ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష.. వచ్చే మూడేళ్లలో గ్రామాలన్నీ ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలని ఆదేశం

ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పాలసీపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై

ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష.. వచ్చే మూడేళ్లలో గ్రామాలన్నీ ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలని ఆదేశం
Andhrapradesh CM YS Jagan
Follow us
K Sammaiah

|

Updated on: Feb 05, 2021 | 6:30 PM

ఏపీలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ పాలసీపై ఉన్నతాధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం చర్చించారు. వచ్చే మూడేళ్లలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పించే లక్ష్యంగా ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.

ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ బలంగా లేకపోతే.. అనుకున్న లక్ష్యాలు సాధించలేమని తెలిపారు. రాష్ట్రంలో ఇంటర్నెట్‌ నెట్‌వర్క్‌ విస్తృతి, ప్రతి గ్రామానికీ ఇంటర్నెట్, గ్రామాల్లో ఇంటర్నెట్‌ లైబ్రరీ, కొత్తగా వస్తున్న ఐటీ, ఇతర టెక్నాలజీ అంశాల్లో నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడం, తదితర అంశాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. విశాఖలో ఎమర్జింగ్‌ టెక్నాలజీ యూనివర్శిటీపైనా సమావేశంలో చర్చించారు.

గ్రామాల్లోని సచివాలయాలు, ఆర్బీకేలు అన్నీ కూడా ఇంటర్నెట్‌తో అనుసంధానం కావాలన్నారు. దీంతోటు అవసరమైన గృహాలకు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఇవ్వాలని తెలిపారు. విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్‌ టెక్నాలజీ పార్కు ఏర్పాటు చేసి ఇందులో హై ఎండ్‌ స్కిల్స్‌ యూనివర్శిటీ, ఇన్‌క్యుబేషన్‌ సెంటర్, ల్యాబ్స్, సీఓఈఎస్, ఐటీ, ఈసీ డిపార్ట్‌మెంట్‌ ఆఫీసు, స్టేట్‌ డేటా సెంటర్, ఐటీ టవర్స్‌ ఇవన్నీకూడా ఉండాలని సీఎం ఆదేశించారు.

విశాఖలో ఏర్పాటు కాబోతున్న యూనివర్శిటీలో రోబోటిక్స్, ఆర్టిఫియల్‌ ఇంటెలిజెన్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీస్, డేటా అనలిటిక్స్‌ సైన్సెస్, అడ్వాన్స్‌డ్‌ ఎలక్ట్రానిక్స్, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, నీటివనరులు తదితర రంగాల్లో ఐటీ అప్లికేషన్లపై బోధన, పరిశోధన లక్క్ష్యంగా ఉండాలన్నారు. దేశంలోని ప్రఖ్యాత ఐఐటీ సహా వివిధ సాంకేతిక సంస్థల్లోని నిపుణులు దీనిపై త్వరలోనే నివేదిక సమర్పిస్తారని అధికారులు వెల్లడించారు.

విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు సమీపంలో.. మూడుచోట్ల కనీసం 2 వేల ఎకరాల విస్తరణలో ఐటీ కాన్సెప్ట్‌సిటీలను ఏర్పాటు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ కాన్సెప్ట్ ‌సిటీల్లో మౌలిక సదుపాయాలు అత్యున్నత ప్రమాణాలతో ఉండాలన్నారు. ఐటీ ప్రగతికి దోహదపడాలని, రాష్ట్రాభివృద్ధికి సహాయపడాలని సూచించారు. అన్ని అంశాలపై ఆలోచనలు చేసి మంచి పాలసీని తీసుకురావాలన్నారు.

కోవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వర్క్‌ ఫ్రం హోం పెరిగిందన్న సీఎం వర్క్‌ ఫ్రం హోంను ప్రమోట్‌ చేయాలని సూచించారు. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని ఏ రకంగా ఐటీ రంగానికి ప్రభుత్వం వైపు నుంచి సహకారం అందిస్తామో పరిశీలన చేసి, దాన్ని పాలసీలో పెట్టాలని తెలిపారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్స్‌ పార్క్‌పై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. వీలైనన్ని పరిశ్రమలను తీసుకురావాలని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాల కల్పనపై దృష్టిపెట్టాలని తెలిపారు.

ఈ సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి, ఉన్నత విద్యాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్‌ చంద్ర, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని,ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జీజయలక్ష్మి, ఐటీ శాఖ స్పెషల్‌ సెక్రటరీ బీ సుందర్, ఇంధనశాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ ఎమ్‌ఎమ్‌ నాయక్, ఏపీఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎండీ ఎమ్‌ మధుసూదన్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Read more:

ఆంధ్రుల హక్కు.. వారి స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు.. విశాఖ ఉక్కును కొనేది ఎవరో తెలిసిపోయిందన్న లోకేష్‌