AP Budget 2026: ఈసారి ఆ శాఖ బడ్జెట్ కూడా.. ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు.. ఎప్పటినుంచంటే..

ఆంధ్రప్రదేశ్‌లో పయ్యావుల పద్దుకు వేళయింది. ఈసారి ఆర్ధిక బడ్జెట్‌, వ్యవసాయ బడ్జెట్‌తో పాటు మరో బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది కూటమి ప్రభుత్వం. ఇంతకూ ఏంటా బడ్జెట్..? ఈ ఏడాది అసెంబ్లీ సమావేశాల ప్రత్యేకత ఏంటి? అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

AP Budget 2026: ఈసారి ఆ శాఖ బడ్జెట్ కూడా.. ఏపీ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ఖరారు.. ఎప్పటినుంచంటే..
Ap Assembly Budget Session

Updated on: Jan 28, 2026 | 8:23 PM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేసింది. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అసెంబ్లీ వర్గాలకు బుధవారం అధికారిక సమాచారం అందింది. ఫిబ్రవరి 11వ తేదీ ఉదయం 10 గంటలకు రాష్ట్ర గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో బడ్జెట్ సమావేశాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు మొత్తం ఈ తీర్మానంపై సభ్యులు విస్తృతంగా చర్చ జరపనున్నారు.

ఫిబ్రవరి 13వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడనున్నారు. ప్రభుత్వ విధానాలు, భవిష్యత్ ప్రణాళికలపై సీఎం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి 14వ తేదీన 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజున వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.

అయితే ఈ సారి ప్రత్యేకంగా ఇరిగేషన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం. కొత్తగా తీసుకువచ్చిన ఇరిగేషన్ బడ్జెట్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు సభలో ప్రవేశపెడతారు. 18 లేదా 20 పనిదినాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఉంది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఇప్పటికే అసెంబ్లీ వర్గాలకు సమాచారం అందింది. ఈ సమావేశాల్లో కీలక బిల్లులు, విధాన నిర్ణయాలు, అభివృద్ధి అంశాలపై విస్తృత చర్చ జరగనుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..