AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. మరికొన్ని గంటల్లో..

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాతకాలు మరికొద్ది గంటల్లో తేలిపోనున్నాయి. 70 శాతానికి పైగా పోలింగ్‌తో ఓటర్లు ఇచ్చిన తీర్పు ఎవరిని గెలిపించింది? ఎవరికి షాక్ ఇవ్వబోతుంది? శనివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో లెక్కింపు ప్రారంభం కానుంది. దాదాపు 40 వేల మంది ఎన్నికల సిబ్బంది, మూడంచెల పోలీసు భద్రత నడుమ ఈ ప్రక్రియ జరగనుండగా మధ్యాహ్నం 12 గంటల తర్వాతే తొలి ఫలితం వెలువడే అవకాశముంది.

Andhra Pradesh: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు అంతా రెడీ.. అభ్యర్థుల్లో టెన్షన్.. టెన్షన్.. మరికొన్ని గంటల్లో..
Mptc Zptc Election Counting Updates
Krishna S
|

Updated on: Nov 06, 2026 | 9:43 PM

Share

పల్లె సమరంలో అసలైన క్లైమాక్స్‌కు కొన్ని గంటలే ఉంది. స్థానిక సంస్థల పోరులో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న వేలాది మంది ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల నుంచి బయటకు రాబోతుంది. పల్లె ఓటరు ఇచ్చిన తీర్పు ఏమిటన్నది తేల్చేందుకు 28 జిల్లాల పరిధిలోని అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధం చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఎక్కడా ఎలాంటి గందరగోళం లేకుండా, పూర్తి పారదర్శకంగా ఓట్ల లెక్కింపును పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణను అమలు చేస్తున్నారు. ఈ నెల 5న నిర్వహించిన పోలింగ్‌లో గ్రామీణ ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 70.72 శాతం ఓటింగ్‌ నమోదు కావడం ద్వారా ఓటర్లు తమ ప్రజాస్వామ్య హక్కును ఘనంగా చాటుకున్నారు. అయితే తీవ్రమైన వర్షాలు, వరదల తాకిడికి గురైన ఐదు మండలాల్లో ఎన్నికలు వాయిదా పడగా వాటన్నింటికీ తాజాగా రీపోలింగ్ పూర్తి చేశారు. మరో మూడు జిల్లాల్లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా ఎస్‌ఈసీ ఆదేశాల మేరకు నిర్వహించిన రీపోలింగ్ కూడా సాయంత్రం 5 గంటలకు ప్రశాంతంగా ముగియడంతో కౌంటింగ్ మార్గం సుగమమైంది.

365 కేంద్రాలు.. 40 వేల మంది ఉద్యోగులతో మహా లెక్కింపు

ఎన్నికల ఫలితాల వెల్లడి ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నడిపించేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. 28 జిల్లాల పరిధిలో మొత్తం 365 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, పక్కాగా బారికేడ్లు, టేబుళ్లను సిద్ధం చేశారు. లెక్కింపు బాధ్యతలను పర్యవేక్షించేందుకు 11,000 మందికి పైగా సూపర్‌వైజర్లను నియమించగా, వారికి సహాయంగా మరో 28,500 మంది కౌంటింగ్ సిబ్బంది రంగంలోకి దిగుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల పరిసరాల్లో 144 సెక్షన్‌ అమలు చేయడంతో పాటు సీసీటీవీల పర్యవేక్షణ, కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. గుర్తింపు కార్డులు ఉన్న ఏజెంట్లు, అనుమతి పత్రాలు ఉన్న సిబ్బందిని మాత్రమే విస్తృత తనిఖీల తర్వాత లోపలికి పంపుతారు.

ఉదయం 8కి బ్యాలెట్ బాక్సులు ఓపెన్.. తొలి ట్రెండ్ మధ్యాహ్నానికే

నిబంధనల ప్రకారం ఉదయం 8:00 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపుతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. అనంతరం సాధారణ బ్యాలెట్ పెట్టెలను తెరిచి, ఓట్లను కట్టలు కట్టే ప్రక్రియను చేపడతారు. ఈ ఎన్నికలను బ్యాలెట్ పేపర్లతో నిర్వహించడంతో పాటు కట్టల విభజన, చెల్లని ఓట్ల పరిశీలన వంటి ప్రక్రియలు ఉండటంతో ఫలితాల వెల్లడికి కాస్త సమయం పట్టే అవకాశముంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలైనప్పటికీ, తొలి రౌండ్ అధికారిక ఫలితాలు లేదా సరళి స్పష్టత రావడానికి కనీసం నాలుగు గంటల సమయం పట్టవచ్చని ఎన్నికల అధికారులు చెబుతున్నారు. మధ్యాహ్నం తర్వాత నుంచి ఒక్కొక్క స్థానం ఫలితం వెలువడనుంది.

Follow Us