Polavaram R & R : “జగన్ అముల్ బేబీ అయితే… లోకేష్ హెరిటేజ్ దున్నపోతా? భాష మాకు కూడా వచ్చు. నాయకత్వ లక్షణాలు రక్తంలో ఉంటాయి…నోటికి వచ్చినట్లు మాట్లాడం కాదు” అంటూ తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్. దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును.. ఆయన తనయుడు సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని అనిల్ ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు అని అనిల్ అన్నారు.
పోలవరం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించిన అంశాలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయవాడ ఇరిగేషన్ శాఖ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అనిల్.. టీడీపీ అగ్ర నేతలు నారా లోకేష్, చంద్రబాబు పై విరుచుకుపడ్డారు.
జూమ్ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడని మంత్రి అనిల్ కుమార్ ఎద్దేవా చేశారు. జూమ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ.. శేషజీవితం ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం సీఎం వైయస్ జగన్ చేతుల్లో పదిలంగా ఉందన్నారు. దాదాపు 80 శాతం మంది ప్రజలకు సంక్షేమాన్ని అందించారని అనిల్ చెప్పుకొచ్చారు. విపత్కర సమయంలో హైదరాబాద్‌కు పారిపోయిన తండ్రీకొడుకులు నిత్యం జూమ్ యాప్ ద్వారా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో అడుగుపెట్టలేని దుస్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయాడన్నారు. ఆయన కొడుకు లోకేష్.. చిల్లర రాజకీయాలు చేసేందుకు ఏపీకి వస్తున్నాడన్నారు. పోలవరం ఆర్ అండ్ ఆర్ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న అనిల్… తన పాలనలో నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని చంద్రబాబు ఆర్‌అండ్‌ఆర్ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు.