Kurnool Airport: కర్నూలులోని ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమాన సర్వీస్ సోమవారం(నేటి) నుంచి ప్రారంభం కానుంది. ఉదయం 10.10 గంటలకు బెంగళూరు నుంచి కర్నూలుకు తొలి ప్యాసింజర్ ఫ్లైట్(ఇండిగో) రానుంది. అనంతరం ఉదయం 10.30 గంటలకు కర్నూలు ఎయిర్‌పోర్టు నుంచి విశాఖపట్టణానికి తొలి ఫ్లైట్ ప్రయాణం సాగనుంది. మొత్తంగా విశాఖ, చెన్నై, బెంగళూరుకు కర్నూలు నుంచి సర్వీసులు నడపనున్నారు. విమాన సర్వీసులు ప్రాంభించడానికి డీజీసీఏ ఈ ఏడాది జనవరి 15న అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బీసీఏఎస్ జనవరి 27న సెక్యూరిటీ క్లియరెన్స్‌ను మంజూరుచేసింది. ఇక కర్నూలు జిల్లా నుంచి తొలి విమాన సర్వీస్ నడుస్తుండటంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ చిరకాల కోరిక తీరిందంటూ సంతోసం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, మార్చి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. కర్నూలు జిల్లాలోని ఓర్వకల్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంలో భాగంగా తొలుత జ్యోతి ప్రజ్వల చేసిన సీఎం జగన్.. అనంతరం ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తూ రిబ్బన్ కట్ చేశారు. ఆ తరువాత ఎయిర్‌పోర్ట్ ఆవరణలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇక ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఎంతో ఘనకీర్తి కలిగిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును పెడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. కాగా, రాష్ట్రంలో ఆరో విమానాశ్రయం అయిన ఈ ఓర్వకల్లు విమానాయశ్రయ నిర్మాణాన్ని దాదాపు 18 నెలలోనే ప్రభుత్వం పూర్తిచేసింది.1,008 ఎకరాల్లో రూ.153 కోట్లతో ఈ ఎయిర్‌పోర్టు నిర్మించగా.. దాదాపు 2,000 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పులో రన్‌వేను అభివృద్ధి చేశారు. నాలుగు విమానాలకు పార్కింగ్‌తో పాటు అన్ని రకాల మౌలిక వసతులను కల్పించారు.
Also read: