తెలంగాణ ఎంసెట్ ఫలితాలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా విద్యార్థి సత్తా చాటాడు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం యరకరాయపురం గ్రామానికి చెందిన సతివాడ జోతిరాదిత్య తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలలో మొదటి ర్యాంకు సాధించాడు. దీనితో ఆదిత్య తల్లిదండ్రులు స్నేహితులతో పాటు జ్యోతిరాదిత్య గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాల్లో మొదటి ర్యాంక్ రావడంతో తల్లిదండ్రులు మోహనరావు, హైమావతి ఆనందంతో కుటుంబ సమేతంగా మిఠాయిలు పంచుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నారు. జ్యోతిరాదిత్య మొదటి నుండి ఎంతో చురుగ్గా ఇష్ణంగా చదివేవాడని కృషి పట్టుదలే అతనికి తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌లో మొదటి ర్యాంక్ సాధించేలా చేసిందని అతని తల్లిదండ్రులు ,గ్రామస్తులు అంటున్నారు.
జ్యోతిరాదిత్య విజయవాడలోని ఓ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాడు. ఇటీవల జరిగిన JEE ప్రిలిమ్స్‌లో 116వ ర్యాంక్ సాధించాడు. JEE మెయిన్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. శనివారం ఏపీ రాష్ట్ర ఎంసెట్‌ను రాశాడు. IIT లో సీట్ పొందాలన్న లక్ష్యంతో జ్యోతిరాదిత్య ప్రిపేర్ అయినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. జ్యోతిరాదిత్య తండ్రి మోహనరావు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండల కేంద్రంలోని ఏపీ ప్రభుత్వ మహిళా గురుకుల పాఠశాలలో పనిచేస్తుండగా.. తల్లి హైమావతి శ్రీకాకుళంలో RTC లో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నారు. వీరి స్వగ్రామం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ మండలం ఎరకారాయపురం కాగా ఉద్యోగరీత్యా వీరి కుటుంబం ప్రస్తుతం శ్రీకాకుళంలో నివాసం ఉంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..