
పాతికేళ్లుగా పార్టీ కోసం కష్టపడిన కష్టానికి టిడిపిలో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ నాకు చక్కగానే బుద్ధి చెప్పారన్నారు టీడీపీ సీనియర్ నేత సతీష్ రెడ్డి. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ నాకు బహుమతులకు బదులు అవమానాలు ఇచ్చారని చెప్పారు. పులివెందుల టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి తన ఆవేదనను వెళ్ళగక్కారు. ఎవరిని ద్వేషించానో వాళ్లు స్నేహ హస్తం ఇచ్చారని.. ఎవరిని ప్రేమించానో వాళ్లు అవమానించారని సతీష్ రెడ్డి అన్నారు.
కడప జిల్లా రాజకీయాలలో పులివెందులకు ఓ స్పష్టమైన చరిత్ర ఉంది. వైయస్ కుటుంబం రాజకీయాలకు వచ్చిన దగ్గరనుంచి ఇప్పటి వరకు రాజకీయ ప్రత్యర్థిగా నిలబడ్డాడు సతీష్ రెడ్డి. ఆయనే ఇప్పుడు వైసీపీలో చేరనున్నారు. గత 25 ఏళ్లగా టిడిపి పార్టీ జెండాను భుజానమోసి పార్టీ కోసం అహర్నిశలు పాటుపడ్డానన్నారు. పోలింగ్ బూతులలో ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేని పరిస్థితి నుంచి పులివెందులలో ప్రతి పోలింగ్ బూత్ కు ఏజెంట్ ను కూర్చోబెట్టే స్థాయికి పార్టీని ఎదిగేలా చేశానన్నారు. ఈరోజు ఆ పార్టీపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు సతీష్ రెడ్డి. ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధపడ్డ పార్టీ టిడిపి అని అయితే ఆ పార్టీలో చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ తీరుకు అందులో ఇమడలేకపోయానని అన్నారు. వైయస్ కుటుంబంతో లాలూచీ పడ్డానని తనపై అబాండాలు వేసి నన్ను అవమానించారని ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ఇంత అవమానం జరిగిన చోట ఉండలేక నాలుగున్నర క్రితం టిడిపికి రాజీనామా చేశానని అప్పటినుంచి మొన్నటి వరకు కనీసం నన్ను పట్టించుకోలేదని తెలిపారు. ఎప్పుడైతే సీఎం జగన్ నన్ను గుర్తించి తన పార్టీ నేతలైన కడప జిల్లా అధ్యక్షుడు సురేష్ బాబును, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని తన వద్దకు పంపారో అప్పుడు తిరిగి సతీష్ రెడ్డి గుర్తుకొచ్చారని అన్నారు. ఏ పార్టీ పైన అయితే నేను పోరాడానో ఆ పార్టీ నాకు స్నేహ హస్తాన్ని ఇచ్చిందని సతీష్ రెడ్డి తన మనసులోని మాటను తెలిపారు. ఈరోజు పులివెందులలోని అన్ని మండలాలలోని తన అనుచరులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారితో చర్చించి వైసీపీలో చేరుతున్నట్లు సతీష్ రెడ్డి ప్రకటన చేశారు. ఏది ఏమైనా సతీష్ రెడ్డి నాలుగున్నర ఏళ్ల తర్వాత మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేస్తుండడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..