Somu Veerraju: పోలవరంపై ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లే.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు..

|

Jul 21, 2022 | 4:00 PM

1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపేశారని.. విభజన తర్వాత భద్రాచలం ఆలయం, 2 మండలాలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారని సోము వీర్రాజు గుర్తు చేశారు.

Somu Veerraju: పోలవరంపై ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లే.. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు..
Follow us on

Somu Veerraju on Polavaram Project: పోలవరం అంశాన్ని‌ వివాదం చేసే కుట్ర జరుగుతుందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని.. ప్రాజెక్టుపై ప్రశ్నిస్తే రాష్ట్ర విభజన అంశాన్ని తిరగదోడినట్లే అవుతుందంటూ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఈ మేరకు సోము వీర్రాజు గురువారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేయాల్సిందేనని పేర్కొన్నారు. 1960లో పోలవరం ముంపు మండలాలను ఖమ్మం జిల్లాలో కలిపేశారని.. విభజన తర్వాత భద్రాచలం ఆలయం, 2 మండలాలు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారని సోము వీర్రాజు గుర్తు చేశారు. దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా సాగర్‌కు నీరు ఇవ్వాలని వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి పనులు చేపట్టారని.. దుమ్ముగూడెం తెలంగాణకు ఇవ్వడం వల్ల రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందన్నారు. రాష్ట్ర విభజనపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనన్నారు. పోలవరం వద్దని నాడు టీడీపీ వరంగల్ మహిళా నేత మాట్లాడారన్నారు. నేడు తమ పార్టీలో ఉన్న ఇద్దరు నాయకులు అప్పుడు టీడీపీలో ఉన్నారని గుర్తుచేశారు. వారిద్దరూ నాడు ఆమె వ్యాఖ్యలను కనీసం ఖండించలేదన్నారు. ఆ తరువాత చంద్రబాబు పోలవరం సోమవారం అని ఆర్భాటం చేశారన్నారు. పోలవరంను వ్యతిరేకిస్తే.. విభజన చట్టాన్ని ఒప్పుకోనట్లేనని సోము వ్యాఖ్యానించారు. అప్పుడొక మాట.. ఇప్పుడొక మాట అనేది కరెక్ట్ కాదన్నారు. పోలవరం ముంపు ప్రాంతాలలో కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలుస్తాం అంటున్నారు.. వారంతా భద్రాచలం మీద ఆధార పడటం‌ వల్ల అటు చూస్తున్నారన్నారు. విలీనం చేసిన మండలాల్లో‌ సీపీఎం ఆందోళన చేయడం ఏమిటి.. అంటూ ప్రశ్నించారు.

పోలవరం విషయంలో జగన్ ప్రజలను మోసం చేస్తున్నారని సోము పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కూడా ఇలానే ప్రకటించి దెబ్బ తిన్నారన్నారు. షెకావత్ ఏపీ పర్యటన తరువాత 15రోజులకొక సారి రివ్యూ చేస్తున్నారని పేర్కొన్నారు. లోయర్ కాపర్ డ్యాం పాడైన విషయంపై అధ్యయనం జరుగుతుందని సోము పేర్కొన్నారు. చంద్రబాబు అనేక అవినీతి చేశారని జగన్ ప్రచారం చేశారు.. మూడేళ్లలో వాటిని బయట పెట్టి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. పోలవరం నిర్మాణాన్ని కేంద్రం పూర్తి చేస్తుందని.. ఏపీలో పరిణామాలను తమ జాతీయ నాయకత్వానికి వివరిస్తామని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..