ఏ చిన్న తప్పు జరిగినా ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని(Minister Vidadala Rajini) హెచ్చరించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. సమస్యలపై లోతుగా సమీక్షించి.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని అన్నారు. ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలు పునరావృతం కాకూడదన్న మంత్రి.. మందుల్లేవ్, అంబులెన్స్ లు అందుబాటులో లేవ్ వంటి వార్తలు మళ్లీ రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులకు సూచించారు. చిన్న చిన్న సంఘటనలు కూడా రోగులపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ఏ ఒక్కరు తప్పు చేసినా రోగుల ప్రాణాలకు ముప్పు వాటిల్లినట్లేనని మంత్రి విడదల రజని చెప్పారు. డీఎంహెచ్వోలు, డీసీహెచ్ఎస్ లు, టీచింగ్, జిల్లా, ఏరియా ఆసుపత్రుల సూపరింటెండెంట్ లు ప్రిన్సిపాళ్లతో మంత్రి రజిని.. వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంగళగిరి ఏపీఐఐసీ బిల్డింగ్ లో దూరదృశ్య సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటీ కృష్ణబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
కొవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైద్యఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది సేవా దృక్పథంతో పనిచేశారని మంత్రి ప్రశంసించారు. ఇటీవల చోటుచేసుకున్న సంఘటనల పట్ల కాస్త కఠినంగా వ్యవహరించాల్సి వచ్చిందన్న మంత్రి.. భవిష్యత్ లో మరింత బాధ్యతగా, అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. వైద్యారోగ్యశాఖ సీఎం జగన్మోహన్ రెడ్డి మానస పుత్రిక అని.. చిత్తశుద్ధి, అంకిత భావంతో పనిచేయాలని కోరారు. వైద్య ఆరోగ్య శాఖకు సీఎం సరిపడా బడ్జెట్ ను కేటాయించారన్నారు.
ఏ చిన్న సంఘటన జరిగినా అందరూ బాధ్యులమేనని పేర్కొన్నారు. కింది స్థాయిలో ఎలాంటి ఇబ్బందులున్నా రాష్ట్ర స్థాయి అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఉన్నతాధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్న మంత్రి.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశయాలకనుగుణంగా పనిచేయాలని ఆదేశించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇదీచదవండి
Bangaluru: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మధ్యాహ్నం భోజనం చేశాక హాయిగా నిద్రపోవచ్చు