AP Cm Jagan: కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష.. థర్డ్‌వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచన

|

Jun 16, 2021 | 4:25 PM

AP Cm Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

AP Cm Jagan: కలెక్టర్లతో సీఎం జగన్‌ సమీక్ష.. థర్డ్‌వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచన
CM YS Jagan
Follow us on

AP Cm Jagan: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలెక్టర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. స్పందన కార్యక్రమంపై కలెక్టర్లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణ ప్రగతి.. ఖరీఫ్‌లో విత్తనాలు, ఎరువులు, రుణాల అందుబాటు, అలాగే గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మాణంపై సమీక్ష చేశారు. కోవిడ్‌ నియంత్రణ విషయంలో కలెక్టర్లు, సిబ్బంది అద్భుతంగా పని చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గుతుండటంతో పాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోందన్నారు.

అలాగే ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అందించాలని, గ్రామాల్లో ఫీవర్‌ సర్వే కొనసాగించాలని సీఎం సూచించారు. కరోనా ఎప్పటికీ కూడా జీరోస్థాయికి చేరుతుందని అనుకోవద్దని, మనం జాగ్రత్తలు తీసుకుంటూనే.. కోవిడ్‌ను ఎదుర్కొవాలన్నారు. గ్రామాల్లో చేస్తున్న ఫీవర్‌ సర్వే కార్యక్రమాలు ప్రతి వారం కొనసాగించాలన్నారు. ఎవరు కోవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నా.. పరీక్షలు చేసి వెంటనే వైద్యం అందించాలని ఆదేశించారు. ఫీవర్‌ సర్వే కార్యక్రమం ప్రతి వారం కొనసాగాలన్నారు. థర్డ్‌వేవ్‌ వస్తుందో లేదో తెలియదు.. జాగ్రత్తగా ఉండటం మంచిదన్నారు. థర్డ్‌వేవ్‌ వచ్చినా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. అయితే థర్డ్‌వేవ్‌ ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారని, ఈ అంశంపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. చక్కటి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలి.

పిల్లలకు చికిత్స అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, జిల్లా స్థాయిలో వచ్చే 2 నెలలకు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేయాలని సీఎం సూచించారు. పిల్లల వైద్యం కోసం మూడు అత్యాధునిక ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని, వైజాగ్‌లో ఒకటి, కృష్ణా-గుంటూరు ప్రాంతాల్లో ఒకటి, తిరుపతిలో ఒకటి ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి అవసరమైన భూములను కలెక్టర్లు గుర్తించాలని ఆదేశించారు. అన్ని ఆర్టీపీసీఆర్‌ టెస్టులే చేయాలని, ఆరోగ్య శ్రీ అమల్లో కలెక్టర్లను అభినందిస్తున్నా అని జగన్‌ అన్నారు. 89శాతం మంది కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ను ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నారని, పేదవాడికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థికంగా భారం పడకుండా కలెక్టర్లు జాగ్రత్తలు తీసుకున్నారు.. అందరికీ అభినందనలు తెలియచేస్తున్నా అని అన్నారు. ఈరోజు 16వేలమందికిపైగా కోవిడ్‌ ట్రీట్‌ మెంట్‌జరుగుతుంటే.. 14 వేల మందికిపైగా ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆస్పత్రులపై కూడా కలెక్టర్లు దృష్టిపెట్టాలని అన్నారు.

జూన్‌ 22వ తేదీన చేయూత పథకాన్ని అమలు చేస్తున్నామని, దీనికి కలెక్టర్లు అంతా సిద్ధం కావాలని సూచించారు. జూలైలో విద్యాదీవెన, కాపు నేస్తం పథకాలు అమలు చేయనున్నట్లు చెప్పారు. అలాగే వైఎస్సార్‌ బీమా జూలై 1న ప్రారంభం అవుతుందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఇవీ కూడా చదవండి

Weather Forecast: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

US Bans Dogs: అమెరికా కీలక నిర్ణయం.. ఆయా దేశాల నుంచి తీసుకువచ్చే కుక్కలపై నిషేధం.. ఎందుకంటే..!