
సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ కు అన్ని రంగాల్లో ప్రాధాన్యత పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా కనెక్టివిటీ విషయంలో మరింత ప్రాముఖ్యత లభిస్తుంది. పారిశ్రామిక అవసరాలతో పాటు టూరిస్టులు పెద్ద సంఖ్యలో విశాఖ వస్తుండడంతో నగరానికి ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది. అందుకే ఆ కనెక్టివిటీని దృష్టిలో ఉంచుకుని సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ ఉన్నారు అధికారులు. ఆ కోవకు చెందిన వార్తే ఇది.
విశాఖకు తాజాగా రెండు వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఒకటి సికింద్రాబాద్‌కు రెండో ట్రైన్ పూరీకి. సికింద్రాబాద్- విశాఖ-సికింద్రాబాద్ మధ్య మరో రైలు నడపాలని నిర్ణయించింది. ఇంకోటి పూరీ-విశాఖ-పూరీ రైలు. మార్చి 12న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ప్రారంభించే అవకాశం ఉందని తూర్పు కోస్తా రైల్వే అధికారులు తెలిపారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాలైన సికింద్రాబాద్, విశాఖలను కలుపుతూ రెండో వందేభారత్ త్వరలో పట్టాల పైకి రానుంది. ఇందుకోసం ట్రైన్ నంబర్ 20707/ 20708 ను నడిపేందుకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపింది. ఈ రైలు గురువారం మినహా వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రయాణ సమయం 8.45 గంటలుగా నిర్ణయించారు. ప్రతీ రోజూ ఉదయం 5.05గంటలకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1.50గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2.35గంటలకు బయల్దేరి రాత్రి 11.20కి సికింద్రాబాద్ స్టేషన్ చేరుకుంటుంది. తెలంగాణలో వరంగల్, ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో ఈ ట్రైన్ ఆగుతుంది.
విశాఖపట్నం-సికింద్రాబాద్- విశాఖపట్నం తొలి వందేభారత్ 20833/20834 రైలును 2023 జనవరి 15న సంక్రాంతి రోజు ప్రారంభం అయింది. ఈ రైలు ఉదయం 5.45గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి మధ్యాహ్నం 2.15గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరిగి 3 గంటలకు బయల్దేరి రాత్రి 11.30గంటలకు విశాఖకు చేరుతోంది. ఈ రైలు ప్రయాణం 8.30 గంటలు. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి ఊహించని స్పందన వచ్చింది. వందశాతం పైగా ఆక్యుపెన్సీ నమోదవుతోంది. రిజర్వేషన్ కూడా దొరకని పరిస్థితి నెలకొంటోంది. వీటికి తోడు ఒక్కటే రైలు ఉండటంతో సాంకేతికంగానూ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలో రెండో వందే భారత్ రైలు ను ఏర్పాటు చేయాలని బోర్డ్ నిర్ణయించడం విశేషం. అయితే విశాఖపట్నం- సికింద్రాబాద్-విశాఖపట్నం వందేభారత్ 16 బోగీలతో నడుస్తుండగా.. సికింద్రాబాద్-విశాఖపట్నం- సికింద్రాబాద్ రైలును 8 బోగీలతో మాత్రమే నడపనున్నారు. ఎక్కువ వందే భారత్ రైళ్లను వీలైనన్ని ఎక్కువ నగరాలకు అందుబాటులోకి తేవాలన్న ఉద్దేశంతో 8 బోగీలకు పరిమితం చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
విశాఖ నుంచి ఇంకో వందే భారత్ నంబర్ 20841 రైలు శనివారం మినహా ప్రతి రోజు ఉదయం 5.15గంటలకు పూరీలో బయలు దేరి 11.30గంటలకు విశాఖ వస్తుంది. తిరిగి విశాఖ-పూరీ(20842) రైలు శనివారం మినహా ప్రతి రోజు మధ్యాహ్నం 3.40గంటలకు విశాఖలో బయలు దేరి రాత్రి 9.55 గంటలకు పూరీ చేరుకుంటుంది. పూరీ – విశాఖ – పూరీ వందే భారత్ రైలు ఖుర్దారోడ్, బ్రహ్మపుర, పలాస, శ్రీకాకుళం, విజ యనగరం స్టేషన్లలో నిలిపెలా వాల్తేరు రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…