మాజీ మంత్రి కొడాలి నానిపై మరో మాజీ మంత్రి పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొడాలి నానిని ఉద్దేశించి విపక్ష నేతలు చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇస్తూనే.. సరదా వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని చదువుకోలేదనేది డ్రామా మాటలు మాత్రమే అని అన్నారు. నాని పైకి ఏమీ తెలియనట్టు అమాయకంగా కనిపిస్తారు కానీ, ఆయన బుర్ర పాదరసం కంటే వేగం అని అన్నారు. పెద్ద గెడ్డం, మెడలో రుద్రాక్షలు రౌడీ గెటప్‌లా కనిపిస్తాయి కానీ, ఆయన చాలా మంచివారని, చాలా తెలివైన నాయకుడు అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. నోట్లో కిళ్లీ వేసుకుంటాడు కదా అని ఆయన్ని ఓడించడానికి ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారని, కానీ ఐదోసారి గెలవడానికి ఆ ఇద్దర్నీ బోల్తా కొట్టించడానికి కావాల్సిన స్కెచ్ కొడాలి ఇప్పటికే వేశారని అన్నారు. గుడివాడ బస్ డిపో ప్రారంభోత్సవ సభలో పేర్ని నాని ఈ కామెంట్స్ చేశారు.
ఇదే సభలో పాల్గొన్న కొడాలి నాని.. గుడివాడలో 5వ సారి పోటీ చేయడంపై స్పందించారు. ఐదోసారి గెలిచి చరిత్ర సృష్టిస్తానని కొడాలి ధీమా వ్యక్తం చేశారు. కానీ కొందరు సెంటిమెంటూ.. అదీ ఇదీ అంటున్నారని, అయినప్పటికీ గెలిచేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని అన్నారు. ఇక ఇదే సమయంలో మరోసారి చంద్రబాబు, రజనీకాంత్‌లపై కొడాలి ఫైర్ అయ్యారు. వారిద్దరిని ఉద్దేశించి విమర్శలు చేశారు.
చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీపై పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆ ఇద్దరూ డ్రామాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చిందే చంద్రబాబు కోసం అని ఎద్దేవా చేశారు. తాము నాలుగేళ్ల నుంచి ఇదే చెబుతున్నామన్నారు. 2019లో వ్యతిరేక ఓటుని చీల్చేందుకు విడిపోయారని, ఇప్పుడు ఓటు చీలకూడదని ఒక్కటవుతున్నారని పేర్నినాని వ్యాఖ్యానించారు. పవర్, చంద్రబాబు ఇద్దరూ ఒకే తాను ముక్కలని, వన్‌బైటు అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు దగ్గర పవన్ కల్యాణ్ తీసుకుంటున్న.. ప్యాకేజీలు జనాలకు తెలుసునని అన్నారు పేర్ని నాని.
చంద్రబాబు, పవన్‌పై కొడాలి నాని సెటైర్లు వేశారు. విడిగా వెళ్తే వీళ్లు ఎమ్మెల్యేలుగా కూడా గెలవలేరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష హోదా వస్తుందా లేదా అన్నదే వాళ్ల ఆందోళన అని అన్నారు. కలిసి పోటీ చేయకపోతే పవన్ ఎమ్మెల్యేగా గెలవలేడని వ్యాఖ్యానించారు కొడాలి. కుప్పంలోనూ చంద్రబాబుకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. పవన్‌కు సీట్లు, అధికారం అవసరం లేదని, ఆయనకు కావాల్సింది చంద్రబాబు ఇస్తారన్నారు. పక్క రాష్ట్రాల నుంచి కూడా నేతల్ని తెస్తున్నారని, డీఎంకే, అన్నాడీఎంకే, బీఆర్ఎస్‌ను కూడా కలుపుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు కొడాలి నాని. ఎంత మంది కలిసొచ్చినా జగన్‌ను ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారాయన.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..