పులుల సంరక్షణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మరింత బలమైన రక్షణ
రాష్ట్రంలో పులుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, వన్యప్రాణుల భద్రతకు ప్రభుత్వం మరింత ప్రాధాన్యం ఇచ్చింది. నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్ (NSTR) పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా ఈ స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది..

అమరావతి, ఆగస్ట్ 31: వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్–1972లోని సెక్షన్ 38U కింద G.O.Ms.No.42 ద్వారా ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కమిటీకి చైర్‌పర్సన్‌గా, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి వైస్ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. PCCF & HoFF, ట్రైబల్ వెల్ఫేర్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సహా పలువురు ఉన్నతాధికారులకు సభ్యత్వం కల్పించారు. ప్రాజెక్ట్ టైగర్ నంద్యాల ఫీల్డ్ డైరెక్టర్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటారు. వన్యప్రాణి నిపుణులు డా లక్ష్మీరాణి, మూర్తి కాంతిమహంతికి కూడా చోటు కల్పించారు. స్టేట్ ట్రైబల్ కౌన్సిల్ నుంచి ఇద్దరు సభ్యులను నియమించారు.
పులులు మాత్రమే కాదు.. మొత్తం పర్యావరణ వ్యవస్థపై దృష్టి
ఈ కమిటీ ప్రధానంగా NSTRలో పులుల సంరక్షణతో పాటు కో-ప్రిడేటర్లు, ప్రే స్పీషీస్, వాటి ఆవాసాల రక్షణ, పర్యవేక్షణ, భద్రతా చర్యలు వంటి అంశాలపై సమన్వయంతో పనిచేయనుంది. పులుల సంఖ్య పెరగాలంటే కేవలం పులులను రక్షించడం మాత్రమే కాకుండా, వాటికి అవసరమైన ఆహార జంతువులు, నీటి వనరులు, అటవీ ఆవాసాలు కూడా సమృద్ధిగా ఉండాలి. ఈ సమగ్ర విధానానికే స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ ప్రాధాన్యం ఇవ్వనుంది. వైల్డ్‌లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్‌లోని సెక్షన్ 38U ప్రకారం పులుల పరిధి ఉన్న రాష్ట్రాలు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (NTCA) తాజా వార్షిక నివేదిక ప్రకారం అన్ని టైగర్ రేంజ్ రాష్ట్రాల్లో ఈ కమిటీలు ఏర్పాటు అయ్యాయి. వీటి ద్వారా పులుల సంరక్షణ, రక్షణ, పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో సమన్వయం కల్పించడంతో పాటు కమిటీలు క్రమం తప్పకుండా సమావేశమయ్యేలా NTCA రాష్ట్రాలను కోరుతోంది.
కమిటీలో ముఖ్యమంత్రితో పాటు అటవీ, వన్యప్రాణి, గిరిజన సంక్షేమ శాఖల అధికారులు, టైగర్ రిజర్వ్‌ల ఫీల్డ్ డైరెక్టర్లు, వన్యప్రాణి నిపుణులు, గిరిజన ప్రతినిధులకు ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా సంరక్షణ అంశాలతో పాటు అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రయోజనాలను కూడా పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. చట్టంలోని 38U ప్రకారం పులులు, కో-ప్రిడేటర్లు, ప్రే జంతువుల రక్షణ, సంరక్షణ, పర్యవేక్షణ, సమన్వయం ఈ కమిటీ ప్రధాన బాధ్యతల్లో ఉన్నాయి.
NSTRకు మరింత బలమైన రక్షణ వ్యవస్థ
దేశంలోని ఇతర టైగర్ రిజర్వుల్లో కూడా పులుల మరణాలు, అక్రమ వేట, ఆవాసాల పరిరక్షణ, గ్రామాల పునరావాసం వంటి అంశాలపై కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో పర్యవేక్షణ వ్యవస్థలు కొనసాగుతున్నాయి. NTCA పులుల మరణాల వివరాలను రాష్ట్రాల నుంచి సేకరించి పర్యవేక్షిస్తోంది. 2026 జాబితాలో NSTRలో కూడా పులి మరణానికి సంబంధించిన ఒక ఘటన నమోదైంది. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటైన స్టేట్ లెవల్ స్టీరింగ్ కమిటీ NSTRలో సంరక్షణ చర్యలకు మరింత రాజకీయ, పరిపాలనా ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉంది. అటవీ శాఖతో పాటు గిరిజన సంక్షేమం, ఇతర సంబంధిత శాఖలు, నిపుణులు ఒకే వేదికపైకి రావడం ద్వారా పులుల రక్షణకు సమగ్ర కార్యాచరణ రూపొందించవచ్చు. పులుల సంఖ్య పెంచడమే లక్ష్యం కాకుండా.. పులులకు సురక్షితమైన ఆవాసాలు, సమృద్ధిగా ఆహారం, మెరుగైన రక్షణ వ్యవస్థ, స్థానిక గిరిజన సమాజాల భాగస్వామ్యంతో NSTRను మరింత బలోపేతం చేయడమే ఈ కమిటీ ఏర్పాటులో కీలక ఉద్దేశంగా నిలవనుంది.




