ఆంధప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వీఆర్‌వోల సుదీర్ఘ కాల డిమాండ్‌ను సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించింది. గ్రేడ్–1, 2 గ్రామ రెవెన్యూ అధికారుల(వీఆర్‌వో)కు సంబంధించిన కారుణ్య నియామాకల విషయంలో ఉత్తర్వులు జారీ చేసింది. సర్వీస్‌లో ఉన్న గ్రేడ్–1, 2 వీఆర్‌వో మరణిస్తే అతని కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకానికి అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఏపీ వీఆర్‌వో సర్వీస్ నిబంధనలు–2008 లో మార్పులు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రేడ్ 1, 2 వీఆర్‌వో కుటుంబంలో డిగ్రీ విద్యార్హత ఉన్న భాగస్వామి/ పిల్లలకు కారుణ్య నియామకం కింది ఉద్యోగం ఇవ్వనున్నారు. మరణించిన ఉద్యోగుల వారసులకు జూనియర్ అసిస్టెంట్, ఈ క్యాడర్‌కు సమానమైన ఉద్యోగాల్లో అవకాశం కల్పిస్తారు. ఇదిలా ఉంటే వీఆర్‌ఓ ఉద్యోగాల్లో కారుణ్య నియామకాల డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది.
గత కొన్నేళ్లుగా ఈ డిమాండ్ ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉద్యోగుల డిమాండ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నో ఏళ్ల కల సాకారం కావడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయంపై ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, వీఆర్‌వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..