Azadi ka Amrut : దేశానికి స్వాతంత్ర్య సిద్దించి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా భారత దేశవ్యాప్తంగా అజాదీ కా అమృత్‌మహోత్సవ్ అట్టహాసంగా నిర్వహిస్తున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు జిల్లా మాచర్ల వెళ్లి జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య కుటుంబసభ్యులను కలుసుకున్నారు. పింగళి ఇంటికి వెళ్లి వెంకయ్య వారి కుమార్తెను జాతీయ జెండాతో సత్కరించారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఇలాఉండగా, భారత జాతీయ పతాకం రూపొందించి వందేళ్లు, భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల నేపథ్యంలో జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య స్మృతులను అనేక మంది గుర్తు చేసుకుంటున్నారు. 2001వ సంవత్సరంలో రాజ్యసభలో ప్రత్యేక ప్రస్తావనగా తన ప్రసంగాన్ని ఈ సందర్బంలో కంభంపాటి రామ్మోహన్ మీడియాకు విడుదల చేశారు.
జై భారత్ – జై హింద్ నినాదంతో పింగళి వెంకయ్య స్మారక ట్రస్ట్ 2020 ఏప్రిల్ 1నుంచి 2021 ఏప్రిల్ 1వరకు శతాబ్ది ఉత్సవాల నేపథ్యంలో పింగళి వెంకయ్య విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టించడం గురించి కంభంపాటి వివరించారు. పింగళి జీవిత చరిత్రను విద్యార్ధుల పాఠ్యాంశంగా చేయాలని, ప్రత్యేక పోస్టల్ స్టాంపు విడుదల చేయాలని కోరుతూ కేంద్రం దృష్టికి రాజ్యసభ వేదికగా అనేకమార్లు ప్రస్తావించానని కంబంపాటి పేర్కొన్నారు. తాను చేసిన డిమాండ్లలో మొదటి రెండు ఇంకా నెరవేరలేదని, స్టాంపు మాత్రమే విడుదల చేసిన విషయం ఈ సందర్భంగా గుర్తుచేశారాయన.