Ganta Srinivasa Rao: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) కాపు నాయకుల్లో ఆయన చాలా ఫేమస్. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లో కీలక నాయకుడు. మ్యాటర్ ఏదైనా..లాభనష్టాలు భేరీజు వేసుకోవడంలో దిట్ట. అధికారం ఎక్కడ ఉంటే.. అక్కడ ఆయన ఉంటారన్న ముద్ర కూడా ఉంది. అంతటి గుర్తింపు సాధించిన ఆ మాజీ మంత్రి గంటా శ్రీనివాసేనని.. గంటాపథంగా చెప్పొచ్చు. మరి, ఇటీవల కాపు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ టీడీపీ(TDP) ఎమ్మెల్యే.. పార్టీ మారుతారా? ఉన్నచోటే ఉంటారా? అనేది చర్చనీయాంశంగా మారింది.
మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రూటే సెపరేటు. అందుకే, రాజకీయ కదలికలపై ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇవాళ అమరావతి లోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన విశాఖ పార్లమెంట్ పార్టీ సమీక్షా సమావేశానికి అందరూ వచ్చి.. ఆయన రాకపోవడం హాట్ టాపిక్ అయ్యింది. వ్యక్తిగత పనులతో రాలేకపోతున్నాననీ.. ముందస్తు సమాచారం ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నా.. ఇటీవల కాలంలో అసలు పార్టీ అధిష్టానం కూడా గంటాని పెద్దగా పట్టించుకోవడం లేదన్న మాట బాగా వినిపిస్తోంది. దానికి బలం చేకూరేలా చాలా పరిణామాలే జరిగాయి.
2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి చివరినిమిషంలో గంటా పోటీచేయడంతో అప్పటికే దానిపై ఆశలు పెట్టుకున్న పంచకర్ల రమేష్ లాంటివాళ్లు… రాజకీయంగా, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామనే ఫీలింగ్‌తో ఉన్నారు. అయినా, గంటా కోరుకున్న చోటే టికెట్ ఇచ్చింది టీడీపీ. తీరా తాను గెలిచి పార్టీ ఓడటంతో… వైసీపీలో చేరేందుకు గంటా సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరిగింది. అయితే, అధికార పార్టీలో చేరాలని ఎంతగా ప్రయత్నించినా.. విశాఖ పార్టీ ఇంచార్జ్ విజయసాయిరెడ్డి అంగీకారం తెలపకపోవడంతో ఆ ప్రతిపాదన ఆగిపోయింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. పార్టీతో సంబంధం లేకుండా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గంటాకు రాజకీయంగా ఎలాంటి లాభం ఒనగూరలేదు. 2021 డిసెంబర్ 20న పాయకరావుపేటలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ లో పాల్గొన్న ఆయన.. రాష్ట్ర రాజకీయాలను శాసించబోయేది కాపులే అంటూ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీశాయి. ఆ తర్వాత వరుసగా కాపు నేతల సమావేశాల్లోనూ పాల్గొన్నారు. అదే సమయంలో టీడీపీకి కూడా దగ్గరవుతున్నట్టు కొన్ని సంకేతాలు ఇస్తూ వచ్చారు గంటా. లోకేష్ జన్మదిన వేడుకలు, పార్టీల కమిటీల ఏర్పాటులో యాక్టివ్‌గా వ్యవహరించారు. అయితే, ఇవాళ జరిగే విశాఖ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైర్హాజరై.. మళ్లీ సస్పెన్స్‌కు తెరలేపారు.
ఈ తరహా పోకడతో.. టీడీపీలోని ఓ వర్గం గంటాను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవకాశవాద రాజకీయాలు చేసే గంటా కు ప్రాధాన్యం ఇస్తే సహించేది లేదంటున్నారు. వెలగపూడి రామకృష్ణ, అయ్యన్నపాత్రుడు లాంటివాళ్ళు టీడీపీ హైకమాండ్‌కు ఈ విషయంలో అల్టిమేటం కూడా ఇచ్చారు. దీంతో, భవిష్యత్ లో టీడీపీ తనకు ప్రాధాన్యత ఇస్తుందా? లేదా? అనే మీమాంసతోనే ఇవాల్టి సమావేశానికి గంటా వెళ్లలేదన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో జనసేన టీడీపీ కలిస్తే.. జనసేన కోటా నుంచి పోటీ చేసి పొత్తులో లాభపడాలన్న ఆలోచనలో కూడా గంటా ఉన్నట్టు సమాచారం. ముందు చిరంజీవిని, తర్వాత పవన్ కళ్యాణ్‌ని కలిసి.. ఒక నిర్ణయానికి వచ్చాకే… టీడీపీ హైకమాండ్‌ని కలవాలని గంటా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also…. Rivers Link: గోదావరి -కావేరీ నదుల అనుసంధానికి ముందడుగు.. రాష్ట్రాల సూచనల మేరకే ప్రాజెక్టు డిజైన్లుః కేంద్రం