ఏపీ లిక్కర్‌ కేసు.. ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత..

సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్‌ నిందితుల్లో పలువురికి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు. ఇక కేసులో 12 మందిని సిట్ అధికారులు అరెస్ట్ చేయగా.. ఎంపీ మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్ లభించింది. అయితే.. ఎంపీ మిథున్ రెడ్డి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత.. మళ్లీ సరెండర్ కావాలని సూచించింది.

ఏపీ లిక్కర్‌ కేసు.. ఎంపీ మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్‌.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత..
Mp Midhun Reddy

Updated on: Sep 06, 2025 | 7:39 PM

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పలువురికి బెయిల్ లభించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ్‌ రెడ్డి, కృష్ణమోహన్‌ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు బెయిల్‌ విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే కేసులో అరెస్టయిన ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటువేసేందుకు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11న తిరిగి సరెండర్‌ కావాలని ఆదేశించింది. దీంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్‌రెడ్డి విడుదల అయ్యారు. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన ఎంపీ మిథున్‌రెడ్డి.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత.. తిరిగి సరెండర్‌ కానున్నారు.

ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న అరెస్ట్ చేశారు. ఈ కేసులో సీఎంఓ మాజీ కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి ఏ31గా, మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఏ32గా, బాలాజీ గోవిందప్ప ఏ33గా ఉన్నారు. ధనుంజయ్‌, కృష్ణమోహన్‌, బాలాజీ గోవిందప్పకు బెయిల్‌ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు.. రూ.లక్ష చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

మిథున్‌ రెడ్డి జులై 19, 2025న విజయవాడలో సిట్ విచారణ కోసం హాజరైన తర్వాత అరెస్టయ్యారు. ఆయనను ఏసీబీ కోర్టు రాజమండ్రి సెంట్రల్ జైలుకు జ్యుడీషియల్ రిమాండ్‌కు పంపింది. సిట్ రిమాండ్ రిపోర్టులో మిథున్ రెడ్డిని ప్రధాన కుట్రదారుడుగా పేర్కొంది. ఆయన ఎక్సైజ్ పాలసీలో మార్పులు, డిస్టిలరీల నుంచి లంచాల సేకరణలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపించింది.

చెవిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తీర్పు 10కి వాయిదా

ఇక ఈ కేసులో అరెస్టయిన నిందితుల్లో ఇప్పటివరకు నలుగురికి బెయిల్‌ లభించింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారించిన ఏసీబీ కోర్టు.. దీనిపై తీర్పును ఈ నెల 10కి వాయిదా వేసింది. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న వెంకటేష్‌ నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 9కి వాయిదా పడింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..