Job calendar : లంచాలకు, పైరవీలకు తావులేకుండా ఈ ఏడాది 10,143 ఉద్యోగాల భర్తీ..! జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం

|

Jun 18, 2021 | 3:03 PM

ఎలాంటి పైరవీలకు, దళారులకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు...

Job calendar : లంచాలకు, పైరవీలకు తావులేకుండా ఈ ఏడాది  10,143 ఉద్యోగాల భర్తీ..! జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసిన సీఎం
CM YS Jagan
Follow us on

AP CM YS Jagan mohan reddy : లంచాలకు, అవినీతికి, పక్షపాతానికి, వివక్షకు, తావులేకుండా అత్యంత పారదర్శకంగా, ఎలాంటి పైరవీలకు, దళారులకు తావులేకుండా ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉన్నామని ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అందుకోసమే ఇక నుంచి రాష్ట్రంలో ఇంటర్వ్యూ విధానానికి స్వస్తి చెబుతున్నామని తేల్చి చెప్పారు. రాత పరీక్షల్లో మెరిట్‌ ప్రాతిపదికన మన ప్రభుత్వం ఉద్యోగాలిస్తోందని చెప్పడానికి ఇవాళ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు.

జాబ్‌ క్యాలెండర్‌ ఎందుకు అవసరం అంటే.. అని వివరించిన సీఎం “చదువులు పూర్తిచేసుకున్న చెల్లెమ్మలు, తమ్ముళ్ల కోసం తీసుకువస్తున్నాం. ఈ క్యాలెండర్‌ ఏ ఉద్యోగ నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందో.. ఏ నెలలో వస్తుందో స్పష్టంగా తెలియజెప్పడం కోసం క్రిస్టల్‌ క్లియర్‌గా చెప్పడం కోసం క్యాలెండర్‌ తీసుకొస్తున్నాం. బ్యాక్‌ లాక్‌ పోస్టుల భర్తీ.. ఇంత వరకు చేయకుండా వదిలేసిన గత ప్రభుత్వ విధానాలకు భిన్నంగా.. సామాజిక న్యాయం చేసేందుకు ఈ క్యాలెండర్‌ తీసుకువస్తున్నాం.” అని వెల్లడించారు. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా నిరుద్యోగ యువతీ, యువకులు, చదువుకుంటున్న విద్యార్థులను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడారు.

ప్రతి విద్యార్థిని గ్రాడ్యుయేట్‌ చదివించేలా, చదువుకున్న ప్రతి చెల్లెమ్మ, తమ్ముడికి అవకాశాలు విస్తరించే దిశగా యుద్ధ ప్రతిపాదికన అడుగులు వేస్తున్నామన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో అక్షరాల 6,03,756 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా భర్తీ చేయగలిగామని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారు. “ప్రభుత్వం నుంచి నోటిఫికేషన్‌ వస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా చదువుకున్న పిల్లలు ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తుంటారు. నగరాలు, పట్టణాలకు వెళ్లి అద్దె ఇల్లు తీసుకొని నెలల తరబడి కోచింగ్‌ తీసుకుంటారు. కోచింగ్‌ తీసుకున్న తరువాత ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పుడిస్తారని తెలియని పరిస్థితుల్లో ఆ పిల్లలు మనోధైర్యం కోల్పోయే స్థితి వస్తుంది. ఆ పరిస్థితులను మారుస్తూ.. వచ్చే 9 నెలల కాలంలో జూలై నెల నుంచి మార్చి – 2022 వరకు ఏయే ఉద్యోగాలకు, ఏయే నెలలో నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. ఈ ఉద్యోగాలు ఏమిటీ..? ఏ నెలలో నోటిఫికేషన్‌ ఇస్తున్నామని అన్ని దినపత్రికల్లో మొదటి పేజీల్లో ప్రకటన ఇచ్చి ప్రతి ఒక్కరికీ తెలియజేస్తాం” అని సీఎం వెల్లడించారు.

మన గ్రామంలోనే విలేజ్‌ క్లినిక్‌లు, విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతులకు అడుగడుగున చెయ్యి పట్టుకొని నడిపించే ఆర్బీకేలు కనిపిస్తున్నాయని సీఎం ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మన గ్రామంలోనే సంవత్సరకాలంలో గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, డిజిటల్‌ లైబ్రరీలు తీసుకురావడం జరుగుతుంది. దేవుడి దయతో మనం ఏర్పాటు చేయబోతున్న స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు, 8 ప్రాంతాల్లో హార్బర్లు, 16 మెడికల్‌ కాలేజీలు, ఆసరా, చేయూత పథకాలను లింక్‌ చేస్తూ అమూల్, రిలయన్స్, హిందుస్థాన్‌ లివర్, ఐటీసీ వంటి కంపెనీలను తీసుకువస్తున్నాం. గ్రామ స్థాయిలో ఉద్యోగాలు, ఉపాధి విప్లవానికి నాంది పలుకుతాయని సగర్వంగా తెలియజేస్తున్నాను. అని ముఖ్యమంత్రి జగన్ ఉద్ఘాటించారు.

Read also : Chandrababu letter to CM YS Jagan : ముఖ్యమంత్రి వైయస్ జగన్ కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు లేఖ