సమాజంలో అట్టడుగున ఉన్న వారు కూడా ఎన్నికల్లో భాగస్వామ్యం అయినప్పుడే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందని అన్నారు. అందుకే ఏకగ్రీవాలు వద్దని అంటున్నామని స్పష్టం చేశారు. స్థానిక ప్రజల ఆమోదంతో జరిగే ఏకగ్రీవాలకు ఎస్ఈసీ ఏమాత్రం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
వైఎస్సార్ తర్వాత జరిగిన పరిణామాలతో వచ్చిన సీబీఐ కేసుల్లో తాను ప్రధాన సాక్షినని చెప్పారు నిమ్మగడ్డ రమేష్‌కుమార్. ఆ కేసుల్లో తాను నిర్భయంగా సాక్ష్యం చెబతానని, తనను ఎవరూ అడ్డుకోలేరని వ్యాఖ్యానించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు నిమ్మగడ్డ. ఆయన ఆశీస్సుల వల్లే ప్రస్తుతం తానీ పరిస్థితుల్లో ఉన్నానన్నారు. వైఎస్సార్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చే వారని చెప్పుకొచ్చారు.
అంతకుముందు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ శనివారం కడప జిల్లాలో పర్యటించారు. తొలిరోజు శుక్రవారం కడప జిల్లాలో నామినేషన్లు పెద్దగా దాఖలు కాలేదు. ఎన్నికల ఏర్పాట్లపై నిమ్మగడ్డ అధికారులతో సమీక్షించనున్నారు. ఇప్పటికే రాత్రి కడపకు చేరుకున్న ఆయన ఒంటిమట్టలో బస చేశారు. శనివారం ఉదయం నిమ్మగడ్డ కోదండరాముని దర్శించుకున్నారు. అనంతరం కడప జిల్లా కలెక్టరేట్‌లో అధికారుతో సమీక్ష నిర్వహించారు.
ఏకగ్రీవాలపై షాడో బృందాలు దృష్టి పెడతాయన్నారు. అందరికీ సమాన న్యాయం కల్పించాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ఏకగ్రీవాలన్నీ తప్పని చెప్పట్లేదని, అసాధారణంగా జరిగితేనే పరిశీలిస్తామన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో అసాధారణంగా నిర్వహించే ఏకగ్రీవాల ప్రక్రియ మంచిది కాదన్నారు. ఎన్నికలు సకాలంలో జరగాలని రాజ్యాంగం చెబుతుందన్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.
కడప జిల్లాలో పర్యటిస్తున్న ఆయన శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై జిల్లా అధికారులతో కడప కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల నిర్వహణపై తీసుకున్న చర్యలను కలెక్టర్ హరికిరణ్ ఎస్‌ఈసీకి వివరించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎన్నికల ఏర్పాట్లను ఎస్ఈసీ పరిశీలించారు.
కడప జిల్లాలో పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రాజ్యాంగ బద్దంగానే ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. పంచాయతీ ఎన్నికలను ఏ శక్తులు అడ్డుకోలేవని నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు