
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. మార్చిలో పంచాయతీ ఎన్నికలకు పదవీకాలం ముగియనుంది. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలను పూర్తి చేయడానికి అధికార వర్గాలు చర్యలు ప్రారంభించాయి. ఇదే సమయంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలంటే కోర్టుల డైరెక్షన్, చట్టపరమైన పరిమితులను అధిగమించాల్సి ఉంది. అందుకోసం డెడికేటెడ్ కమిషన్‌ను నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు వచ్చే మార్చితో వైసీపీ ప్రభుత్వంలో నియమించిన స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నీలం సాహ్ని పదవీ కాలం ముగియనుండడంతో ఈలోపు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ఆమె పదవీ విరమణ తరువాత ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కూటమి పార్టీలతో పాటు వైసీపీ కూడా స్థానిక ఎన్నికల కోసం శ్రేణులను సిద్ధం చేస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్ల అంశం స్థానిక ఎన్నికలను ఒక ఊపు ఊపనుంది. 34 శాతం స్థానిక రిజర్వేషన్ల పెంపు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీపై దృష్టి సారించడం కీలక అంశంగా మారింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 24 శాతం కోటాను 34 శాతం చేయడానికి జనాభా గణాంకాలు, ప్రతీ నియోజకవర్గంలో కులాల విభజన, సామాజిక వెనుకబాటుతనం వంటి వివరాలు అవసరం అవుతాయి. ఇందుకోసం నియమించబోయే డెడికేటెడ్ కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ డేటాను సేకరించనుంది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్ల శాతాన్ని ఖరారు చేయనుంది. నివేదిక సమర్పణ తర్వాత ప్రభుత్వ ఆమోదంతో పాటు కోర్టుల ఆమోదం లభిస్తేనే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది.
34 శాతం రిజర్వేషన్ అమలు చట్టపరంగా అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు అమలులో ఉంది. తెలంగాణ, మహారాష్ట్ర తాజా ఉదాహరణలు ఈ విషయంలో అనేక సలహాలను ఇస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచేందుకు సర్కార్లు చేసిన ప్రయత్నాలను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతేకాదు OBC రిజర్వేషన్లకు ట్రిపుల్ టెస్ట్ విధానం తప్పనిసరి అన్నదిఈ సుప్రీంకోర్టు అభిప్రాయం. అంటే కమిషన్ అధ్యయనం, వెనుకబాటుతనం నిర్ధారణ, రిజర్వేషన్ శాతానికి తగిన చట్టబద్ధత అన్నీ నిరూపించాల్సిందే.
ఎన్నికల క్యాలెండర్‌ను పరిశీలిస్తే.. ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీకాలం వచ్చే సెప్టెంబర్ చివరతో ముగుస్తుంది. జనవరిలో కమిషన్ ఏర్పాటైతే కనీసం మూడు నుంచి ఆరు నెలల కాలంలో నివేదిక రావచ్చు. ఆ నివేదిక వెంటనే ఆమోదం పొంది రిజర్వేషన్ల శాతం ఖరారైతే సెప్టెంబర్ – అక్టోబర్‌లో పరిషత్ ఎన్నికలు జరగడానికి అవకాశం ఉంటుంది. పంచాయతీల పదవీకాలం వచ్చే మార్చి వరకే ఉండటంతో ఇవి ముందేఈ జరపాలంటే పాత రిజర్వేషన్లతోనే వెళ్లాల్సి వస్తుంది. ఇలా వెళ్తే పొలిటికల్ గా ఎదురయ్యే సవాళ్లపైనా కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. అదే సమయంలో విద్యా క్యాలెండర్‌ను బట్టి కూడా ఎన్నికల షెడ్యూల్‌ను సిద్ధం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి చివరి నుంచి మార్చి చివరి వరకూ ఇంటర్, పదో తరగతి పరీక్షలు జరుగుతుండడంతో గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ బూతుల లభ్యత కష్టమై ఎన్నికల నిర్వహణ కష్టతరం అయ్యే అవకాశం ఉండడంతో అన్ని అంశాలను పరిశీలిస్తోంది ప్రభుత్వం.
ఇక రాజకీయ పార్టీల వ్యూహాలను పరిశీలిస్తే.. కూటమి ప్రభుత్వం బీసీలకు 34 శాతం అమలు చేస్తున్నామనే సంకేతాలను ఇస్తోంది. ఇదే సమయంలో పార్టీపరంగా బీసీలకు కనీస స్థాయి కోటా కేటాయించాలని కూడా ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వైసీపీ 24 శాతం కోటాతోనే ఎన్నికలకు వెళ్లగా, అప్పట్లో ఎలాంటి న్యాయవివాదం రాకపోవడంతో ఎన్నికలు సాఫీగా జరిగాయి. కానీ ఈసారి పరిస్థితి మారే అవకాశం ఉంది. కోటాపై ఏ తేడా వచ్చినా న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉండటంతో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది.
మరోవైపు కొత్త స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా కీలక మలుపు కానుంది. నీలం సాహ్ని పదవి ముగిసిన తర్వాత వచ్చే కొత్త కమిషనర్ చేతుల్లో ఎన్నికల నిర్వహణ ఉండే అవకాశం ఉంది. రిజర్వేషన్ల నిర్మాణం పూర్తి కావాలన్న అభిమతం ప్రభుత్వం వ్యక్తం చేస్తోంది. మొత్తం మీద పంచాయతీల నుంచి పరిషత్‌ల వరకు ఎన్నికల ప్రక్రియ, రిజర్వేషన్ సమీకరణ, న్యాయపరమైన సవాళ్లు లాంటి అంశాలే తాజా రాష్ట్ర రాజకీయాల్లో కీలకం కానున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.