AP Assembly Session: మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా?..ఆ మంత్రిపై స్పీకర్ ఆగ్రహం..ఎందుకంటే?

| Edited By: Velpula Bharath Rao

Nov 15, 2024 | 4:47 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రశ్నోత్తరాల సమయానికి ఓ మంత్రి ఆలస్యంగా వచ్చాడు. దీంతో మంత్రిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? స్పీకర్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు?

AP Assembly Session: మంత్రులే ఆలస్యంగా వస్తే ఎలా?..ఆ మంత్రిపై స్పీకర్ ఆగ్రహం..ఎందుకంటే?
Andhra Pradesh Speaker Ayyannapatrudu Got Angry On Minister Vasamsetti Subhash
Follow us on

ఏపీ అసెంబ్లీలో ఈరోజు ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆలస్యంగా వచ్చిన ఒక మంత్రిపై స్పీకర్ అయ్యన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభం అవ్వగానే ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయా మంత్రులు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. దానికోసం మంత్రులు విస్తృతమైన కసరత్తే చేస్తుంటారు. వీలైనంతవరకు ముందుగానే అసెంబ్లీకి కూడా వచ్చి తమ ప్రశ్నల కోసం ఎదురు చూస్తుంటారు. కానీ ఈరోజు ఒక మంత్రి తాను సమాధానం చెప్పాల్సిన సమయానికి అసెంబ్లీకి రాలేదు. దీంతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతకీ ఎవరా మంత్రి అంటే? సాధారణంగా అసెంబ్లీ ఉదయం సరిగ్గా తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుంది. ప్రారంభమవగానే ప్రశ్నోత్తరాల సమయాన్ని తీసుకుంటారు. ఆ సమయానికి మంత్రులందరు చేరుకుంటారు. ఈరోజు కార్మిక శాఖ మంత్రి వాసం శెట్టి సుభాష్ నాలుగో ప్రశ్నకి సమాధానం చెప్పాల్సి ఉంది.

మొదటి మూడు ప్రశ్నలు వాయిదా పడడంతో..

ఈరోజు ప్రశ్నోత్తరాల సమయానికి మొదటి మూడు ప్రశ్నలు వాయిదా పడ్డాయి. దీంతో నేరుగా నాలుగో ప్రశ్నకే మొదటి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అసెంబ్లీలో ఏర్పడింది. మొదటి మూడు ప్రశ్నలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వేసిన ప్రశ్నలు. వాళ్ళు ఎవరు అసెంబ్లీకి రాకపోవడంతో ఆ ప్రశ్నల్ని స్పీకర్ వాయిదా వేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రశ్న వేసిన సభ్యులే రాకపోతే ఇక సమాధానం ఎవరికి చెప్పాలి? దానికి సంబంధించిన క్లారిఫికేషన్ ఎవరికి ఇవ్వాలి? అంటూ స్పీకర్ వాయిదా వేశారు. దీంతో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆరుమిల్లి కార్మిక శాఖ మంత్రికి ఒక ప్రశ్న వేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటుకు సంబంధించిన ప్రశ్న ఆది. అయితే ఆ సమయానికి కార్మిక శాఖ మంత్రి అసెంబ్లీకి చేరుకోలేదు. దీంతో స్పీకర్ చేసేదేం లేక తర్వాత ప్రశ్నకు వెళ్లారు.

మంత్రి రాగానే చురకలు

మొదటి మూడు ప్రశ్నలు వాయిదా పడ్డ విషయాన్ని తెలుసుకున్న కార్మిక శాఖ మంత్రి హడావిడిగా అసెంబ్లీకి చేరుకున్నారు. అప్పటికే ఆయన ప్రశ్న వాయిదా పడిపోయింది. దీంతో కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు స్పీకర్ అయ్యన్న చురకలు అంటించారు. ప్రశ్నోత్తరాల సమయానికి అసెంబ్లీలో మంత్రి లేకపోవడంతో ప్రశ్నను వాయిదా వేసిన స్పీకర్ అనంతరం వచ్చిన మంత్రిని ప్రశ్నోత్తరాల సమయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. మంత్రులే లేట్‌గా వస్తే ఎలా అంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో వచ్చేందుకు మంత్రులు ప్రయత్నించాలని కోరారు. దీంతో ఆలస్యానికి క్షమాపణ చెప్పిన మంత్రి సుభాష్ తర్వాత తన ప్రశ్నకు సమాధానం చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి