
రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పరిశ్రమల స్థాపనకు భూముల కేటాయింపుల్లో అడ్డంకిగా మారిన కీలక అంశాన్ని ప్రభుత్వం తొలగించింది. 22-ఏ కింద నిషేధిత జాబితాలో ఉన్న ఏపీఐఐసీ భూములను తొలగింపునకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రజలకు పరిహారం చెల్లించిన అనంతరం ఏపీఐఐసీ చేతిలో ప్రభుత్వ భూములు, డీకెటీ భూములును నిషేధిత జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి అభ్యంతరాలు లేని 70 వేల ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి అనుమతించింది.
ప్రస్తుతం ఏపీఐఐసీ స్వాధీనంలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 51,603.46 ఎకరాల భూముల మ్యుటేషన్‌కు ప్రభుత్వం అనుమతించింది. వీటిలో 32,723ఎకరాల ప్రభుత్వ భూములు, 12 వేల 99 ఎకరాల డీకెటీ భూములు, 6,780 ఎకరాల పట్టా భూములు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు, లేదా వెబ్‌ల్యాండ్‌లో ఏపీఐఐసీ పేరు మీద భూములను మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి చర్యలు తీసుకోవాలని సంబంధిత జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సబ్ రిజిస్ట్రార్ల ద్వారా నిషేధిత జాబితా నుంచి తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్. యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశవిదేశాల నుంచి పెద్ద పెట్టుబడులు రాబడుతున్నారు. ఈ క్రమంలోనే పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములను ఏపీఐఐసీ ద్వారా కేటాయిస్తున్నారు. అయితే సెక్షన్ 22-ఏ అడ్డంకిగా మారింది. దాదాపు 70 వేల ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22-ఏ కింద నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నాయి. వీటివల్ల ఈ భూముల్లో పరిశ్రమలు స్థాపిస్తున్న నిర్వహకులు ఆస్తులను బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణాలు పొందలేకపోతున్నారు. అలాగే, అధికారికంగా భూ కొనుగోలు లేదా లీజు ఒప్పందాలు చేసుకోవడానికి వీలు లేకపోవడంతో పాటు, పరిశ్రమల నిర్మాణం పూర్తయ్యాక కూడా యాజమాన్య హక్కులపై అనిశ్చితి నెలకొంది. ఈ సాంకేతిక ఇబ్బందుల వల్ల రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం బాగా ఆలస్యమై, పెట్టుబడులు రావడం, స్థానికులకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది.
ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకుగాను ఏపీఐఐసీ భూములను 22-ఏ జాబితా నుంచి తొలగించాలని రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో పారిశ్రామికవేత్తలకు లైన్ క్లియర్ కావడంతో.. బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి వీలవుతుంది.
మరోవైపు 1.5 లక్షల ఎకరాల దేవాదాయ భూములను సైతం నిషేధిత జాబితా నుంచి తొలిగించే ప్రక్రియను త్వరలోనే ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు కసరత్తు మొదలుపెట్టింది. 2011లో దేవాదాయ శాఖకు చెందిన భూములను నిషేధిత జాబితాలో చేర్చే కార్యక్రమంలో ఇతరులకు చెందిన భూములను కూడా ఇందులోకి చేర్చారు. దీంతో యాజమానులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..