
ఏపీలోని ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పర్యావరణాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వం.. ఎలక్ట్రానిక్స్ వెహికల్స్‌ను ప్రోత్సహిస్తోంది. ఈ-వెహికల్స్‌పై భారీగా సబ్సిడీలు అందించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఇ-సైకిల్స్‌పై ఏకంగా రూ.10 వేల భారీ రాయితీ ఇస్తోంది. అంటే ఇ-వెహికల్స్ కొంటే రూ.10 వేల తగ్గింపు ప్రభుత్వం నుంచి పొందవచ్చు. ఇందుకోసం ప్రముఖ కంపెనీ అయిన ఈ-మోటోరాడ్స్‌తో ఏపీ ప్రభుత్వం తాజాగా ఒప్పందం కూడా కుదర్చుకుంది. అంతేకాకుండా ఈ సైకిళ్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం గిన్నీస్ రికార్డు కూడా సృష్టించింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
ఈ సైకిళ్లు ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 40 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటి ఒక్కో సైకిల్ ధర రూ.35 వేలుగా ఉంది. అయితే ప్రభుత్వం వీటిపై రూ.10 వేల రాయితీ అందిస్తోంది. దీంతో వీటిని కొనుగోలు చేసినవారికి రూ.25 వేలకు వస్తుంది. తాజాగా సీఎం చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో 5,555 ఇ-సైకిళ్లను పంపిణీ చేశారు. కేవలం 24 గంటల్లోనే ఇది సైకిళ్లను పంపిణీ చేయడం రికార్డుగా చెప్పవచ్చు. దీంతో చిత్తూరు జిల్లా గిన్నీస్ రికార్డ్ సంపాదించుకుంది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ దీనిని అందుకున్నారు. ఎన్టీఆర్ భరోసా పించన్ల పంపిణీలో భాగంగా కుప్పంలోని తూంసీలో చంద్రబాబు ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మూడు కిలోమీటర్ల మేర చంద్రబాబు ఇ-సైకిల్‌పై ర్యాలీ చేపట్టి వేదిక వద్దకు చేరుకున్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ఇ-సైకిళ్లను ప్రోత్సహిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.
24 గంటల్లోనే కుప్పంలో 5555 ఇ-సైకిళ్లను పంపిణీ చేయడం రికార్డు అని చంద్రబాబు తెలిపారు. కుప్పం ఈ రికార్డ్ సొంతం చేసుకుని గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కడం సంతోషంగా ఉందన్నారు. దీంతో కుప్పం సరికొత్త చరిత్ర సృష్టించిందని తెలిపారు. కొత్త చరిత్రకు కుప్పం శ్రీకారం చుట్టిందని, త్వరలోనే మరిన్ని రికార్డులు సృష్టిస్తుందని అన్నారు. ఇంటిలోనే ఈ సైకిళ్లకు ఛార్జింగ్ పెట్టుకోవచ్చని, ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు.