వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. సమగ్ర సర్వేసమీక్షా సమావేశంలో మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బూడి ముత్యాలనాయడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు. సమగ్రసర్వేకు సంబంధించిన వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. ఇప్పటివరకూ జరిగిన సర్వే ప్రగతిని సీఎం సమీక్షించారు. భూ వివాదాలను పరిష్కరించడం అన్నది సమగ్ర సర్వే ప్రధాన లక్ష్యాల్లో ఒకటని అధికారులకు చెప్పారు సీఎం జగన్. నిర్దేశించుకున్న సమయంలోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలన్నారు. డ్రోన్లు, ఓఆర్‌ఐ పరికరాలు, రోవర్లు, అలాగే సర్వే రాళ్లు సమకూర్చుకోవాలని అధికారులను సూచించారు సీఎం. ఇలా ప్రతి అంశంలోనూ వేగం ఉండాలని అధికారులను ఆదేశించారు. 100 ఏళ్ల తర్వాత జరుగుతున్న సర్వే కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తిచేయాలన్నారు. చరిత్రలో నిలిచిపోవాలని సూచించారు. సమగ్ర సర్వే ద్వారా ప్రజలకు, రాష్ట్రానికి మేలు జరుగుతుందని చెప్పారు ముఖ్యమంత్రి జగన్.