వాతావరణ శాఖ తాజా అంచనా ప్రకారం.. నెల్లూరు – మచిలీపట్నం మధ్య తుఫాను తీరం దాటబోతోంది. నాలుగో తేదీ రాత్రి 5వ తేదీ తెల్లవారుజామున తుఫాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కోస్తావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది వాతావరణ శాఖ. తుఫాను ముంచుకొస్తున్న నేపథ్యంలో మూడో తేదీన కోస్తాలో ఆరెంజ్, ఎల్లో అలెర్ట్.. నాలుగో తేదీన ఆరెంజ్, రెడ్ అలెర్ట్.. ఐదో తేదీన కొన్ని జిల్లాల్లో ఎల్లో, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్, మిగిలిన కోస్తా జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఏపీ పై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుంది .. కోస్తా రాయలసీమకు భారీ వర్ష సూచన ఉంది. కోస్తా అంతా ప్రభావం ఉంటుందని అధికారులు అంటున్నారు. మూడు నాలుగు, ఐదు, ఆరు తేదీల్లో కొన్ని చోట్ల భారీ నుంచి.. మరికొన్ని చోట్ల అతిభారి వర్షాలు.. అత్యంత భారీ వర్షాలు కూడా కురుస్తాయని అంటున్నారు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద.
తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలకు తోడు.. బలమైన ఈదురు గాలులు వీస్తాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. చెట్లు కూలిపోతాయి.. కచ్చా ఇల్లు పడిపోతాయని అంటున్నారు. దక్షిణ కోస్తా పరిసర ప్రాంతాల్లో తీరం దాటినప్పటికీ.. ఆ తర్వాత తుఫాను ప్రభావం ఉత్తర కోస్తా పైన ఎక్కువగా చూపుతుందని అంటున్నారు. ఆరో తేదీ వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళద్దని సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..