
విద్యావిధానంలో సరికొత్త సంస్కరణలు తీసుకొచ్చేందుకు జగన్ సర్కార్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సెమిస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. 2023-24 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు రెండు సెమిస్టర్లు ఉండనుండగా, 2024-25 విద్యా సంవత్సరం నుంచి పదో తరగతిలో రెండు సెమిస్టర్‌ల విధానం అమలు కానుంది. అలాగే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే రెండు సెమిస్టర్లకు సంబంధించిన పుస్తకాలను జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు పంపిణీ చేయనున్నారు. కాగా, ఇప్పటికే ఏపీ సర్కార్ ప్రభుత్వ పాఠశాలల్లో CBSE కరికులం ప్రవేశపెట్టిన విషయం విదితమే.