
రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుల గుర్తింపు ప్రక్రియ ప్రారంభమైంది. 2021లో అప్పుడు ఎంపిగా ఉన్న రఘురామకృష్ణంరాజును సిఐడి అధికారులు అరెస్టు చేసి గుంటూరు కార్యాలయానికి తీసుకెళ్లారు. ఆయనపై రాజద్రోహం కేసు పెట్టిన అప్పటి ప్రభుత్వం రాత్రంతా సిఐడి కార్యాలయంలోనే ఆర్ఆర్ఆర్‌ను ఉంచింది. ఆ సమయంలోనే విచారణ పేరుతో సిఐడి అధికారులు దాడి చేశారని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. దాడి చేయడమే కాకుండా తనపై హత్యాయత్నం చేశారని.. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నగరం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ కేసులో ఐపిఎస్ అధికారులు కూడా నిందితులుగా ఉండటంతో… విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పీని ప్రభుత్వం నియమించింది.
విచారణలో భాగంగా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయ్ పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతని విచారణ ద్వారా వచ్చిన ఆధారాలతో తులసి బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపధ్యంలో తులసి బాబే సిఐడి కస్టడిలో ఉన్న తనపై కూర్చొని చంపే ప్రయత్నం చేశాడని ఆర్ఆర్ఆర్ ఆరోపించారు. అంతేకాకుండా తులసి బాబును గుర్తించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్ఆర్ఆర్ పోలీసులను కోరుతూ వచ్చారు.
ఈ క్రమంలోనే జడ్జి అనుమతి మేరకు నిందితులను గుర్తించే ప్రక్రియను కోర్టు సిబ్బంది చేపట్టారు. జిల్లా న్యాయమూర్తి సమక్షంలో పోలీసులు పరేడ్ నిర్వహించారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న తులసీ బాబును జడ్జి సమక్షంలో గుర్తించేందుకు ఆర్ఆర్ఆర్ గుంటూరు జిల్లా జైలుకు వచ్చారు. తులసీ బాబు పోలికలతో ఉన్న మరికొంతమందిని ఈ గుర్తింపు ప్రక్రియలో ఉంచిన తర్వాత.. 2021 మే 14న రాత్రి సీఐడీ కస్టడీలో తన గుండెపై కూర్చున్న తులసీ బాబును రఘురామ కృష్ణంరాజు గుర్తించారు. ఈ ప్రక్రియ అంతా కూడా జడ్జి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా జైల్లో జరిగింది.
తనపై దాడి కేసులో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియదని కోర్టులో స్టేట్ మెంట్ అనంతరం ఆర్ఆర్ఆర్ చెప్పారు. విచారణాధికారిగా ప్రకాశం జిల్లా ఎస్పి దామోదర్ బాగానే పని చేస్తున్నారని తెలిపారు. తులసి బాబు గుర్తింపు తర్వాత దర్యాప్తు మరింత వేగవంతం అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా ప్రకాశం జిల్లాకు చెందిన తులసిబాబు.. నాటి సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ కలెక్షన్ ఏజెంటుగా, కుడి భుజంగా ఉండేవాడని రఘురామ ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..