
ఆంధ్రప్రదేశ్‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఎఫ్‌సివి (FCV) పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. పొగాకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడం, మార్కెట్‌లో డిమాండ్-సరఫరా సమతుల్యతను పునరుద్ధరించడమే లక్ష్యంగా అత్యున్నత స్థాయిలో సహాయక ప్యాకేజీని ప్రకటించారు.
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు పంట కోసం దేశీయ, ఎగుమతి డిమాండ్ ఆధారంగా పొగాకు బోర్డు 142 మిలియన్ కిలోల పంట పరిమాణాన్ని మాత్రమే ఆమోదించింది. అయితే, అనుకూలమైన వాతావరణం , గత సీజన్లలో లభించిన లాభాల కారణంగా రైతులు అదనపు సాగు చేపట్టారు. దీంతో సాధారణం కంటే ఏకంగా 94 మిలియన్ కిలోలు అదనంగా ఉత్పత్తి అయి, మొత్తం పంట దిగుబడి దాదాపు 236 మిలియన్ కిలోలకు చేరుకుంది. మరోవైపు, పంట కాలంలో సుదీర్ఘ పొడి వాతావరణం వల్ల తక్కువ నాణ్యత గల ఆఫ్-స్టైల్ పొగాకు ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయ డిమాండ్ బలహీనపడటం, ఎగుమతి ఆర్డర్లు , దేశీయ డిమాండ్ మందగించడంతో మార్కెట్ పూర్తిగా మందగించింది. గత ఆగస్టు 1 నాటికి అంచనా వేసిన 236 మిలియన్ కిలోలలో కేవలం 20 శాతం (47.39 మిలియన్ కిలోలు) మాత్రమే అమ్ముడయ్యాయి. ఇంకా రైతుల వద్ద 188.61 మిలియన్ కిలోలకు పైగా పొగాకు నిల్వ ఉండిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
రైతుల ఇబ్బందిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సివి పొగాకు రైతులందరికీ ఒక్కో బార్న్‌కు రూ. 50,000 చొప్పున ఒకేసారి వడ్డీ లేని నిర్వహణ మూలధన సహాయాన్ని అందించనుంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 45,000 మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది.ఈ రుణాన్ని రైతులు తక్షణమే చెల్లించాల్సిన పని లేకుండా, 2027-28 మరియు 2028-29 ఆర్థిక సంవత్సరాలలో పంట అమ్మకం రాబడి ద్వారా రెండు సమాన వాయిదాలలో చెల్లించేలా వెసులు కల్పించారు.
కేంద్రం అందిస్తున్న సాయానికి అదనంగా, మార్కెట్‌లో అమ్ముడవుతున్న తక్కువ గ్రేడ్, ఆఫ్-స్టైల్ FCV పొగాకులకు (సుమారు 94 మిలియన్ కిలోలు) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిలోగ్రాముకు రూ. 10 చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది. ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలోకి జమ చేయనున్నారు. రైతులు ఆశించే ధరలకు, ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేందుకు ఈ సాయం ఎంతగానో దోహదపడుతుంది. అంతేకాకుండా, గ్రేడింగ్ ప్రక్రియ నిష్పక్షపాతంగా, వివాదరహితంగా జరిగేలా వేలం వేదికల వద్ద ప్రభుత్వ అధికారులు, రైతులు, వ్యాపార వర్గాలతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నారు.
సదరన్ లైట్ సాయిల్ (SLS) , సదరన్ బ్లాక్ సాయిల్ (SBS) ప్రాంతాల్లో పొగాకును సేకరించేందుకు వివిధ కొనుగోలు కంపెనీలు తమ సూచనాత్మక ధరలను వెల్లడించాయి..బ్రైట్ టొబాకో ధర కేజీ రూ. 230 ,ఆఫ్-స్టైల్ పొగాకు ధర కేజీ రూ. 130, మధ్యస్థ శ్రేణి పొగాకు ధర కేజీ ధర రూ. 190, తక్కువ గ్రేడ్ పొగాకు కేజీ ధర రూ. 110గా కొనుగోలు కంపెనీలు నిర్ణయించాయి..ఇవి సూచనాత్మక ధరలు మాత్రమే…మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి..రాష్ట్రంలో రాబోయే 2 నెలల్లో మిగిలిన పంటను గరిష్టంగా విక్రయించేలా పొగాకు కొనుగోలు కంపెనీలు తమ కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రోజుకు కనీసం 20 లక్షల కిలోల పొగాకును కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది
ప్రస్తుత మార్కెట్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక డిమాండ్-సరఫరా సమతుల్యతను కాపాడేందుకు వచ్చే ఏడాది 2026-27 ఆంధ్రప్రదేశ్ ఎఫ్‌సివి పొగాకు అధీకృత పంట పరిమాణాన్ని పొగాకు బోర్డు ఇప్పటికే 81 మిలియన్ కిలోగ్రాములకు భారీగా తగ్గించింది.