ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై సభ నుంచి సస్పెన్షన్ వేటు పడింది. అయితే టీడీపీ ఎమ్మెల్యేల్లో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై ఈ శాసనసభ సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెన్షన్ విధించగా.. మిగిలినవారిపై ఈ ఒక్క రోజే సభ నుంచి సస్పెండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించేందుకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చిన సమయంలో ఆయనకు సాదర స్వాగతం లభించలేదని, సమయానికి సీఎం జగన్ రాకపోవడంతో గవర్నర్ 5 నిముషాల పాటు స్పీకర్ చాంబర్‌లో వేచి ఉండాల్సి వచ్చిందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు. నిన్న గవర్నర్‌ను నేరుగా సభలోకి తీసుకు వెళ్లకుంగా స్పీకర్ ఛాంబర్‌లో వెయిట్ చేయించారని నిన్న తాను చేసిన కామెంట్స్‌కు కట్టుబడి ఉన్నానని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సభలో మరోసారి స్పష్టం చేశారు. ఆయన మాటలకు టీడీపీ మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సమర్థించారు.
అయితే నిన్న అసెంబ్లీ సమావేశాలకు హాజరైన గవర్నర్ అబ్దుల్ నజీర్‌కి సీఎం ఎదురెల్లి స్వాగతం పలకలేదని ప్రతిపక్ష టీడీపీ చేసిన విమర్శలకు మంత్రి బుగ్గన అసెంబ్లీలో సమాధానం చెప్పారు.
గవర్నర్‌కి సీఎం ఎదురు వెళ్లి స్వాగతం పలికిన వీడియోను స్పీకర్ అనుమతితో అసెంబ్లీలో ప్రదర్శించారు. గవర్నర్ గొంతు నొప్పితో ఇబ్బంది పడుతుండటంతో ఆయన వేడి నీరు తీసుకుని తర్వాత సభలోకి రావడంతో ఆలస్యమయిందని మంత్రి బుగ్గన అన్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష పార్టీ నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని బుగ్గన అన్నారు. ఈ అంశాన్ని అసెంబ్లీ ప్రివిలేజెస్ కమిటీకి పంపాలని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించడంతో.. తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి బుగ్గన అసెంబ్లీలో ప్రకటించారు.
ఇక ఈ విషయంపై వీడియోలతో సహా ఆధారాలు చూపినా ప్రతిపక్షం కావాలనే రాద్ధాంతం చేస్తోందని.. వెంటనే పయ్యావుల కేశవ్‌పై చర్యలు తీసుకోవాలని, ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపాలని మంత్రి బుగ్గన స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరారు. శాసనసభ నుంచి పయ్యావుల కేశవ్‌తో పాటు అతనికి మద్దతుగా సభలో ఆందోళన నిర్వహించిన నిమ్మల రామానాయుడును సభ నుంచి సస్పెండ్ చేశారు స్పీకర్. సస్పెన్షన్‌కు గురైన టీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు వెళ్లాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. అయితే అదే సమయంలో పయ్యావుల కేశవ్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టడాన్ని టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసనకు దిగారు. టీడీపీ సభ్యులను తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ కోరినా.. పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు కూడా సస్పెన్షన్‌ను కోరుకుంటున్నారని అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని అధికార పార్టీ సభ్యులు కోరారు. స్పీకర్ పోడియం చుట్టు టీడీపీ సభ్యుల ఆందోళనల నేపథ్యంలో సభలో కొంతసేపు గందరగోళం నెలకొంది. దీంతో సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యేలను సభ నుండి బయటకు వెళ్లాలని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. సస్పెన్షన్‌కు గురైన టీడీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి మార్షల్స్ బయటుకు తీసుకెళ్లారు.
అనంతరం వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. దీంతో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఈ సెషన్ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. సభలో సభ్యులు సస్పెన్షన్ కు గురైన తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెన్షన్‌పై స్పష్టత ఇచ్చారు. నిమ్మల రామానారాయుడు, పయ్యావులకేశవ్, వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను శాసనసభ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నామని.. మిగిలిని టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ఇవాళ ఒక్క రోజేనని స్పీకర్ వివరించారు. ఇక సస్పెండ్ అయిన వారిలో టీడీపీ సభ్యులు నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవని, చినరాజప్ప, గణబాబు, పయ్యవుల కేశవ్, గద్దె రామ్మెహన్, రామరాజు, ఏలూరి సంబశివరావు, డోలా వీరాంజనేయస్వామి, రవికుమార్‌లు ఉన్నారు. వీరితో పాటు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..