తక్కువ ఖర్చుతో మీ పాత కారునే ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోండిలా.. మస్త్ పైసల్ ఆదా..
పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో చాలామంది ఎలక్ట్రిక్ కార్ల వైపు చూస్తున్నారు. కానీ కొత్త ఈవీ కొనాలంటే కనీసం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు బడ్జెట్ ఉండాల్సిందే. మరి అంత బడ్జెట్ లేని సామాన్యుల పరిస్థితి ఏంటి? దీనికి ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది.. మీ ఇంట్లో ఉన్న పాత పెట్రోల్ లేదా డీజిల్ కారునే తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోవచ్చు. అసలు పాత కారును ఈవీగా ఎలా మార్చాలి..? దానికి అయ్యే ఖర్చు, ఆర్టీవో రూల్స్ గురించి తెలుసుకుందాం.

దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా విస్తరిస్తుంది. పెరుగుతున్న ఇంధన ధరల నుంచి తప్పించుకునేందుకు చాలామంది ఈవీల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇంట్లో ఉన్న పాత పెట్రోల్ లేదా డీజిల్ కారునే ఎలక్ట్రిక్ కారుగా మార్చుకునే ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. అసలు పాత కారును ఈవీగా మార్చడం సాధ్యమేనా? దానికి ఎంత ఖర్చవుతుంది? చట్టపరమైన నిబంధనలు ఏంటి? అనే వివరాలు తెలుసుకోవడం ముఖ్యం.
పాత కారును ఈవీగా మార్చడానికి అయ్యే ఖర్చు ఎంత?
మారుతి ఆల్టో, వాగన్ఆర్, స్విఫ్ట్, హ్యుందాయ్ శాంట్రో, ఐ10 వంటి చిన్న తరహా కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు మార్కెట్లో పలు రెట్రోఫిట్ కిట్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రాథమిక ఈవీ కన్వర్షన్ కిట్ ధర సుమారు రూ.2.25 లక్షల నుంచి మొదలవుతుంది. ఇందులో ఎలక్ట్రిక్ మోటార్, కంట్రోలర్ మరియు ఒక చిన్న బ్యాటరీ లభిస్తాయి. కారులో ఏసీ సదుపాయం కావాలంటే అదనపు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. కిట్ అమరిక, ఆర్టీవో రిజిస్ట్రేషన్ మార్పుల ఖర్చులన్నీ కలిపితే మొత్తం బడ్జెట్ రూ.2.60 లక్షల నుంచి రూ.2.85 లక్షల మధ్య ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 250 నుంచి 300 కిలోమీటర్ల వరకు ప్రయాణించే పెద్ద బ్యాటరీ ప్యాక్ కావాలనుకుంటే, ఖర్చు ₹4 లక్షల నుంచి ₹8 లక్షల వరకు చేరుకుంటుంది.
ఏటా రూ. 1.15 లక్షల వరకు ఆదా..
పాత కారును ఎలక్ట్రిక్‌గా మార్చుకోవడం వల్ల ప్రధానంగా ఇంధన ఖర్చులు భారీగా తగ్గుతాయి. ఉదాహరణకు.. లీటరుకు 12 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే పెట్రోల్ కారులో మీరు రోజుకు 40 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నారనుకుందాం. అప్పుడు నెలకు పెట్రోల్ కోసమే సుమారు రూ.10,500 వరకు ఖర్చవుతుంది. అదే కారును ఈవీగా మార్చిన తర్వాత ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవడం ద్వారా నెలకు కేవలం రూ.700 విద్యుత్ ఖర్చుతో అదే దూరం ప్రయాణించవచ్చు. ఈ లెక్కన ఏడాదికి సుమారు రూ.1.15 లక్షల వరకు ఆదా అవుతుంది. అంటే కన్వర్షన్ కిట్ కోసం పెట్టిన పెట్టుబడి కేవలం 2.5 నుంచి 3 సంవత్సరాలలోనే తిరిగి వచ్చేస్తుంది.
చట్టపరమైన నిబంధనలు తప్పనిసరి
భారతదేశంలో పాత కార్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి చట్టబద్ధమైన అనుమతి ఉంది. అయితే కొన్ని నియమాలను కచ్చితంగా పాటించాలి.
- మీరు కొనుగోలు చేసే ఈవీ కన్వర్షన్ కిట్‌కు ARAI లేదా ICAT సంస్థల ధృవీకరణ తప్పనిసరిగా ఉండాలి.
- కిట్ అమర్చిన తర్వాత, సంబంధిత ఆర్టీవో కార్యాలయంలో వాహనం రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌పై ఇంధన రకాన్ని పెట్రోల్, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్‌గా అప్‌డేట్ చేయించాలి.
- వాహనంలో చేసిన ఈ మార్పు గురించి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ముందస్తుగా సమాచారం అందించి పాలసీని అప్‌డేట్ చేసుకోవాలి.
ఎవరికి ఈ ఆప్షన్ ప్రయోజనకరం?
పాత కారును ఈవీగా మార్చుకోవడం అందరికీ లాభదాయకం కాకపోవచ్చు. మీ పాత కారు బాడీ, ఇంజిన్ భాగాలు మంచి కండిషన్‌లో ఉండి.. మీరు ప్రతిరోజూ నగర పరిధిలో కేవలం 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణించే వారైతే ఈ విధానం ఉత్తమంగా పనిచేస్తుంది. కొత్త ఎలక్ట్రిక్ కారుపై భారీగా పెట్టుబడి పెట్టలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.
