Kondapalli Mining: తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని చూస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు

|

Jul 31, 2021 | 4:48 PM

Kondapalli Mining: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని టీడీపీ

Kondapalli Mining: తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని చూస్తున్నారు.. సంచలన ఆరోపణలు చేసిన చంద్రబాబు
Chandrababu
Follow us on

Kondapalli Mining: మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసులు పెట్టడం దుర్మార్గపు చర్య అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. వైసీపీ వాళ్లే దాడులు చేసి.. రివర్స్ కేసులు పెట్టారని మండిపడ్డారు. కొండపల్లి మైనింగ్ వ్యవహారం నేపథ్యంలో అరెస్టైన దేవినేని ఉమామహేశ్వరావు కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు శనివారం నాడు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. చంద్రబాబు వెంట ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బచ్చుల అర్చునుడు, వైవిబి రాజేంద్రప్రసాద్, పట్టాభి వెళ్లారు. కాగా, చంద్రబాబు రాకతో.. ఉమ ఇంటి వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైసీపీ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. వైసీపీ వాళ్లు దాడులు చేసి కేసులు పెట్టారని అన్నారు. కొండపల్లిలో అక్రమ మైనింగ్ జరుగుతోందని చంద్రబాబు ఆరోపించారు. కొండపల్లి బొమ్మలు తయారు చేసే చెట్లను నరికివేస్తున్నారని అన్నారు. దేవినేని ఉమపై హత్యాయత్నం చేసినట్లు తప్పుడు కేసులు పెట్టారని, ఇంత జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మరీ ఇంత అరాచకమా? అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.

40 సంవత్సరాల తన రాజకీయ జీవితంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను, డీజీపీలను చూశానని, ఇంత దుర్మార్గంగా ఎవరూ వ్యవహరించలేదని చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజ నిర్దారణ కమిటీ నేతలను అడ్డుకొని అరెస్ట్ లు చేస్తారా? అని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే పిర్యాదు తీసుకోకుండా.. రివర్స్‌గా దేవినేని ఉమ పైనే కేసులు పెట్టడం ఏంటని ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీశారు. సీఎం జగన్‌కు పరిపాలన చేతకాదని విమర్శలు గుప్పించారు. ‘‘దేవినేని ఉమ కారు ఎక్కడ దిగాడు.. ఎవరిని బెదిరించాడు..’’ అంటూ పోలీసులను చంద్రబాబు ప్రశ్నించారు. తమపై తప్పుడు కేసులు పెట్టి దొంగలను, మైనింగ్ మాఫియాను రోడ్డు మీద తిప్పుతారా? అని ప్రశ్నించారు. సరిగా పరిపాలన చేయండన్న ఆయన.. చేతకాకపోతే ఇంటికి వెళ్లిపోండంటూ వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు చురకలంటించారు. ‘నా పాలనా సమయంలో మీపై నేను కేసులు పెడితే మీరు తిరిగేవారా?’ అని వైసీపీ నేతలపై బాబు మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంటే నమ్మకం పోయిందని, వ్యవస్థను పూర్తిగా బ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాజమండ్రి జైలు సూపరింటెండెంట్‌ని ఎందుకు మార్చారని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీని ఏదో చేయాలని చూస్తున్నారంటూ ముఖ్యమంత్రి జగన్ తీరుపై చంద్రబాబు ఆరోపణలు గుప్పించారు. టీడీపీ ఎవరికీ భయపడదని, పార్టీని ఎవరూ ఏమీ చేయలేరన్నారు. ఎన్జీటీ కూడా మైనింగ్ జరిగిందని చెప్పిందని గుర్తు చేసిన ఆయన.. ఇప్పుడు అధికారులు ఏమని సమాధానం చెబుతారని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. సీనియర్ అధికారులతో కమిటీ వేయాలని, ఆపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే తాము కోర్టును ఆశ్రయిస్తామన్నారు. అలాగే ఎన్జీటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు.

Also read:

Independence Day: తీవ్ర విషాదం.. భగత్ సింగ్‌లా నటిస్తూ ఉరికొయ్యకు బలైన చిన్నారి..

Andhra Pradesh: చేసిందంతా వారే.. చంద్రబాబు, దేవినేని ఉమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి..

Plastic Ban: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం 8 ఏళ్ల చిన్నారి వినూత్న ప్రయత్నం.. ఏకంగా సముద్ర గర్భంలో..