Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ..? పోలీసుల అదుపులో డ్రైవర్.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక

|

May 22, 2024 | 9:27 PM

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. త్వరలో పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు ఏపీ డీజీపీ..

Andhra Pradesh: పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎక్కడ..? పోలీసుల అదుపులో డ్రైవర్.. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీ డీజీపీ నివేదిక
Pinnelli Ramakrishna Reddy
Follow us on

మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్‌కు ఈసీ ఆదేశించడంతో ఏపీ పోలీసులు లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే రామకృష్ణారెడ్డి ఏ1 నిందితుడిగా కోర్టులో మెమో దాఖలు చేశారు. సంగారెడ్డి జిల్లా కందిలో పిన్నెల్లి కారు గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పిన్నెల్లి కోసం నాలుగు పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలోనే పిన్నెల్లిని అరెస్ట్ చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు ఏపీ డీజీపీ.. పిన్నెల్లిపై లుక్‌ఔట్‌ నోటీసులు జారీ చేశామని.. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని తెలిపారు.

మాచర్ల ఘటనపై సీరియస్ అయిన కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ సీఈవోకు నోటీసులు పంపింది. ఈవీఎం ధ్వంసం ఘటనపై వివరణ కోరింది. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ ఘటనలో ఉన్నది ఎమ్మెల్యేనా? ఎమ్మెల్యే అయితే ఇంతవరకు కేసు ఎందుకు నమోదు చేయలేదు? కేసు పెడితే ఎమ్మెల్యేని నిందితుడిగా చేర్చారా? నిందితుడిగా చేరిస్తే ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారా? లేదా? ఒకవేళ కేసు పెట్టకపోతే వెంటనే ఎఫ్‍ఐఆర్ నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

పోలింగ్ రోజు ఈవీఎం ధ్వంసం, ఆ తర్వాత వీడియోలు బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై సీఈఓ మీనా వివరణ ఇచ్చారు. మాచర్లలో 7 ఘటనలు జరిగాయన్న ముఖేష్‌ కుమార్‌ మీనా.. ఈవీఎం ధ్వంసంపై సిట్‌ పోలీసుల నుంచి వివరాలు తీసుకున్నామన్నారు. అన్ని వీడియోలు పరిశీలించాక ఈ నెల 20న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎ1 నిందితుడిగా చేర్చుతూ కేసు నమోదు చేశామన్నారు ఏపీ సీఈఓ.

దీనిపై వైసీపీ ఎన్నికల సంఘాన్ని తప్పుబడుతోంది. మాచర్లలో 7 చోట్ల ఈవీఎంలను ధ్వంసం చేశారంటున్న ఈసీ కేవలం పాల్వాయి ఘటన వీడియోను మాత్రమే ఎందుకు బయటపెట్టిందని ప్రశ్నిస్తోంది. ఎన్నికల కమిషన్ కంట్రోల్‌లో ఉండాల్సిన వీడియో ముందు ట్విట్టర్‌లో ఎలా ప్రత్యక్షమైందని ప్రశ్నించారు మంత్రి అంబటి రాంబాబు. అది అసలు వీడియోనా? లేదంటే ఫేకా అని సందేహం వ్యక్తం చేశారు. అధికారులు, టీడీపీ నేతలు కుట్ర చేశారని ఆరోపించిన మంత్రి.. దాడులు జరిగిన అన్ని చోట్ల వీడియోస్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఏపీ డీజీపీని కలిసిన టీడీపీ నేతల బృందం పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..