మార్చి 28, 29 తేదీలలో రెండు రోజుల పాటు జరగనున్న G20 సదస్సుకు ఈ ఏడాది భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక ఈ సదస్సుకు మన విశాఖపట్నం వేదికగా మారింది.ఇప్పటికే సదస్సు నిర్వహణకు కావలసిన అన్ని రకాల ఏర్పాట్లను చేశామని జాయింట్ సెక్రెటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ సల్మాన్ ఆరోక్య రాజ్ తెలిపారు. మొత్తం 7 సెషన్స్(మొదటి రోజు 4, రెండో రోజు 3), ఒక వర్క్ షాప్ జరగనున్నాయని, ఈ సదస్సులో దాదాపు 40 దేశాల నుంచి 57 మంది ప్రతినిధులు హజరవుతారని ఆయన తెలిపారు. సదస్సు అనంతరం అంటే.. 30న G20 దేశాలు నుంచి వచ్చిన వారికి ట్రైనింగ్ క్లాస్‌లు ఉంటాయని, మిగిలిన దేశాలవారికి వారి దేశాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారన్నారు. అలాగే 31న దేశంలోని అన్ని నగరపాలక సంస్థల కమిషనర్లు, G20 ప్రతినిధుల పరస్పర అవగాహనా సదస్సు నిర్వహిస్తారు. మొత్తం 4 రోజుల పాటు విశాఖలో G20 ప్రతినిధి బృందం బస చేయనుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ సదస్సుకు సీఎం జగన్ కూడా హాజరు కానున్నారు. 28వ తేదీ సాయంత్రం విశాఖలో ల్యాండ్ కానున్న సీఎం జగన్.. G20 ప్రతినిధులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న గాలా డిన్నర్‌కు హాజరవుతారు. ఈ క్రమంలో సాయంత్రం 5 గంటల నుంచి 8.30 వరకు అక్కడే ఉంటారు సీఎం.
మరోవైపు ‘G20 సదస్సు 2023’ ఢిల్లీ వేదికగా సెప్టెంబర్‌లో జరగనుంది. ఇందులో భాగంగానే దేశంలోని 50 ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే G20 సన్నాహక సదస్సులు బెంగళూరు, చండీగఢ్, చెన్నై, గువహతి, ఇండోర్, జోథ్‌పూర్, ఖజురహో, కోల్‌కతా, లక్నో, ముంబై, పూణే, రాణ్ ఆఫ్ కచ్, సూరత్, తిరువనంతపురం, ఉదయ్‌పూర్ వంటి పలు నగరాలలో జరిగాయి. ఈ క్రమంలోనే మార్చి 28, 29 రోజులలో విశాఖపట్నం వేదికగా జరగనున్న G20 సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిస్తోంది. G20 దేశాల సదస్సు నిర్వహాణకు కావలిసిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అందు కోసం సదస్సు నిర్వహణ ప్రాంతాన్ని 2500 మంది పోలీసులు మొహరించనున్నారు. ఇక వీరిలో 1850 మంది సివిల్ పోలీసులు, 400 మంది ఆర్మ్‌డ్ రిజర్వ్ పోలీసులు, 4 గ్రే హౌండ్స్ దళాలు, 2 క్యూఆర్టీ టీమ్స్, 6 ప్రత్యేక పార్టీలు, 2 ఏపీఎస్పీ ప్లాటూన్లు ఉండడం విశేషం.
జీ20 సదస్సు నేపధ్యంలో విశాఖపట్నం నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటక ప్రాంతాల్ని సుందరంగా అలంకరించారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నగరమంతా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పర్యాటక ప్రదేశాలకు రేపు స్థానికులకు అనుమతి లేదని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.శ్రీకాంత్ తెలిపారు. విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న G20 సదస్సు సందర్భంగా ఆయన ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. తర్వాత విశాఖలో ఆ తేదీల్లో ఎలాంటి ఆంక్షలు విధిస్తారో తెలిపారు. ఆయన మాట్లాడుతూ సిబ్బంది ధరించవలసిన యూనిఫారం, సదస్సు వద్ద విధులు నిర్వహించే అధికారులు, సిబ్బంది నియమాలు, ట్రాఫిక్, ఇతర విధుల నిర్వహణలో పాటించాల్సిన రూల్స్ ఏమిటో తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..