Andhra Pradesh: పట్టుబడిన అక్రమ మద్యం నేలపాలైంది. ఒకటి కాదు.. రెండు కాదు రూ. 5 కోట్లకుపైగా బాటిళ్లను రోలర్‌తో ధ్వంసం చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీయార్‌జిల్లా నందిగామ డివిజన్‌లో మద్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపింది జగన్ సర్కార్. తెలంగాణ నుంచి ఏపీలోకి అక్రమంగా రవాణా అయ్యే మద్యంపై పెద్ద నిఘా పెట్టింది. దాంతో ఏపీ-తెలంగాణ సరిహద్దులో పెద్దమొత్తంలో మద్యం బాటిళ్లు పట్టుబడ్డాయి. గతేడాది నుంచి నందిగామ సబ్‌డివిజన్‌లోని 8 పోలీస్‌స్టేషన్ పరిధిలో మద్యం అక్రమ 6075 కేసులు నమోదయ్యాయి. దాదాపు 2 లక్షల 43 వేల 385 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ మొత్తం 5.47 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.
పట్టుబడ్డ మద్యం డీపీఎల్, ఎన్డీపీఎల్, చీప్‌లిక్కర్లను వేర్వేరుగా చేసి , వాటన్నింటిని పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో ధ్వంసం చేశారు. ఎన్టీయార్‌జిల్లా పోలీసుల అధికారుల సమక్షంలో ఈ తంతు పూర్తి చేశారు. రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.
ఏపీలో మద్యపాన నిషేధం అమలులో పెట్టేందుకు జగన్ సర్కార్ పెద్ద సాహసమే చేసింది. మద్యం రేట్లు పెంచితే.. వాటిని మానేస్తారని భావించారు. ఐతే మందుబాబులు తెలంగాణలో మద్యం రేట్లు తక్కువగా కావడంతో అక్కడికి క్యూ కట్టారు. తాగినంతా తాగి, రిటర్న్‌లో పెద్ద మొత్తంలో మద్యం తీసుకురావడం మొదలెట్టారు. దాంతో ఏపీ-తెలంగాణ బోర్డర్‌లోని గరికపాడు చెక్‌పోస్టు దగ్గర ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఆఫీసర్లను నియమించి, మద్యం అక్రమరవాణాను అడ్డుకున్నారు. కళ్లుగప్పి మందుబాబులు కొందరు బస్సు, ట్రాక్టర్, ఎడ్లబండి, బైక్‌లో తరలిస్తుండగా అడ్డంగా బుక్కయ్యారు. వారిపై కేసులు నమోదు చేసి, వాహనాలను సీజ్ చేశారు. కేసు పూర్తయ్యాక వాటిని మూకుమ్మడిగా ఒకే దగ్గర పారబోసి ధ్వంసం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..