Minister Adimulapu Suresh on Schools Sanitation: రాష్ట్రంలో చేపట్టిన విద్యా సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు పనిగట్టుకొని అసత్య ప్రచారాలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లే కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని, ప్రజలకు వాస్తవాలు తెలుసునని ఆయన అన్నారు. ఇటీవల కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులచేత మరుగుదొడ్లు శుభ్రం చేస్తున్నారంటూ ఉద్దేశపూర్వకంగా ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో, కొన్ని పత్రికల్లో అసత్య కథనాలు ప్రచారం చేయడంపై ఆయన తీవ్రంగా స్పందించారు.
రాష్ట్రంలో పాఠశాలల మరుగుదొడ్లు శుభ్రం చేసేందుకు గాను అమ్మ ఒడి కింద ఇచ్చే నగదు నుంచి వెయ్యి రూపాయల చొప్పున దాదాపు రూ. 444. 89 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామన్నారు. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 45,716 పాఠశాలల్లో ఇప్పటికే ఆయాలను నియమించడం జరిగిందన్నారు. 300 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ఒకరు, 600 మంది ఉన్న పాఠశాలలో ఇద్దరు, 900 మంది ఉన్న పాఠశాలల్లో ముగ్గురు, 900 పైబడి విద్యార్థులు ఉన్న పాఠశాలలో నలుగురు చొప్పున అయాలను నియమించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఆయాలకు నెలకు రూ. 6,000 చొప్పున నెల జీతం చెల్లించడం జరుగుతుందన్నారు.
అంతేకాకుండా పాఠశాలల పరిసరాల శుభ్రంగా ఉంచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి.. మరుగుదొడ్ల పరిశుభ్రతకు ప్రత్యేకంగా కెమికల్ కిట్లను కూడా సరఫరా చేయడం జరిగిందన్నారు. మరుగుదొడ్ల పరిశుభ్రతపై గ్రామ సచివాలయ ఉద్యోగుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పర్యవేక్షణ జరుగుతుందన్నారు. వాస్తవాలను కప్పిపుచ్చి ప్రజల్లో తప్పుడు ప్రచారం చేయడం కోసం కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతం అవుతున్న సంగతి ప్రజలంతా అంగీకరిస్తున్నారని, దీనిని జిర్ణించుకోలేని కొందరు ఏవిధంగానైనా తప్పుడు ప్రచారాలతో ప్రభుత్వానికి అప్రతిష్ట తేవాలని ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కానీ, ప్రజలంతా వాస్తవాలు తెలుసుకొని రాష్ట్రంలో అమలవుతున్న విద్యా పథకాలకు ప్రశంసలు కురిపిస్తున్నారని అన్నారు.
Read Also… మీరు US వెళ్లేందుకు సిద్దమవుతున్నారా..! అయితే తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోండి..