Betting Apps: ‘ఆడండి’ అనే వాళ్లు బాగుంటారు.. కోట్లు గడిస్తారు.. మీరే చస్తారు..
ఇన్ఫ్లూయెన్సర్స్ ముసుగులో బెట్టింగ్‌యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల బెండు తీసే పనిలో పడ్డారు..పోలీసులు. ఇప్పటికే ఒకరిద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు..మిగిలిన వారిపై కూడా ఫోకస్ పెట్టారు. #SayNoToBettingApps.. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్. బెట్టింగ్ యాప్స్ కు వ్యతిరేకంగా నెటిజన్లు చేస్తున్న పోరాటం ఇది. TGSRTC ఎండీ సజ్జనార్ కూడా బెట్టింగ్ యాప్స్‌పై ఎప్పటినుంచో సోషల్‌మీడియా వేదికగా పోరాటం చేస్తున్నారు. దీంతో బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వారిలో భయం మొదలయింది.

మీకో స్టోరీ చెబుతా వినండి. స్టోరీ కాదు.. రియల్ అండ్ హారిబుల్ ఇన్సిడెంట్. ఓ డాక్టర్.. తన దగ్గరికి వచ్చే పేషెంట్లకు మత్తు మందు ఇస్తున్నాడు. జబ్బు తగ్గించుకోడానికని వస్తుంటే.. ఆ మాయదారి వైద్యుడేమో ఇంకొన్ని జబ్బులు అంటిస్తున్నాడు. డాక్టర్ ఇంజక్షన్ ఇచ్చిన తరువాతే ఆరోగ్యం పాడవడం గమనించిన ఓ పేషెంట్.. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. జనరల్‌గా ఇలాంటి కేసులను అంత సీరియస్‌గా తీసుకోరనే అనుకుంటాం మనం. కాని, కూపీ లాగితే.. చాలా దారుణమైన విషయాలు తెలిశాయి. ఆ డాక్టర్ మెయిన్ టార్గెట్.. కేవలం జబ్బులు అంటించడం కాదు ఏకంగా ప్రాణాలు తీయడం అని పోలీస్ ఎంక్వైరీలో తేలింది. ఇలా ఒక్కరినే టార్గెట్ చేయలేదు. మొత్తం ముగ్గురిని టార్గెట్ చేసి.. వాళ్లకి మార్ఫిన్ ఇంజక్షన్ ఎక్కించినట్టు తేలింది. ఓ డాక్టర్ ఎందుకని కిల్లర్‌గా మారాడని ఆరా తీస్తే.. రీజన్ ఆన్‌లైన్ బెట్టింగ్ అని తెలిసే సరికి పోలీసులు, బాధితులు నోరెళ్లబెట్టారు. పైగా ఎక్కడో విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో జరగలేదీ ఇన్సిడెంట్. ఏలూరులో జరిగింది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌కు బానిసై.. లక్షలకు లక్షలు అప్పులు చేసి.. వాటిని తీర్చలేక అప్పులు ఇచ్చిన వారికే ఇంజక్షన్స్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు. అది.. అలా ఉంటుంది బెట్టింగ్ మాయలో పడితే.
భీమవరంలో రొయ్యల చెరువులు ఓనర్ అంటే.. ఒక ఊరునే కొనేంత స్థితిమంతుడు అని అంటుంటారు. రొయ్యల చెరువులతో బాగా సంపాదించి శభాష్ అనిపించుకున్న ఓ కుర్రాడు.. క్రికెట్ బెట్టింగ్‌కు బానిసై.. చెరువులో చేపలు ఏమైపోతున్నా పట్టించుకోకుండా రాత్రింబవళ్లు బెట్టింగ్ కాస్తూనే పోయాడు. చివరికి.. సంపాదించిందంతా పోగొట్టుకోవడమే కాదు.. అప్పులు చేసి రోడ్డున పడ్డాడు. అదే భీమవరంలో.. మరో యువకుడు ఆన్‌లైన్ జూదానికి అలవాటు పడి.. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్నా తీరనంత అప్పుల్లోకి కూరుకుపోయాడు. చివరికి ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఆస్తులున్నాయ్ కాబట్టి వాటిని పోగొట్టుకుని రోడ్డునపడ్డారు. మరి.. ఏ ఆస్తులూ లేకుండానే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారి పరిస్థితేంటి? ఆ అప్పుల్లోంచి బయటపడడానికి ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటున్నారు. అదే ఆత్మహత్య. చావు తప్ప మరో దారే కనిపించనంత అగాథంలో పడిపోతున్నారు.
ఒక్క తెలంగాణలోనే ఏడాదిలో వెయ్యి మంది బెట్టింగ్ యాప్ మాయలో పడి ప్రాణాలు తీసుకున్నారని కొన్ని లెక్కలు చెబుతున్నాయి. ఈలెక్కన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు, దేశవ్యాప్తంగా ఇంకెంత మంది బలైపోయి ఉండొచ్చు. అసలు.. బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఉంటుందని సామాన్యులకు చేరవేస్తున్నదెవరో తెలుసా. సోకాల్డ్ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్. నా వంట చూడండి, నా వీడియోలు లైక్ చేయండి, తమ చానెల్ సబ్‌స్క్రైబ్ చేసుకోండని యూట్యూబ్‌లో వీడియోలు పెడుతుంటారు చూశారా.. అలాంటి వాళ్లలో కొందరే ఈ ఆత్మహత్యలకు కారకులు. ఒకరకంగా వీళ్లని హంతకులు అన్నా తప్పు లేదనుకుంటా. ఇంతకీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే.. ఆస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే.. ఎందుకని ఆ ఊబిలో పడిపోతున్నారు? యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్లు అంతలా మాయలో పడేస్తున్నారా? బెట్టింగ్ యాప్ ద్వారా ఎగ్జాక్ట్‌గా ఎలా మోసపోతారు? లక్ష పోగొట్టుకున్న వాడు.. అంతటితో ఆపేయకుండా పాతిక లక్షలు, 50 లక్షలు అప్పు చేసి మరీ ఎలా పోగొట్టుకుంటున్నాడు? ఏం మాయ జరుగుతుంది బెట్టింగ్ యాప్స్‌లో? కంప్లీట్ అనాలసిస్ తెలుసుకుందాం…
సే నో టూ బెట్టింగ్ యాప్స్! తెగ ట్రెండ్ అవుతోందీ హ్యాష్‌ట్యాగ్. కారణం చాలా సింపుల్. పోలీసులు ఒక్కొక్కరి తాట తీస్తుండడమే. ఇన్నాళ్లకు బయటికొచ్చి, ఇలా సారీలు చెప్పి, ఇంకెప్పుడూ చేయము అని చెప్పిన వాళ్లు ఇద్దరు ముగ్గురే అయి ఉండొచ్చు. కాని, ఇలాంటి చాలామంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు సీరియస్ వార్నింగ్స్ వెళ్లాయి పోలీసుల నుంచి. అందుకే ఈ మార్పు. యూట్యూబర్ హర్షసాయి లేటెస్ట్‌గా ఓ పోస్ట్ పెట్టాడు. ఇంకోసారి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయబోను అంటూ దారికొచ్చాడు. ఇదే హర్షసాయి గతంలో ఏమన్నాడో తెలుసా. ‘నేను కాకపోతే ఇంకొకడు ప్రమోట్ చేస్తారు, అదేదో తనే బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేస్తే ఆ వచ్చే డబ్బులతో పేదలకు సేవ చేయొచ్చు’ అన్నాడు. ఒకప్పటి ఆ వీడియోను షేర్ చేసిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ‘చేసేదే తప్పు.. పైగా అదేదో సంఘ సేవ చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు.. చూడండి’ అంటూ హర్ష సాయిపై ఫైర్ అయ్యారు. అలా.. సజ్జనార్ నుంచి కామెంట్ వచ్చిందో లేదో హర్షసాయిపై కేసు నమోదైంది.
రీతూ చౌదరి సైతం ‘సే నో టూ బెట్టింగ్ యాప్స్’ అంటూ వీడియో రిలీజ్ చేసింది. ఓ ఏడాది క్రితం బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసినందుకు ఇప్పుడు సారీ చెప్పింది. తెలిసో తెలియకో చేసిన తప్పును క్షమించాలంటూ కోరింది. టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సైతం దారిలోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్స్‌లో తాను కూడా ఒకరినంటూ వీడియో రిలీజ్ చేసింది. ఇప్పుడా పని చేయకపోయినా.. గతంలో ప్రమోట్ చేసినందుకు సారీ చెప్పింది. ఇక టేస్టీ తేజ అనే ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా.. రెండేళ్ల క్రితం చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వైరల్ అవుతుండడంతో.. ఇకపై అలాంటి యాప్స్ ప్రమోషన్స్ చేయబోనంటూ ప్రామిస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. ఇంత మార్పుకి కారణం ఏంటో తెలుసా. యూట్యూబర్ అన్వేష్. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న అన్వేష్.. ఐపీఎస్ ఆఫీసర్ సజ్జనార్‌తో కలిసి ఓ వీడియో చేశాడు. చాలాకాలంగా ఈ బెట్టింగ్ యాప్స్‌పై పోరాడుతున్న సజ్జనార్‌కు సపోర్ట్‌గా ‘నా అన్వేషణ’ యూట్యూబర్ కూడా ముందుకొచ్చాడు. కాకపోతే.. అంతకంటే ముందు మరో విషయం జరిగింది. చాలా హాట్‌టాపిక్ అయిందా విషయం కూడా.
తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మోటోవ్లాగర్ ‘భయ్యా సన్నీ యాదవ్’.. దేశవిదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే.. ట్రేడింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదించాడనేది ‘నా అన్వేషణ’ అన్వేష్ ఆరోపణ. ఆరోపణ కాదు.. అది వాస్తవం కూడా. ఈ విషయంపై ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది. సరిగ్గా అదే సమయంలో.. ఐపీఎస్ సజ్జనార్‌తో వీడియోకాల్‌లో మాట్లాడారు అన్వేష్. ఈ ఇద్దరి మధ్య సన్నీ యాదవ్ ప్రస్తావన కూడా వచ్చింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్‌పై భయ్యా సన్నీ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్‌ను పోస్ట్ చేసిన సజ్జనార్.. ‘ఇలాంటి యూట్యూబర్స్ బతకడానికి బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడం ఒక్కటే మార్గమట.. చూడండి ఇలాంటి వాళ్లని’ అంటూ కామెంట్ చేశారు. వాళ్లు డబ్బులు సంపాదించడానికి ఇతరుల జీవితాలు నాశనం చేయాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నించారు సజ్జన్నార్. ఆ వెంటనే.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏ క్షణంలోనైనా.. సన్నీ యాదవ్‌ను అరెస్ట్ చేస్తామని సూర్యాపేట డీఎస్పీ సైతం స్టేట్‌మెంట్ ఇచ్చారు.
‘మా ఇష్టం.. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం’ అని విర్రవీగిన ఎవరినీ పోలీసులు వదలడం లేదు. ‘లోకల్ బాయ్ నానీ’ ఇందుకు మరో ఎగ్జాంపుల్. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్వయంగా ఏపీ డీజీపీ హరీష్‌కుమార్‌కు రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్లపై యాక్షన్ తీసుకోకపోతే.. ఎంతోమంది అమాయకుల ప్రాణాలు పోతాయంటూ కోరారు. ఆ వెంటనే.. లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. ‘తాను చేసింది తప్పే.. ఇకపై బెట్టింగ్ యాప్‌లను ఏమాత్రం ప్రమోట్ చేయబోనంటూ ఓ వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఇకముందు కూడా ఈ లిస్ట్‌లో చాలా మంది ఉండబోతున్నారు. ఈమధ్య ‘నా అన్వేషణ’ అన్వేష్.. బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌ని టార్గెట్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి కోట్లు గడించాడనే వాదన వినిపిస్తోంది. సో.. ఈ లిస్టులో పల్లవి ప్రశాంత్ కూడా ఉండొచ్చనే డిస్కషన్ గట్టిగా వినిపిస్తోంది. ఆల్రడీ లోకల్ బాయ్ అరెస్ట్ అయ్యాడు. సన్నీ యాదవ్ కోసం వెతుకుతున్నారు. లేటెస్ట్‌గా హర్ష సాయిపై కేసు రిజిస్టర్ అయింది. వీరితో పాటు యాంకర్ శ్యామల, విష్ణు ప్రియ, సుప్రీత, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ.. ఇలా 11మంది యాక్టర్స్, ఇన్‌ఫ్లుయెన్సర్లపై పంజాగుట్ట కేసులు నమోదుచేశారు పంజాగుట్ట పోలీసులు.
ఆల్ ఆఫ్ సడెన్.. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వీడియోలు చేసి మరీ సారీ ఎందుకు చెప్పారా అని అందరూ అనుకున్నారు. కారణం.. తమపై కేసులు నమోదవుతాయని తెలిసింది కాబోలు. అందుకే, గతంలో తప్పు చేశాం, ఇకపై తప్పు చేయబోం అంటూ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.
తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే. కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసిన కారణంగా.. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. లక్షలు అప్పు చేసి ఆస్తులు అమ్ముకున్నారు. అప్పులు తీర్చలేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. మరి.. ఆ తప్పుకు శిక్ష వేయొద్దా..! ఒకప్పుడు.. ‘నా మాట నమ్మండి.. బెట్టింగ్ యాప్స్‌లో పెట్టుబడి పెట్టండి’ అని చెప్పింది వీళ్లే కదా. వీళ్ల వల్లే కదా ఆత్మహత్య చేసుకుంది. మరి.. సారీ చెప్పేయగానే అలాంటి వాళ్లని వదిలేయాలా? అసలు.. బెట్టింగ్ యాప్స్ మాయలో పడడానికి వీళ్లెలా కారణమవుతున్నారు? ఒక్కసారి యాప్ వాడాక.. ఎలా ట్రాప్‌లోకి దించుతున్నారు.
అదృష్టమో, వాళ్లు పడ్డ కష్టమో.. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ కొందరు సెలబ్రిటీలు అయ్యారు. ఇంకొందరు సెలబ్రిటీలు.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లుగా మారిపోయారు. లక్షల్లో సబ్‌స్క్రైబర్లు ఉండే సరికి.. వాళ్లేం చెప్పినా కరెక్టే అనే మాయలో పడిపోతుంటారు సామాన్యులు. కొందరు సినిమా హీరోలు, క్రికెటర్లు, టీవీ సీరియల్స్‌లో ఫేమస్ అయినవాళ్లు, టీవీల్లో కనిపించే వాళ్లు.. వీళ్లందరూ చెప్పేది నిజమే అనే భ్రమలో ఉంటారు చాలామంది. సరిగ్గా దీన్నే క్యాష్ చేసుకుంటాయి కొన్ని ఇల్లీగల్ యాప్స్. ‘ఒక్కసారి మా యాప్‌ని ప్రమోట్ చేయండి’ అని ఓ ఒప్పందం చేసుకుంటాయి. అలా ఒక్కసారి బెట్టింగ్ యాప్‌ని ప్రమోట్ చేసినందుకు ఎంతిస్తారో తెలుసా. హర్షసాయి మాటల్లో చెప్పాలంటే.. ఏడాదికి వంద కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేశారట. అందుకే.. ‘అంత డబ్బు ఎందుకు పోగొట్టుకోవాలి, ఆ ప్రమోషనేదో తానే చేస్తున్నా’ అంటూ ఓ ఇంటర్వూలో చెప్పాడు. బెట్టింగ్ యాప్‌లపై నిషేధం ఉందని తెలిసినా.. ఎందుకని ప్రమోట్ చేస్తారంటే.. ఆ యాప్ నిర్వాహకులు ఇచ్చే కోట్ల రూపాయల వల్లే. హర్ష సాయి ఎంతోమంది పేదలకు సాయం చేశాడని చెబుతుంటారు. మరి.. ఆ డబ్బంతా ఎక్కడిది? కొందరు నోట్ల కట్టలు రోడ్లపై విసిరేస్తూ ఫేమస్ అయ్యారు. ఆ డబ్బంతా ఎక్కడిది? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ నిర్వాహకులు పంపించే నోట్ల కట్టలే. ఆ డబ్బు తీసుకుని.. తాము చాలా మంచోళ్లం అని కలరింగ్ ఇస్తాడు. అలా నమ్మిన సబ్‌స్క్రైబర్లు.. ఇన్‌ఫ్లుయెన్సర్లు ఏం చెబితే అది చేస్తారు. అలా.. వాళ్లు చెప్పారనే బెట్టింగ్ యాప్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుని నిలువునా మోసపోయిన వాళ్లు కోకొల్లలు.
ఇలాంటి వాళ్లు నాలుగు రకాలుగా జానాల్ని మోసం చేస్తున్నారు. ఒకటి ఫేక్ ప్రమోషన్స్. పెద్ద మొత్తంలో డబ్బు చూపించి, ఇదంతా ఫలానా బెట్టింగ్ యాప్‌లో సంపాదించానని చెబుతుంటారు. రెండోది.. సక్సెస్ స్టోరీలు. ఓ బెట్టింగ్ యాప్ లో డబ్బులు పెట్టానని, లక్షలు గెలిచానని, మీరు కూడా పెట్టండి అంటూ ఊరిస్తారు. ఇక మూడోది లింక్ మాయాజాలం. ఇన్‌ఫ్ల్యూయన్సర్లు ఓ పోస్ట్ పెడతారు. దాని కింద లింక్ పెట్టి క్లిక్ చేసి జాయిన్ అవ్వమంటారు. ఇలా చేస్తో ఒక్కోసారి మన ఫోన్ హ్యాక్ కూడా అవుతుంది. నాలుగోది.. ఫేక్ గ్యారెంటీ. మీకు బెట్టింగ్ గేమ్స్ ఆడే అనుభవం లేదా, డబ్బులు పోతాయని భయపడుతున్నారా.. మరేం టెన్షన్ లేదు, నాతో కలిసి ఆడండి, మీ డబ్బు ఎక్కడికీ పోదు, వందశాతం గెలుపు గ్యారెంటీ అంటూ ఊరిస్తారు. దీనికి కొంత సబ్‌స్క్రిప్షన్ ఫీజు కూడా తీసుకుంటారు. కాని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్‌ను ఎలా ప్రచారం చేసినా అది నేరమే.
సాధారణంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సామాన్యులకు అందుబాటులో ఉండవు. వాటి పేర్లు కూడా చాలామందికి తెలీవు. ఎక్కడుంటాయి, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలనే వివరాలేవీ తెలీవు. కాని, ఆ వివరాలన్నీ అరటిపండు ఒలిచినట్టు చెబుతున్నది ఈ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలే. డబ్బులకు కక్కుర్తి పడి, బెట్టింగ్‌ల వల్ల ఆత్మహత్య చేసుకుంటున్నారని తెలిసీ.. జీవితాలతో చెలగాటమాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ద్వారా తమకు లక్షలు, కోట్లు వచ్చాయ్.. మీరూ ఆడండి, కోటీశ్వరులు అవండి అని ప్రచారం చేస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకులు.. బెట్టింగ్‌లకు పాల్పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరొకొందరైతే.. సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తున్నారు. అదీ చాలక.. హత్యల వరకు వెళ్తున్నారు.
ఒక్కటి మాత్రం నిజం. బెట్టింగ్ యాప్స్ వల్ల డబ్బులు సంపాదించిన వాడు ఒక్కడంటే ఒక్కడు కూడా లేడు. తాము బాగా సంపాదించామని ఎవరైనా చెబితే.. చెవిలో పూలు పెడుతున్నట్టే. అలా ఎలా చెప్పాల్సి వస్తోందంటే.. బెట్టింగ్ యాప్స్‌లో చాలా వరకు ఫేక్ గేమ్ యాప్స్ ఉంటాయి. ఏ ఒక్కడూ డబ్బులు గెలుచుకోలేని విధంగా యాప్‌ను ముందే ప్రోగ్రామ్ చేసి పెడతారు. సో.. ఏ ఒక్కరూ గెలిచే ఛాన్సే ఉండదు. మరి.. ఒక్కసారంటే మోసపోతారు. పదే పదే ఎందుకని మోసపోతుంటారు? ఇక్కడే మరో లాజిక్ నడుస్తుంది. ఫస్ట్‌టైమ్ వెయ్యి రూపాయలు పెట్టిన వాడికి 10వేలు గెలిచినట్టు చూపిస్తాడు. అలాగని వెంటనే ఆ 10వేలు ఇవ్వడు. మరో గేమ్‌కు ఉసిగొల్పుతాడు. ‘అదేం వద్దు.. ఆ 10వేలు చాలు’ అనుకుంటే కుదరదు. సో, మరో గేమ్ ఆడేందుకు బోనస్ కట్టమంటాడు. ఎలాగూ 10వేలు గెలిచాం కదా.. పోతే వెయ్యి రూపాయలే కదా అని డిపాజిట్ చేస్తారు. అలా.. మభ్యపెట్టి డిపాజిట్ కట్టించుకుంటారు, గెలిచినట్టు చూపిస్తూనే ఉంటారు. గెలిచిన అమౌంట్ పక్కన కనిపిస్తూనే ఉంటుంది. తీరా ఆ అమౌంట్ తీసుకుందాం అనుకునే సరికి.. యాప్ స్లో అవుతుంది. ఎంతసేపైనా ఆ యాప్‌లో ట్రాన్సాక్షన్ ముందుకెళ్లదు. సో, అప్పటికే లక్షలకు లక్షలు పెట్టి ఉంటారు కాబట్టి.. ఇక ఆ అమౌంట్ ఎప్పటికీ తిరిగి రాదు. ఈ బెట్టింగ్ యాప్స్‌లో ఎన్నో రకాలున్నాయ్. అవన్నీ డబ్బులు దోచుకునేవే. షట్ డౌన్ ఛీటింగ్ అనే మరో రకమైన మోసం ఉంది. యాప్ ఓపెన్ చేశాక.. మినిమమ్ అమౌంట్ డిపాజిట్ చేయమని అడుగుతారు. ఒక్కసారి డిపాజిట్ చేశాక.. ఇక ఆ యాప్ పనిచేయదు. ఇంకోరకమైన మోసం కూడా జరుగుతుంది. యాప్‌లో లాగిన్ అవ్వాలంటే.. మన ఫోన్ డేటాను వాడి చేతిలో పెట్టాలి. ఆ డిటైల్స్‌తో బ్యాంక్ అకౌంట్లను సైతం హ్యాక్ చేస్తారు. సరే.. డబ్బు పోతే పోయింది ఇకనైనా ఆ జోలికి పోకుండా ఉందాం అనుకునే వాళ్లుంటారు. వాళ్లలో కొంతమంది ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. కారణం.. బెదిరింపులు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌కి అలవాటైన రెగ్యులర్ కస్టమర్లకు అప్పులు కూడా ఇస్తుంటారు. అలా.. లక్షలకు లక్షలు అప్పు చేయిస్తారు. తీరా ఆ అప్పు తీర్చకపోతే.. గంటల్లోనే ఇంటి మీదకి మనుషులను పంపిస్తారు. ఇంటా బయటా పరువు తీస్తాం, చంపేస్తాం, కుటుంబాన్ని నాశనం చేస్తాం అంటూ బెదిరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో పోలీసులకు కంప్లైంట్ చేయాలనే విచక్షణా జ్ఞానం పనిచేయక.. ఆత్మహత్య చేసుకుంటుంటారు. ఇంట్లో తెలిస్తే పరువు పోతుందని, తల్లిదండ్రులకు అగౌరవం అని ప్రాణాలు తీసుకుంటుంటారు.
ఒకప్పుడు పేకాట.. కుటుంబాల్ని నాశనం చేసింది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్‌లైన్ జూదం చేతిలోకే వచ్చేసింది. డ్రగ్స్‌కు బానిసైతే నాశనమయ్యేది ఆ ఒక్కడే. కాని, ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైతే కుటుంబాలకు కుటుంబాలే నాశనమవుతాయి. గతేడాది అక్టోబర్‌లో బోధన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. తాను మాయలో పడడమే కాకుండా.. తల్లిదండ్రులతోనూ అప్పులు చేయించాడు. చివరికి తల్లిదండ్రులతో కలిసి తాను కూడా ఉరేసుకొని చనిపోయాడు. వరంగల్‌లో బీటెక్ సెకండ్ ఇయర్ చదివే ఓ స్టూడెంట్.. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటుపడి తన కుటుంబ స్థాయికి మించి అప్పులు చేశాడు. తల్లిదండ్రులకు మొహం చూపించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
మరి.. ఈ బెట్టింగ్ యాప్స్‌ను నిషేధించలేమా? ఒకరకంగా వీటిని నియంత్రించడం కష్టతరమే. పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్-1867 ప్రకారం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ చాలా ప్రాంతాల్లో చట్టవిరుద్ధం. కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ బెట్టింగ్ యాప్స్‌ను పూర్తిగా నిషేధించాయి. కాకపోతే, కొన్ని యాప్‌లు విదేశీ లైసెన్స్ ద్వారా మనదేశంలో పని చేస్తున్నాయి. వీటిని నియంత్రించడం అసాధ్యం. సో, మన చేతిలో ఉన్నదల్లా.. వాటికి దూరంగా ఉండడమే. బెట్టింగ్ యాప్స్‌తో డబ్బులు సంపాదించిన వాడు ఒక్కడూ లేడనే విషయాన్ని తెలుసుకోవడమే. ఇంతకు మించి చేసేదేం లేదు.