రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక ఆ స్థలాలపై పూర్తి హక్కు లబ్ధిదారులదే!
రాష్ట్రంలోని పేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నెల్లూరులోని సర్వేపల్లి కట్ట ఇళ్ల పట్టాల పంపిణీని ప్రారంభించారు. రూ.600 కోట్ల విలువైన 22.31 ఎకరాల భూమిపై పేదలకు హక్కులు కల్పించారు.

దశాబ్దాలుగా ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత హక్కులు కల్పిస్తూ, వారి సొంతింటి కలను సాకారం చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. నెల్లూరులోని సర్వేపల్లి కట్టలో 22.31 ఎకరాల భూమిపై 939 కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం అమరావతిలోని క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. సుమారు రూ.600 కోట్ల విలువైన ఆస్తిపై పేదలకు హక్కులు కల్పించామని తెలిపారు. మొత్తం లబ్ధిదారుల్లో 701 మంది మహిళలు ఉండటం మహిళా సాధికారతకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. పట్టాలు అందుకున్న లబ్ధిదారులకు సీఎం అభినందనలు తెలియజేసి, ముందస్తుగా దసరా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో కలిసి పేదలకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం 28 నెలల పాలనలో ఆచరణలో చూపిస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధితో పాటు సుపరిపాలనకు నాంది పలికామని, పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం సుపరిపాలనలో భాగమని చెప్పారు. పేదల సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
పేదలకు భద్రత, శాశ్వత ఆస్తి
ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు భద్రత కల్పించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లో 60 వేల కుటుంబాలకు రూ.52,000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో అందించామని వెల్లడించారు. ప్రతి ఒక్కరికి భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూరాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని సీఎం స్పష్టం చేశారు.
గత ప్రభుత్వంలో పట్టాలు పొందేందుకు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా పేదలకు పట్టాలు అందిస్తున్నామని తెలిపారు. నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు రూ.900 కోట్ల విలువైన 2,600 ఇళ్ల పట్టాలను పేదలకు అందించినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా వివరించారు. వచ్చే సంక్రాంతి నాటికి మరో 4,000 పేద కుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాలు అందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది భగత్ సింగ్ కాలనీలో 1,407 కుటుంబాలకు 36 ఎకరాల భూమిపై పట్టాలు పంపిణీ చేసిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.
ఇళ్ల స్థలాలతో పాటు మౌలిక వసతులు
పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ఇంటర్నెట్ సదుపాయం, మరుగుదొడ్లు, రహదారులు, డ్రైనేజీ వంటి సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్లు అందించేలా కార్యాచరణ చేపట్టామన్నారు. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతులను మరింత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణాలను గ్రోత్ సెంటర్లుగా అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని చెప్పారు.
అవధుల్లేని ఆనందంలో లబ్దిదారులు
నెల్లూరులో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ లబ్ధిదారులకు శాశ్వత ఇళ్ల పట్టాలను స్వయంగా అందజేశారు. దశాబ్దాల నిరీక్షణకు తెరదించి పట్టాలు అందించిన ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ, ఇంకా లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ల పట్టాలు అందుకోవడంతో దసరా పండుగ ముందుగానే వచ్చిందని మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తమకు ఎంతో తోడ్పాటునిస్తున్నాయని తెలిపారు. లబ్ధిదారుల ఆనందానికి హద్దులు లేవని మంత్రి నారాయణ ముఖ్యమంత్రికి వివరించారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
