Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సప్లై అవుతున్న మద్యంలో విష పదార్థాలు ఉన్నాయని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను ఖండించారు లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు. ఈ ఆరోపణల్లో ఏ మాత్రం వాస్తవం లేదని వారు క్లారిటీ ఇచ్చారు. డిస్టిలరీల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా తమను అడగవచ్చని, అవసరమైతే డిస్టిలరీలను విజిట్ చేయవచ్చన్నారు.
ఏపీలో కొన్ని మద్యం బ్రాండ్లలో విష పదార్థాలు ఉన్నట్టు ఇటీవల టీడీపీ నాయకులు ఆరోపణలు చేశారు. మద్యంలో పైరోగలాల్, డై ఇథైల్ థాలేట్, ఐసోఫులెరిక్ యాసిడ్ వంటి కొన్ని ప్రమాదకర కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయన్నది వారి ఆరోపణ. ఇవి కలిపిన మద్యం తాగితే మతిభ్రమించడం, నరాలు లాగేయడం, మెదడుతో పాటు ఒళ్లంతా సూదులు గుచ్చినట్లు ఉంటుందని, జన్యుపరమైన సమస్యలు వస్తాయంటూ మీడియా సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు టీడీపీ నేతలు. ఈ ఆరోపణల నేపథ్యంలో డిస్టిలరీల క్వాలిటీపై ప్రజలకు వివరించేందుకు మీడియా ముందుకు వచ్చారు లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు. మద్యంలో విష పదార్థాలు ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఎవరూ ఎలాంటి అపోహలకు గురి కావద్దని కోరారు. డిస్టిలరీల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా తమను అడగవచ్చని చెప్పారు. ఈ విషయంలో పెర్ల్ డిస్టిలరీస్ శివకుమార్ రెడ్డి, సోరింగ్ స్పిరిట్స్ వెంకటేశ్వరరావు, ఈగిల్ డిస్టిలరీస్ సత్యనారాయణ రెడ్డి, PMK డిస్టిలేష్ చంద్రశేఖర్, లిక్కర్ అండ్ బీర్ సప్లయర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామేశ్వరరావు వివరణ ఇచ్చారు.
కొన్ని విస్కీ బ్రాండ్లలో విష పదార్థాలు ఉన్నాయని టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మీడియా సమావేశంలో ఆరోపించారు. దాంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. టీడీపీ ఆరోపణలపై మంత్రి అంబటి రాంబాబు వెంటనే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా వివరణ ఇచ్చారు. లిక్కర్‌ను ఎవరు పరిశీలించి సర్టిఫై చేస్తారు? ప్రభుత్వం అప్రూవల్, సప్లైలో పాటిస్తున్న పద్ధతి ఏంటి? ఈ విషయంపైనా క్లారిటీ ఇచ్చారు లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు. విమ్టా ల్యాబ్ వాళ్లు మాత్రమే లిక్కర్‌ను పరిశీలించి సర్టి ఫై చేస్తారని వారు చెప్పారు. ప్రభుత్వం నుంచి అప్రూవల్ వచ్చాకే సరఫరా చేస్తాం, మూడు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రక్రియ నడుస్తోందన్నారు. క్వాలిటీ లిక్కర్‌నే అందిస్తున్నామని చెప్పారు.
ఇది ప్రజల ప్రాణాలతో ముడి పడి ఉన్న వ్యాపారమని, అందుకే తయారీ నుంచి రవాణా వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. అపోహలను వీడాలని ప్రజలను కోరుతున్నామన్నారు. అవసరమైతే డిస్టిలరీలను విజిట్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని కోరారు. డిస్టిలరీల విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా తమను సంప్రదించవచ్చన్నారు లిక్కర్ తయారీదారుల అసోసియేషన్ ప్రతినిధులు.
ఏపీలో మద్యం సరఫరా చేసే డిస్టిలరీలను ఎంతో క్వాలిటీగా మెయింటెన్ చేస్తున్నామని, ఇందులో తయారయ్యే మద్యం పూర్తి క్వాలిటీతో ఉంటుందన్నారు. అలాంటిది మద్యంపై దుష్ప్రచారం తగదన్నారు. హాని కలిగించే రసాయనాలను ఏ బ్రాండ్‌లోనూ వాడటం లేదన్నారు. టీడీపీ నాయకులు ఆరోపణలు చేసిన విధంగా ఏ మద్యం బ్రాండ్‌లోనూ విష పదార్థాలు లేవని స్పష్టం చేశారు. ఒక్కో మద్యం కంపెనీ నుండి నాలుగైదు బ్రాండ్‌లు మార్కెట్లోకి వస్తుంటాయని, ఏపీలో 184 బ్రాండ్ల అమ్మకానికి అనుమతి ఉందన్నారు అసోసియేషన్ సభ్యులు. వీటి తయారీ మీద రాష్ట్రంలో నాలుగు లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు.
ధరలు, బ్రాండ్ల విషయంలో కూడా అసోసియేషన్ ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు. తెలంగాణతో పోలిస్తే ఏపీ ప్రభుత్వం తక్కువ ధర ఇస్తుందన్నారు. ఇప్పుడు ఇస్తున్న ధరలు తమకు గిట్టుబాటు కావడం లేదని, ధర పెంచాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. 2017 నుంచీ తమకు మద్యం అమ్మకాలపై సరైన లాభాలు లేవని, ధరలు తక్కువగా ఉండటమే అందుకు కారణమని వివరించారు. వినియోదారుల డిమాండ్‌ను బట్టి బ్రాండ్‌ల సరఫరా ఉంటుందని, ప్రముఖ బ్రాండ్‌లు ధర నచ్చకపోతే సరఫరా నిలిపివేస్తుంటాయన్నారు. ఏయే బ్రాండ్‌లు పెట్టాలనేది చేసుకున్న ఒప్పందాలను బట్టి ఉంటుందని పేర్కొన్నారు. మూడు దశాబ్దాలుగా ఒక పద్ధతి ప్రకారమే లిక్కర్ తయారీ, సరఫరా ప్రక్రియ నడుస్తోందని, కాబట్టి బయట జరిగే ఎలాంటి దుష్ప్రచారాన్ని నమ్మవద్దని లిక్కర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. హాని కలిగించే రసాయనాలను ఏ బ్రాండ్‌లోనూ వాడటం లేదని క్లారిటీ ఇచ్చారు.