ఏపీ విద్యార్ధులకు అలెర్ట్. మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్లు రాష్ట్ర ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు, సెకండియర్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్స్‌ను నిర్వహించనున్నారు. ఇక విద్యార్ధులు హాల్ టికెట్ల కోసం జ్ఞానభూమి పోర్టల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. ఏ కళాశాలైన విద్యార్థులకు హాల్ టికెట్ పంపిణీకి ఫీజు డిమాండ్ చేస్తే తక్షణమే 18004257635 ట్రోఫీ నెంబర్‌కు సమాచారం అందించాలన్నారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1489 కేంద్రాల్లో జరగనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు సుమారు 10,03,990 మంది విద్యార్ధులు హాజరుకానున్నారు. వీరిలో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ 4,84,197 కాగా, సెకండియర్ విద్యార్ధులు 5,19,793గా ఉన్నారు. పూర్తిస్థాయి సీసీటీవీ కెమెరాల నిఘాలో ఇంటర్ పరీక్షలు జరుగుతాయని.. విద్యార్ధులు సరైన సమయానికి పరీక్షా కేంద్రాలు చేరుకునేందుకు ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. అటు పరీక్షలు జరుగుతున్న సమయంలో కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ షాపులను క్లోజ్ చేయించాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద వైద్య, నీటి సౌకర్యం ఏర్పాటు చేశామని.. జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తుంటారని రాష్ట్ర ఇంటర్మీడియట్ కార్యదర్శి శేషగిరి బాబు స్పష్టం చేశారు.