AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ గిరిజనులపై డిప్యూటీ సీఎంకు ‘మధుర’మైన అభిమానం..! ఈ సారి ఏం పంపించారంటే..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లా గిరిజన గ్రామాలకు మరో గిఫ్ట్ పంపారు. కురిడి గ్రామస్తులకు మామిడిపండ్లు అందించారు. రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా చర్యలు తీసుకున్నారు. వారి కష్టాలను అర్థం చేసుకుని వెంటనే సహాయం చేయడం ప్రశంసనీయం. గ్రామస్తులు పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ఆ గిరిజనులపై డిప్యూటీ సీఎంకు 'మధుర'మైన అభిమానం..! ఈ సారి ఏం పంపించారంటే..?
Pawan Kalyan
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jul 03, 2025 | 8:56 PM

Share

గిరిజన తండాలో జీవనం.. అమాయక ప్రజానీకం.. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి వారిది. రెండు వందలకు పైగా గడపలున్న ఆ కుగ్రామం అమాయక ప్రజలకు నివాసం. అరకుకు అతి సమీపంలో ఉన్నప్పటికీ.. అభివృద్ధికి ఆ గ్రామం ఆమడ దూరం. అందుకేనేమో వారిపై డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఇటీవల గ్రామ సభ పెట్టి సమస్యలు అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ గ్రామస్తులకు నోరూరించే మధుర ఫలాలను పంపించారు. ప్రతి గడపకు వెళ్లి మామిడి పండ్లను అందించాలని సిబ్బందికి పంపారు.

అయితే ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘అడవి తల్లి బాట’ కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లాలో పర్యటించారు. డుంబ్రిగూడ మండలం పెద్దపాడు, కురిడి గ్రామాలకు వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలు తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ గ్రామస్తులతో మాట్లాడి వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కురిడి గ్రామంలో శివాలయంలో పూజలు చేసి మొక్కు తీర్చుకున్నారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఆ గ్రామం పై ప్రత్యేకంగా మక్కువ పెంచుకున్నట్లు ఉన్నారు. ఒక్కొక్క సమస్యను తీరుస్తూ మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

గడపగడపకు మధురమైన మామిడిపండ్లు..

ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక అభిమానాన్ని చాటుకున్నారు డిప్యూటీ సీఎం. ఏకంగా కురిడి గ్రామస్తుల కోసం నోరూరించే మామిడిపండును పంపించారు. మన తోటలో ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసి పండించిన మామిడి పండ్లను గిరిజనులకు ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు. దీంతో ప్రత్యేక వాహనంలో కురిడి గ్రామానికి చేరుకున్న డిప్యూటీ సీఎం కార్యాలయ సిబ్బంది.. ఇంటింటికి వెళ్లి మామిడి పండ్లను పంపిణీ చేశారు. దాదాపుగా 230 వరకు గడపలుండే కురిడి గ్రామంలో ఇంటికి అరడజను చొప్పున మధురమైన మామిడి పండ్లను అందించారు. మా పవన్ కళ్యాణ్ సారు పంపిన మామిడి పండ్లు అంటూ పిల్లలు పెద్దలు ఇష్టంగా తిన్నారు. పవన్ సారు చల్లంగా ఉండాలంటూ ఆశీర్వదించారు.

గతంలోనూ చలించి చెప్పులు పంపిణీ..

అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అరకు ఏజెన్సీలో ఇటీవల పర్యటించిన పవన్ కళ్యాణ్.. పెదపాడు గిరిజనుల ఆ కష్టాన్ని చూసి చలించిపోయారు. పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్ళగానే.. పాంగి మిత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్లి సాదర స్వాగతం పలికింది. ఆమె వెనుక మరింత మంది దింసా నృత్యాలు డబ్బు వాయిద్యాలతో డిప్యూటీ సీఎంకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే సమయంలో పాంగి మిత్తుతోపాటు అక్కడ గిరిజన ఆడబిడ్డలు, వృద్ధులు, పిల్లలు కాళ్లకు చెప్పలు లేకుండా ఉండటం గమనించారు డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌. అక్కడ రోడ్లు సక్రమంగా లేకపోవడంతో పాటు ముళ్ళు రాళ్ళు ఉండడాన్ని గుర్తించారు.

అటువంటి రహదారుల్లో కనీసం కాలికి చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించి పోయారు. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని తెలుసుకున్నారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు అని ఆరా తీయించారు. వారందరికీ కాళ్లకు చెప్పులు ఏ సైజు అవసరమో సర్వే చేయించారు. పది రోజులు పూర్తిగా కాకుండానే.. పెదపాడు గ్రామానికి పాదరక్షలు పంపారు డిప్యూటీ సీఎం. ప్రతి ఇంటికి వెళ్లిన పవన్ కళ్యాణ్ కార్యాలయ సిబ్బంది స్థానిక సర్పంచ్ తో కలిసి గిరిజనులను పలకరించి చెప్పులు పంపిణీ చేశారు. 345 మందికి పాదరక్షలు అందజేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి