Somu Veerraju on Jr NTR Political Entry: ఏపీలో పొత్తులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి క్లారిటీ ఇచ్చారు. తామెప్పుడూ జనసేనతోనే కలిసి ఉన్నామనీ.. జనసేనతోనే పోటీ చేస్తామని ఆదివారం సోము వీర్రాజు స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలను బీజేపీ ఎప్పుడు వ్యతిరేకిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. అయితే.. జూనియర్ ఎన్టీఆర్ సేవలు ఎక్కడ అవసరమైతే అక్కడ వాడుకుంటామని క్లారిటీ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రజాదరణ ఎక్కువని, అతని సేవలను వినియోగించుకుంటామన్నారు. జనసేనతో కలిసే ముందుకెళ్తామని అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకుంటామని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. వచ్చే ఎన్నికల్లో ఏపీలో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులక్రితం తెలంగాణలో పర్యటించిన అమిత్‌షా.. హైదరాబాద్‌లో జూనియర్ ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో సోము వీర్రాజు జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడటం.. టీడీపీ, జనసేన వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.
ఈ సందర్భంగా సోము వీర్రాజు ఏపీ ప్రభుత్వం తీరుపై కూడా విమర్శలు గుప్పించారు. జగన్ ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తామన్నారు. జగన్ ప్రభుత్వంలో ప్రతీచోట అవినీతి జరుగుతోందని ఆరోపించారు. జగన్ చెప్పిందేంటి? జరుగుతున్నదేంటి? అని ప్రశ్నించారు. వైసీపీ నేతల దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్తామని.. రాష్ట్ర వ్యాప్తంగా వీధికొక సభ పెడతామని సోము పేర్కొన్నారు. ఏపీలో మొత్తం ఐదువేల సభలు ప్లాన్ చేస్తున్నామని ప్రకటించారు. NREGA నిధుల్ని ఏం చేస్తున్నారు? పేదలకు పనికిరాని బియ్యం ఇస్తున్నారంటూ జగన్ ప్రభుత్వంపై సోము వీర్రాజు మండిపడ్డారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..