AP Budget 2026: బడ్జెట్ సమావేశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ఈ అంశాలపైనే ప్రత్యేక చర్చ

రాష్ట్ర బడ్జెట్‌ ఎలా ఉండాలి ? ఏ శాఖకు ఎంత నిధులు కేటాయించాలి. కేంద్రం నుంచి రాష్ట్రానికి రాబోయే నిధులు అంచనాలు, లెక్కలు ఎలా ఉండొచ్చు. ఇలాంటి అంశాలపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర సహకారం.. అందుకు తగ్గట్టుగా రాష్ట్ర బడ్జెట్ కూర్పుపై అధికారులతో చర్చించనున్నారు.

AP Budget 2026: బడ్జెట్ సమావేశాలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్.. ఈ అంశాలపైనే ప్రత్యేక చర్చ
Cm Chandrababu

Updated on: Jan 11, 2026 | 8:58 PM

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ 2026- 27పై సోమవారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. శాఖలకు నిధుల కేటాయింపులు, GSDP స్థితి, RTGS అమలు, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పురోగతి వంటి అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. జిల్లా కలెక్టర్లు వర్చువల్ విధానంలో సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ప్రీ బడ్జెట్ సమావేశంలో శాఖలవారీగా, జిల్లాల వారీగా ప్రాధాన్యతా ప్రాజెక్టులను గుర్తించి, వాటికి బడ్జెట్‌లో తగిన స్థానం కల్పించనున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ప్రీ బడ్జెట్ సమావేశంలో కేంద్రం ముందు పెట్టిన ప్రతిపాదనలపై కూడా దృష్టి సారించనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం–నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు, నదుల అనుసంధానం, రాయలసీమ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపుల అంశాలు ఈ సమీక్షలో ప్రాధాన్యతగా నిలవనున్నాయి. అదే సమయంలో 2026-27 సంవత్సరానికి ప్రత్యేకంగా నీటి బడ్జెట్‌ను పెట్టాలనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

విశాఖ అభివృద్ధి బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కావాలని వినతి

విశాఖపట్నం ఆర్థిక ప్రాంతీయ అభివృద్ధి కేంద్రానికి కేంద్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలన్న ప్రతిపాదనను కూడా పరిశీలించనున్నారు.16వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి వస్తుండటంతో, అధిక రెవెన్యూ గ్రాంట్లు, పన్నుల పంపిణీపై రాష్ట్రానికి వచ్చే అవకాశాలను ఎలా ఉపయోగించుకోవాలన్న దానిపైనా చర్చ జరగనుంది.

సాస్కి, పూర్వోదయ పథకాలపైనా సమీక్షలు

మరోవైపు సాస్కి, పూర్వోదయ పథకాల కింద మూలధన పెట్టుబడులు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ, రాయలసీమ హార్టికల్చర్ ప్రణాళికల అమలుపై శాఖలకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. బడ్జెట్‌లో ఏపీ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్ర పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో కేంద్ర బడ్జెట్‌తో అనుసంధానంగా రాష్ట్ర బడ్జెట్‌కు స్పష్టమైన ప్రాధాన్యతలు ఖరారు చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..