Andhra Pradesh Fee Reimbursement: ఫీజులకోసం విద్యార్థులను ఇబ్బది పెడితే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ హేమ చంద్రారెడ్డి అన్నారు. ఏ ఒక్క కళాశాల కూడా విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి వీలు లేదన్నారు. విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా కళాశాలలు ఇబ్బంది పెడితే కఠినచర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో 87 శాతం విద్యార్థులకు ప్రభుత్వమే పూర్తిగా ఫీజులు చెల్లిస్తుందన్నారు. కేవలం ఒక్క క్వార్టర్ ఫీజు మాత్రమే కళాశాలకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని హేమ చంద్రారెడ్డి స్పష్టం చేశారు.
నాణ్యమైన విద్యను అందించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్న హేమ చంద్రారెడ్డి.. విద్యారంగంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం లేదని.. 87 శాతం విద్యార్థులకు పూర్తిగా చెల్లింపులు చేశామని స్పష్టం చేశారు. 2019 నుంచి ఇప్పటివరకు రూ. 4వేల కోట్లు చెల్లించామని తెలిపారు. రూ.1,880 కోట్ల గత ప్రభుత్వ బకాయిలు కూడా జగన్ సీఎం అయ్యాక చెల్లించామని పేర్కొన్నారు. రూ. 770 కోట్లు సీనియర్ విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు చెల్లించామన్నారు. కళాశాల్లో అక్రమాలను నిరోధించేందుకు పలు చర్యలు చేపట్టామన్నారు. వివిధ అంశాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతోందన్నారు.
ప్రభుత్వం చెప్పిన విధంగా ఆలస్యం లేకుండా ప్రతి మూడు నెలలకు ఫీజులు చెల్లిస్తుందన్నారు. అలాగే, ఏడాది ప్రైవేట్ యూనివర్సిటీల్లో 35 శాతం సీట్లను ప్రభుత్వమే భర్తీ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ మొత్తం సీట్లకు ప్రభుత్వమే ఫీజు రీయింబర్సుమెంట్ కూడా ఇస్తుందన్నారు. చాలా పీజీ కాలేజీల్లో విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండానే ఫీజులు తీసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్న ఆయన.. అందుకే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్ రద్దు చేశామన్నారు. పీజీ విద్యాసంస్థలపై విజిలెన్స్ శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారని హేమ చంద్రారెడ్డి వెల్లడించారు.
Read Also…. Crime News: కృష్ణాజిల్లాలో పండుగపూట తీవ్ర విషాదం.. ఆడుకుంటూ చెరువులో పడి నలుగురు చిన్నారులు మృతి