
Andhra Pradesh Government: ఏపీలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిమ్‌లు, స్టేడియాలు, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఇక నుంచి ఏ ఫంక్షన్లకైనా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందని ఏపీ వైద్యశాఖ స్పష్టం చేసింది. 50శాతం పరిమితితో ప్రజారవాణాకు అనుమతిస్తామని, సినిమా థియేటర్లలో 50 శాతం సీట్లకు మాత్రమే అనుమతి అని తెలిపింది. అలాగే ఫ్లెయింగ్ స్క్వాడ్‌తో ప్రైవేటు ఆస్పత్రుల్లో తనిఖీ నిర్వహిస్తామని తెలిపింది.
కోవిడ్ చికిత్సకు అవసరమైన అన్ని రకాల మందులను సమకూరుస్తు్న్నామని, రెమిడెసివిర్ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామని తెలిపింది. రెమిడెసివిర్ కొరత ఉంటే హెల్ఫ్‌లైన్ నంబర్లకు కాల్ చేయాలని సూచించింది.
కాగా, తాజాగా ఏపీలో రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కొత్తగా 9,881 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 10,43,441 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా కరోనాతో 51మంది మృతి చెందగా, ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7,735కి చేరింది. ఇక తాజాగా 4,431 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో 95,131 యాక్టివ్ కేసులు ఉన్నాయి.