Govt. Employees: ఉద్యోగుల సమస్యలపై జగన్ సర్కారు ఫోకస్‌.. ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీర్‌ శర్మ సమావేశం

ఏపీ ఉద్యోగుల సమస్యలపై ఫోకస్‌ పెట్టింది ఏపీ సర్కార్‌. ఇవాళ అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశమవనున్నారు

Govt. Employees: ఉద్యోగుల సమస్యలపై జగన్ సర్కారు ఫోకస్‌..  ఇవాళ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సీఎస్‌ సమీర్‌ శర్మ సమావేశం
Cs Sameer Sharma

Updated on: Oct 21, 2021 | 9:44 AM

Andhra Pradesh Government employee issues: ఏపీ ఉద్యోగుల సమస్యలపై ఫోకస్‌ పెట్టింది ఏపీ సర్కార్‌. ఇవాళ అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులతో సమావేశమవనున్నారు సీఎస్‌ సమీర్‌ శర్మ. సచివాలయంలో మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకూ కేబినెట్‌లో తీసుకున్న నిర్ణయాలపైనా సమీక్ష జరపనున్నారు. ఆ నిర్ణయాల అమలు పరిస్థితి, పూర్తైన నిర్ణయాలు, అపరిష్కృతంగా ఉన్న నిర్ణయాలపై సమీక్షించనున్నారు. ఇప్పటివరకూ అమలుకాని కేబినెట్‌ నిర్ణయాల వివరాలను కూడా ఇవ్వాలని అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులకూ ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం.

కాగా, ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో ఉద్యోగుల పీఆర్సీ, హెల్త్ కార్డులు, హెల్త్ ఫీజుల రీయింబర్స్ మెంట్, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్న ఆయన.. ఈ నెలాఖరుకు పీఆర్సీ అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.

“ఉద్యోగులు లేకపోతే ప్రభుత్వం లేదు. అపోహలు వద్దు. ఎవరేం చెప్పినా నమ్మొద్దు. జీతాల విషయంలో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటాం. ఉద్యోగులను మరింత ఆప్యాయంగా సీఎం చూసుకుంటారు. మిగిలిన సమస్యలు నవంబర్‌లోగా తీరుస్తాం. ఏ ఉద్యోగుల సంఘాలు వచ్చినా, ఉద్యోగులు వచ్చినా మేము స్పందిస్తాం. ఇది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్. ఉద్యోగుల సమస్యలపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. దాంట్లో దాపరికం ఏమీ లేదు” అని సజ్జల ఆ సమావేశంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ సీఎస్ అన్ని శాఖల కార్యదర్శులతో భేటీ అవుతున్నారు.

Read also: Kannababu: సింపథీ వస్తుందనుకుంటే పొరపాటే, చివరికి చంద్రబాబు, వారి పార్టీనే అభాసుపాలవుతుంది: ఏపీ మంత్రి